సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఢిల్లీ ప్రపంచ పుస్తక మహోత్సవం - 2026లో ప్రచురణల విభాగం: గొప్ప పుస్తకాలు, ప్రముఖ పత్రికలతో సన్నద్ధం
· ప్రగతి మైదాన్‌లో జనవరి 10 నుంచి 18 వరకు ప్రదర్శన
प्रविष्टि तिथि:
09 JAN 2026 6:17PM by PIB Hyderabad
న్యూఢిల్లీ ప్రగతి మైదానంలో జనవరి 10 నుంచి 18 వరకు జరగనున్న ప్రపంచ పుస్తక మహోత్సవం - 2026లో.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రచురణల విభాగం పాల్గొనబోతోంది. భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీవో) సహకారంతో.. విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్త సంస్థ అయిన నేషనల్ బుక్ ట్రస్టు ఈ 9 రోజుల మెగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తోంది.
ఈ పుస్తక మహోత్సవ ఇతివృత్తమైన ‘భారత సైనిక చరిత్ర: పరాక్రమం, వివేచన @ 75’కు అనుగుణంగా.. ఇంగ్లిష్, హిందీ, ఇతర భారతీయ భాషల్లోని విభిన్న పుస్తకాలతో సందర్శకులను, పుస్తక ప్రియులను అలరించేందుకు ప్రచురణల విభాగం సిద్ధమైంది. అక్కడ ప్రదర్శనలో ఉన్న పుస్తకాలు.. కార్యక్రమానికి విచ్చేసే పుస్తక ప్రియులను మంత్రముగ్ధులను చేయడం ఖాయం.
కళలు - సంస్కృతి, చరిత్ర, సినిమా, ప్రముఖులు - జీవిత చరిత్రలు, దేశమూ - ప్రజలు, గాంధేయ సాహిత్యం, బాల సాహిత్యం వంటి విభిన్న అంశాలపై ఈ ప్రదర్శనలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ‘రాష్ట్రపతి భవన్ సిరీస్’, ‘రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎంపిక చేసిన ప్రసంగాలు’, ‘మహాత్మాగాంధీ రచనా సర్వస్వం’, ‘పండిత మదన్ మోహన్ మాలవీయ రచనా సర్వస్వం’ వంటి ప్రచురణల విభాగపు అత్యున్నత స్థాయి పుస్తకాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నారు.
ఈ ఆకట్టుకునే పుస్తకాలతోపాటు.. విస్తృత ప్రజాదరణ ఉన్న యోజన, కురుక్షేత్ర, ఆజ్‌కల్, బాలభారతి పత్రికలను కూడా ప్రచురణల విభాగం ప్రదర్శిస్తోంది. ఈ విభాగం ప్రచురించే పత్రికలు, ఉద్యోగ సమాచారం/ రోజ్‌గార్ సమాచార్ పత్రికల వార్షిక చందాలను కూడా సందర్శకులు చెల్లించవచ్చు.
ప్రచురణ రంగ సంస్థలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమాల్లో న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక మహోత్సవం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రచురణ సంస్థలు ఇందులో పాల్గొంటాయి. నచ్చిన పుస్తకాల కొనుగోలుతోపాటు.. రచయితల సమావేశం, యువ కార్నర్, బాల రచయితల కార్నర్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ పుస్తక ప్రదర్శనలో భాగంగా సందర్శకులు వీక్షించవచ్చు.
న్యూఢిల్లీ భారత్ మండపంలోని హాల్ నం. 5, స్టాల్ నం. డి-08లో ప్రచురణల విభాగం పుస్తకాలు, పత్రికలను ప్రదర్శించనుంది.
ప్రచురణల విభాగం గురించి:
జాతీయ ప్రాధాన్యమున్న అంశాలు, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే పుస్తకాలు, పత్రికల భాండాగారం ప్రచురణల విభాగం. 1941లో నెలకొల్పిన ప్రచురణల విభాగం భారత ప్రభుత్వ ప్రధాన ప్రచురణ సంస్థ. అభివృద్ధి, భారత చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, జీవిత చరిత్రలు, సైన్స్, సాంకేతికత, పర్యావరణం, ఉపాధి వంటి విభిన్న అంశాలపై వివిధ భాషల్లో పుస్తకాలను, పత్రికలను ఇది ప్రచురిస్తోంది. పాఠకులు, ప్రచురణకర్తల్లో ఈ విభాగానికి ఎంతో విశ్వసనీయతను ఉంది. ఇది ప్రామాణికతకు పేరెన్నిక గన్నది.
యోజన, కురుక్షేత్ర, ఆజ్‌కల్ వంటి ప్రముఖ మాస పత్రికలతోపాటు.. ‘ఉద్యోగ సమాచారం’, ‘రోజ్‌గార్ సమాచార్’ వారపత్రికలు కూడా ఈ విభాగం ప్రధాన ప్రచురణలు. వీటితోపాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసే వార్షిక రిఫరెన్స్ గ్రంథం ‘ఇండియా ఇయర్ బుక్’ను కూడా ఈ విభాగం ప్రచురిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2213655)
आगंतुक पटल : 3