గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యర్థాలతో నింపే స్థలాలు లేని తొలి నగరంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నో


స్వచ్ఛ్ భారత్ మిషన్ (పట్టణ)లో భాగంగా నగరపాలక పరిధిలోని ఘన వ్యర్థాలను పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయాలనే లక్ష్యాన్ని సాధించిన లక్నో

రోజుకు 700 మెట్రిక్ టన్నుల శుద్ధి సామర్థ్యాన్ని కలిగిన శివారీ ఘన వ్యర్థ నిర్వహణ ప్లాంటు నూతనంగా ఏర్పాటు

లక్నోలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే సామర్థ్యం 96.53 శాతానికి మెరుగుదల..
మూలం వద్దే చెత్తను వేరు చేసే సామర్థ్యం 70 శాతం కన్నా అధికం

प्रविष्टि तिथि: 21 JAN 2026 2:00PM by PIB Hyderabad

శివారీ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటును ప్రారంభించడంతో లక్నో పట్టణ స్థిరతను సాధించే దిశగా ఒక ప్రధానమైన ముందడుగును వేసింది. స్వచ్ఛ్ భారత్ మిషన్ (పట్టణ)లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని ఘన వ్యర్థ పదార్థాలను 100 శాతం మేరకు శాస్త్రీయంగా శుద్ధి చేయాలన్న లక్ష్యాన్ని కూడా లక్నో సాధించింది.

 

ఉత్తరప్రదేశ్ రాజధాని నగరమైన లక్నో సుమారు 40 లక్షల జనాభాతో, 7.5 లక్షల వాణిజ్య సంస్థలతో త్వరగా అభివృద్ధి చెందుతున్న నగరంగా పేరు తెచ్చుకుంటోంది. శరవేగంగా నమోదవుతున్న ఈ అభివృద్ధి కారణంగా, చెత్త నిర్వహణతో పాటు పర్యావరణ స్థిరత్వాన్ని సాధించడంలో సంక్లిష్ట సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి.  శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాలను శుద్ధి చేయడం, పునర్వినియోగించడం, సుస్థిర ప్రాతిపదికన నగర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం.. ఇలా బహుముఖ వ్యూహాన్ని లక్నో నగరపాలక సంస్థ (ఎల్ఎంసీ) అమలుచేస్తూ, ఈ సవాళ్లను పరిష్కరిస్తోంది. దీంతో నగరంలో ప్రజారోగ్యంతో పాటు పర్యావరణ నాణ్యత కూడా మెరుగుపడుతోంది.

వ్యర్థాల నిర్వహణ విషయంలో శాస్త్రీయ, స్థిర దృష్టికోణాన్ని అనుసరిస్తూ శివారీ ప్లాంటు రూపంలో మూడో తాజా వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని లక్నో ఇటీవల ప్రారంభించింది. దీనితో పాటు, ఉత్తరప్రదేశ్‌లో నగరపాలక సంస్థ పరిధిలో ఘన వ్యర్థాలను 100 శాతం శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసిన మొదటి నగరంగా కూడా లక్నో నిలిచింది. అంతేకాదు, ‘తాజా వ్యర్థాలను నింపే స్థలాలు లేని నగరం’ అనే విశిష్టతను కూడా లక్నో సాధించింది.

కొత్తగా ప్రారంభించిన ప్లాంటుకు ప్రతి రోజూ 700 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే పనిచేస్తున్న రెండు కేంద్రాలను కలుపుకొంటే రోజూ మొత్తం 2,100 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసే సామర్థ్యం లక్నో నగరపాలక సంస్థ సొంతమైంది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారబోసే అవసరం లేకుండా పోయింది. ఇది నగర వ్యర్థాల నిర్వహణ దిశగా ఒక ముఖ్య విజయాన్ని సూచిస్తోందని చెప్పవచ్చు.

నగరంలో ప్రతి రోజూ దాదాపు 2,000 మెట్రిక్ టన్నుల చెత్త పోగు పడుతోంది. దీనిని నిర్వహించడానికి, రోజుకు 700 మెట్రిక్ టన్నుల శుద్ధి సామర్థ్యం కలిగిన మూడు వ్యర్థాల శుద్ధి ప్లాంటులను ఎల్ఎంసీ, భూమి గ్రీన్ ఎనర్జీ నెలకొల్పాయి. చెత్తను సేంద్రియ వ్యర్థాలు, రసాయనిక వ్యర్థాల కింద రెండు భాగాలుగా వేరు చేస్తారు. సేంద్రియ వ్యర్థాలు 55 శాతం, రసాయనిక వ్యర్థాలు 45 శాతం చొప్పున ఉంటున్నాయి. సేంద్రియ వ్యర్థాలను ఎరువుగానూ, బయోగ్యాస్‌గానూ మారుస్తారు. రసాయనిక వ్యర్థాలను పునర్వినియోగం కోసం రీసైకిల్ చేయడం గాని, లేదా వ్యర్థాల నుంచి రూపొందించిన ఇంధనం (ఆర్‌డీఎఫ్)గా గాని మారుస్తారు. లక్నోలో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే సామర్థ్యం ఇదివరకటి తో పోలిస్తే ఇప్పుడు పెరిగి, 96.53 శాతానికి చేరుకుంది. మూలం వద్దే చెత్తను వేరుచేసే స్థాయి 70 శాతానికి మించింది.

