రైల్వే మంత్రిత్వ శాఖ
ముంబయి-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం
అహ్మదాబాద్‌లో 100 మీటర్ల పొడవైన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉక్కు వంతెన నిర్మాణం పూర్తి
పురోగమిస్తున్న హై-స్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు.. గుజరాత్‌లో 13వ ఉక్కు వంతెన సిద్ధం
प्रविष्टि तिथि:
29 JAN 2026 7:32PM by PIB Hyderabad
ముంబయి-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అహ్మదాబాద్ జిల్లాలోని భూగర్భ మెట్రో సొరంగం పైన 100 మీటర్ల పొడవైన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉక్కు వంతెనను నిర్మించడంలో సఫలమయ్యారు. ప్రయాణికుల ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని సురక్షిత, ఆధునిక మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి భారతీయ రైల్వేలు కట్టుబడి ఉన్న తీరును ప్రతిబింబించే గొప్ప విజయమని చెప్పవచ్చు. గుజరాత్‌లో మొత్తం 17 స్టీల్ వంతెనల్ని నిర్మించాలని ప్రణాళిక వేసుకొన్నారు. వాటిలో ఇది 13వ స్టీల్ బ్రిడ్జి. ఇది ప్రస్తుత నగర రవాణా వ్యవస్థల సురక్షకు పూచీపడుతూనే, హై-స్పీడ్ రైలు సంధానాన్ని బలోపేతం చేస్తోంది.
అహ్మదాబాద్ జిల్లాలో 30 నుంచి 50 మీటర్ల వంతెన కట్టు (స్పాన్) కలిగిన ‘స్పాన్-బై-స్పాన్’ నిర్మాణాలను ఉపయోగించి బులెట్ ట్రైన్ వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఏమైనా, ఈ ప్రాంతంలో రైల్ అలైన్‌మెంటు కాలూపూర్, షాపూర్ మెట్రో స్టేషన్లను కలిపే భూగర్భ మెట్రో సొరంగంపై నుంచి సాగుతుంది. బులెట్ ట్రైన్ భారం మెట్రో సొరంగం మీద పడకుండా చూడటానికి, దీని పునాదుల్ని సొరంగం నుంచి బాగా దూరంగా ఏర్పరిచారు. ఈ కారణంగా స్పాన్ పొడవును పెంచి సుమారు 100 మీటర్లుగా చేయాల్సివచ్చింది. తదనుగుణంగా, ఈ భాగంలో సూపర్‌స్ట్రక్చరును ఎస్‌బీఎస్ వయాడక్టు నుంచి మార్చివేసి స్టీల్ ట్రస్ బ్రిడ్జి రూపంలో తిరిగి డిజైన్ చేశారు. దీంతో బులెట్ ట్రైన్ కారిడార్‌తో పాటు మెట్రో మౌలిక సదుపాయాలకు కూడా నిర్మాణపరమైన భద్రతను నిర్ధరించడంతో పాటు సార్వజనిక సంపత్తుల్నీ, ప్రయాణికుల రాకపోకల్నీ సురక్షితంగా ఉండేటట్లు చూడడం సాధ్యపడుతోంది.
నిర్దేశిత ప్రదేశంలో నేల మీది నుంచి 16.5 మీటర్ల ఎత్తున కర్రలతో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆధారాల సహాయంతో ఈ వంతెనను కూర్చారు. కూర్పు పని ముగిసిన తరువాత, తాత్కాలిక ఊతాలను చాలా జాగ్రత్తగా తొలగించారు. వంతెనను దించి, కచ్చితంగా అనుకున్న చోటులో శాశ్వత సపోర్ట్ సిస్టమ్‌కు అమర్చారు. దీంతో భద్రతనీ, నిర్మాణం పరంగా కచ్చితత్వాన్నీ నిర్ధారించారు.
ఈ 1,098 మెట్రిక్ టన్నుల బరువున్న ఉక్కు వంతెన పశ్చిమ రైల్వేకు చెందిన అహ్మదాబాద్-సబర్మతీ ప్రధాన మార్గానికి సమాంతరంగా ఏర్పాటైంది. ఈ నిర్మాణం ఎత్తు 14 మీటర్లు, వెడల్పు 15.5 మీటర్లు. మహారాష్ట్ర లోని వర్ధాలో ఉన్న ఒక వర్క్‌షాపులో దీన్ని నిర్మించి, ట్రేలర్లను ఉపయోగించి నిర్దేశిత ప్రదేశానికి తరలించారు. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ తయారీ సామర్థ్యం ఇనుమడించిన తీరును సూచిస్తున్నది.
ప్రధాన నిర్మాణం కూర్పునకు మార్గాన్ని సుగమం చేయడానికి, నిర్దిష్ట ప్రదేశంలో 11.5 x 100 మీటర్ల కొలతతో ఉండే ఒక తాత్కాలిక వేదికను నిర్మించారు. ఈ వంతెన నిర్మాణానికి సుమారు 45,186 టార్-షియర్ టైప్ హై స్ట్రెంత్ (టీటీహెచ్ఎస్) బోల్టుల్ని వాడారు. దీనిపై సీ5 సిస్టమ్ సురక్షాత్మక పెయింటింగ్‌తో పాటు ఇలాస్టోమెరిక్ బేరింగ్స్ పూతను పూశారు. ఇది మన్నికను పెంచడం, దీర్ఘకాలం పాటు సేవను అందించడంతో పాటు ప్రయాణికుల భద్రతకూ తోడ్పడుతుంది.
యాత్రికులకీ, సామాన్య ప్రజానీకానికీ సురక్షితమైన, విశ్వసనీయమైన, భవిష్యత్కాల అవసరాలను కూడా లెక్కలోకి తీసుకొనే మౌలిక సదుపాయాలను అందించాలన్న భారతీయ రైల్వేల కృషికి ఈ విజయం నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో పాటు, హై-స్పీడ్ రైల్ ప్రాజెక్టులను ఎలాంటి అంతరాయాలకూ తావు లేకుండా ప్రస్తుత నగర రవాణా నెట్‌వర్కులతో కలిపింది.
***
(रिलीज़ आईडी: 2220827)
आगंतुक पटल : 5