రాజ్యసభ సచివాలయం
పార్లమెంటు కోసం బాధ్యతయుతమైన కృత్రిమ మేధ అభివృద్ధికి మానవ సంస్థాగత జ్ఞానం కీలకం: డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్
నియంత్రణ లేని ఆవిష్కరణ ప్రమాదాన్ని తెస్తుంది.. అలాగే ఆవిష్కరణ లేని నియంత్రణ స్తబ్దతకు దారితీస్తుందన్న శ్రీ హరివంశ్
పార్లమెంటులో కృత్రిమ మేధ వినియోగం సత్యంపై ఆధారపడాలి. నైతికతకు కట్టుబడి, మానవ నిర్ణయాలతో మార్గనిర్దేశం పొందాలి. ప్రజాస్వామ్య విలువలకు జవాబుదారీగా ఉండాలని పిలుపునిచ్చిన డిప్యూటీ చైర్మన్
నాడు పోస్టు చేయడమైనది:
15 JAN 2026 5:57PM by PIB Hyderabad
శాసనసభల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని రూపొందించడంలో మానవుల సంస్థాగత జ్ఞాపకశక్తి ఎంత కీలకమో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ వివరించారు. పార్లమెంటులోకి ఏఐ ప్రవేశించాలంటే అది ఖచ్చితంగా జవాబుదారీతనంతో, సందర్భోచితంగా, విశ్వసనీయంగా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో నిర్వహించిన కామన్వెల్త్ స్పీకర్లు, అధ్యక్షుల 28వ సమావేశంలో (సీఎస్‌పీఎసీ) భాగంగా.. ‘పార్లమెంటులో ఏఐ అవలంబన’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత పార్లమెంటు సమర్థవంతంగా పనిచేయడం కోసం అభివృద్ధి చేస్తున్న వివిధ డిజిటల్, కృత్రిమ మేధ పరికరాలను శ్రీ హరివంశ్ ప్రస్తావించారు.
కృత్రిమ మేధ అభివృద్ధిలో హైబ్రిడ్ విధాన అవసరాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వివరించారు. ‘‘ఒక వ్యక్తి కొత్త సంస్థలో చేరినప్పుడు వారు తమతో పాటు రెండు ముఖ్యమైన లక్షణాలను తీసుకువస్తారు. అవే నైపుణ్యం, జ్ఞానం. నైపుణ్యాలను నేర్చుకోవచ్చు, బదిలీ చేయవచ్చు లేదా బయటి వ్యక్తుల ద్వారా పొందవచ్చు. కానీ జ్ఞానం అనేది సందర్భోచితమైనది. ఆ సంస్థలో లోతుగా నిక్షిప్తమై ఉంటుంది. పార్లమెంటరీ జ్ఞానం అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది దశాబ్దాల పాటు జరిగిన చర్చలు, తీర్పులు, సంప్రదాయాలు, రాజ్యాంగ పద్ధతుల ద్వారా నిర్మితమవుతుంది. ఇదే సూత్రం కృత్రిమ మేధకు కూడా సమానంగా వర్తిస్తుంది’’ అని పేర్కొన్నారు. అలాగే పార్లమెంట్ల కోసం జవాబుదారీతనంతో కూడిన ఏఐని అభివృద్ధి చేయడంలో మానవుల సంస్థాగత జ్ఞానమే ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు
.‘‘వ్యవస్థలో మానవ పర్యవేక్షణ, జోక్యం చేసుకునే సామర్థ్యం అంతర్భాగంగా ఉండాలి. నియంత్రణ లేని ఆవిష్కరణ ముప్పును తెస్తుంది. అలాగే ఆవిష్కరణ లేని నియంత్రణ స్థబ్ధతకు దారితీస్తుంది.” అందుకే పార్లమెంటు ఈ రెండింటి మధ్య జాగ్రత్తతో కూడిన సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
పార్లమెంటులో ఇప్పటికే అమలులో ఉన్న ఏఐ ఆచరణాత్మక వినియోగాల గురించి వివరిస్తూ.. సభా పత్రాల అనువాదం, పార్లమెంటరీ చర్చల విశ్లేషణ, 22 భాషల్లో ప్రశ్నల రూపకల్పన కోసం కృత్రిమ నమూనాలను ఉపయోగిస్తున్నట్లు శ్రీ హరివంశ్ పేర్కొన్నారు. “మేం సుమారు 48 వేల పదాలతో కూడిన ‘పార్లమెంటరీ భాషా నిఘంటువు’ను అభివృద్ధి చేశాం. దీనిని పార్లమెంటరీ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ నమూనాలో విలీనం చేశాం. ఇది అంతర్గత వినియోగదారులలో అంగీకారాన్ని గణనీయంగా పెంచడమే కాకుండా ఖచ్చితత్వాన్ని కూడా మెరుగుపరిచింది. ఇక్కడ కృత్రిమ మేధ కేవలం ఒక సహాయక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. తుది నియంత్రణ మాత్రం మానవ అనువాదకుల చేతుల్లోనే ఉంటుంది.” అని ఆయన తెలిపారు. అయితే శాసనసభల సందర్భంలో “పార్లమెంటులో కృత్రిమ మేధ వినియోగం సత్యంపై ఆధారపడి, నైతికతకు కట్టుబడి, మానవ విచక్షణతో మార్గనిర్దేశం పొందాలి. ప్రజాస్వామ్య విలువలకు జవాబుదారీగా ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు.
తన ముగింపు ప్రసంగంలో కామన్వెల్త్ దేశాల మధ్య కృత్రిమ మేధ వినియోగంపై మరింత పార్లమెంటరీ సహకారం అవసరమని ఆయన కోరారు.
ఈ రెండు రోజుల ఈ సదస్సుకు భారత్ నాలుగోసారి ఆతిథ్యం ఇస్తోంది. గతంలో 1971, 1986, 2010 సంవత్సరాల్లో ఈ సమావేశాలు జరిగాయి. ఈసారి సదస్సు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభమైంది.
***
(రిలీజ్ ఐడి: 2215130)
సందర్శకుల సూచీ సంఖ్య : : 40