నగరపాలక సంస్థ అందజేసిన సమాచారం ప్రకారం, నగరంలో సుమారు 18.5 లక్షల మెట్రిక్ టన్నుల పాత చెత్త నుంచి దాదాపు 12.86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేశారు. దీంతో లభించిన ఆర్‌డీఎఫ్, నిర్మాణ సంబంధిత, కూల్చివేతల  సంబంధిత వ్యర్థాలు, బయో-సాయిల్, శుద్ధి పరచడానికి వీలు లేని భాగాలను పర్యావరణానుకూల పద్ధతుల్లో ఉపయోగిస్తున్నారు. రీసైకిలింగ్, కో-ప్రాసెసింగ్, లోతట్టు ప్రాంతాలలో భూమి మట్టాన్ని పెంచడం వంటివి పర్యావరణ అనుకూల పద్ధతుల కిందకు వస్తాయి. వ్యర్థాల శుద్ధి ద్వారా అనేక విలువైన ఉప ఉత్పాదనలు రూపొందుతున్నాయి. సుమారు 2.7 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాల ఆధారిత ఇంధనాన్ని (ఆర్‌డీఎఫ్) దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో సిమెంటు, కాగితం తయారీలో కో-ప్రాసెసింగ్ ప్రక్రియ కోసం పంపించారు. శుద్ధికి వీలుపడని భాగాలను (ఇవి దాదాపు 4.38 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉన్నాయి), బయో-సాయిల్ (ఇది 0.59 లక్షల మెట్రిక్ టన్నులుంది)తో పాటు నిర్మాణ, కూల్చివేత కార్యక్రమాల సంబంధిత వ్యర్థాలు (ఇది 2.35 లక్షల టన్నుల మేరకు ఉంది) వంటి సామగ్రిని లోతట్టు ప్రాంతాల్లో పోసి భూమి మట్టాన్ని సరి చేయడానికీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకీ వాడారు.

దీంతో, క్రమక్రమంగా ఒక ముఖ్య మార్పు చోటు చేసుకొంది.. నిర్దిష్ట ప్రాంతంలో 25 ఎకరాల కన్నా ఎక్కువ భూమిని మళ్లీ ఉపయోగించడానికి వీలుగా అభివృద్ధి చేశారు. ఈ చోటును ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేయగల రోజుకు 2,100 మెట్రిక్ టన్నుల వ్యర్థాల శుద్ధి సామర్థ్యం కలిగి ఉండే  కేంద్రంగా తీర్చిదిద్దే పనులు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో విండ్‌రో ప్యాడ్లు, అంతర్గత రహదారులు, షెడ్లు, బరువును తూచడానికి ఉపయోగపడే వంతెనలతో పాటు ఒక పూర్తి స్థాయి వ్యర్థాల ప్రోసెసింగ్ అనుబంధ విస్తారిత వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.

రాబోయే కాలంలో, చెత్త నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయగల (డబ్ల్యూటీఈ) ప్లాంటును కూడా శివారీలో ఏర్పాటు చేసేందుకు ఎల్ఎంసీ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదించిన ప్లాంటు.. వ్యర్థాల నుంచి లభించే ఆర్‌డీఎఫ్‌ను విద్యుచ్ఛక్తిగా మారుస్తుంది. 15 మెగావాట్ల డబ్ల్యూటీఈ ప్లాంటులో నిత్యం 1,000 నుంచి 1,200 మెట్రిక్ టన్నుల ఆర్‌డీఎఫ్‌ను ఉపయోగించాలని ప్రణాళిక వేశారు. దీంతో దాదాపుగా 500 కిలీమీటర్ల దూరంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు ఆర్‌డీఎఫ్‌ను చేరవేయడానికి అయ్యే ఖర్చు తగ్గడమే కాకుండా, దూరం కూడా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది.

చక్రీయ ఆర్థిక వ్యవస్థ సిద్దాంతాలను అనుసరించడానికి ఒక ఉదాహరణగా లక్నోలో వ్యర్థాల నిర్వహణ నమూనా నిలుస్తోంది. దీనిలో వనరులను గరిష్ఠ స్థాయిలో పునర్వినియోగించడం, వ్యర్థ పదార్థాల నిల్వలను కనీస స్థాయికి పరిమితం చేయడం, రీసైకిలింగుకు అనువైన సామగ్రిని పునర్వినియోగించడాన్ని ప్రోత్సహించడం భాగంగా ఉన్నాయి. లక్నో నగరపాలక సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమాలు దేశ, విదేశీ స్థాయులలో ఇతర నగరాలకూ, ఏజెన్సీలకూ స్ఫూర్తిని అందించేవేనని చెప్పవచ్చు.

స్వచ్ఛ్ ఆదత్ సే స్వచ్ఛ్ భారత్

 

***


(रिलीज़ आईडी: 2217289) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी