రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఎన్ఎస్ సుదర్శిని: ఖండాంతర సముద్రయాన సాహస యాత్ర ప్రారంభించనున్న లోకాయన్ 26
10 నెలల సుదీర్ఘ యాత్ర ద్వారా 13 దేశాల్లోని 18 పోర్టులను చుట్టిరానున్న నౌక
ఎస్కేల్ ఎ సెట్ (ఫ్రాన్స్), సెయిల్ 250 (యూఎస్ఏ) కార్యక్రమాల్లో పాల్గొనేలా సముద్ర యాత్ర
प्रविष्टि तिथि:
19 JAN 2026 6:28PM by PIB Hyderabad
భారత నౌకాదళ సెయిల్ ట్రైనింగ్ షిప్ ఐఎన్ఎస్ సుదర్శిని, 10 నెలల పాటు సాగే ప్రతిష్ఠాత్మక యాత్ర లోకాయన్ 26ను 20 జనవరి 2026న ప్రారంభించనుంది. భారతదేశ సుసంపన్న సముద్రయాన వారసత్వాన్ని, మహాసముద్రాల మీదుగా వసుధైవ కుటుంబం అనే భావజాలాన్ని ఈ యాత్ర ప్రతిబింబిస్తుంది. సుమారు 22,000 నాటికల్ మైళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 13 దేశాల్లోని 18 విదేశీ పోర్టులను ఐఎన్ఎస్ సుదర్శిని సందర్శించనుంది.
ఫ్రాన్స్‌లో జరిగే ఎస్కాల్ ఎ సెట్, అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే సెయిల్ 250 వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ టాల్ షిప్ కార్యక్రమాల్లో ఐఎన్ఎస్ సుదర్శిని పాల్గొనటం ఈ నౌకా యాత్ర విశేషం. ఈ రెండు వేడుకలల్లోనూ ఐఎన్ఎస్ సుదర్శిని భారతదేశపు నౌకాయాన వారసత్వానికి, సముద్ర సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలవనుంది.
ఈ సముద్ర ప్రయాణంలో 200 మందికి పైగా భారత నౌకాదళం, భారత తీర రక్షక దళ శిక్షణార్థులు ఇంటెన్సిన్ సెయిల్ శిక్షణను పొందుతారు. దీనిద్వారా సుదీర్ఘ సముద్ర ప్రయాణ గమనం, సంప్రదాయ నౌకాయాన నైపుణ్యాల్లో అమూల్యమైన అనుభవాన్ని పొందుతారు. టాల్ షిప్ లోని జీవన విధానాలను వారికి పరిచయం చేయటమే కాక, వివిధ దేశాల నౌకాదళ శిక్షణార్థులతో పరస్పరం చర్చించే అవకాశాన్ని ఈ శిక్షణ కల్పిస్తుంది. వృత్తిపరమైన నైపుణ్యాల మార్పిడికి, శాశ్వత స్నేహ సంబంధాలను పెంపొందించుకోవటానికి సహకరిస్తుంది.
పర్యటించే దేశాల నౌకాదళాలతో చర్చలు, సముద్ర భాగస్వామ్య కార్యక్రమాల్లో ఐఎన్ఎస్ సుదర్శిని పాల్గొంటుంది. సముద్ర తీర దేశాల మధ్య సహకారాన్ని బలపరుస్తూ, మహాసాగర్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తుంది. ఈ సముద్ర ప్రయాణం శక్తిమంతమైన సాంస్కృతిక దౌత్యానికి చిహ్నంగా నిలుస్తుంది. వివిధ దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని, సహకార వారధులను నిర్మించటంలో భారత నౌకాదళానికున్న ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తుంది.
భారత నౌకాదళ రెండవ సెయిల్ ట్రైనింగ్ షిప్ ఐఎన్ఎస్ సుదర్శిని ఇప్పటివరకు 1,40,000 నాటికల్ మైళ్లకు పైగా దూరం ప్రయాణించింది. లోకాయన్ 26 యాత్ర ద్వారా ఈ నౌక.. భారత నౌకాదళ సముద్ర శక్తికి, వృత్తి నౌపుణ్యానికి, అంతర్జాతీయ స్థాయిలో భారత సద్భావనకు దిక్సూచిలా నిలుస్తుంది.
UILP.jpeg)
NV3C.jpeg)
***
(रिलीज़ आईडी: 2216399)
आगंतुक पटल : 2