రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో పలు గిన్నిస్ ప్రపంచ రికార్డులను నమోదు చేసిన ఎన్‌హెచ్ఏఐ

प्रविष्टि तिथि: 11 JAN 2026 7:51PM by PIB Hyderabad

బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్ఏఐ నాలుగు గిన్నీస్ ప్రపంచ రికార్డులను నమోదు చేసింది:

* కేవలం 24 గంటల్లోనే 28.89 లేన్ కిలోమీటర్ల మేర బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరాయంగా వేసిన రికార్డు

* 24 గంటల్లో 10,655 మెట్రిక్ టన్నుల అత్యధిక బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరాయంగా వేసి సరికొత్త రికార్డు

* 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరాయంగా పరిచిన రికార్డు

* నిరంతరాయంగా 156 లేన్ కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు చేసిన రికార్డు

అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం, నిర్మాణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌పై (ఎన్‌-544జీ) ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించిన ఎన్‌హెచ్ఏఐ సరికొత్త చరిత్రను లిఖించింది.

2026 జనవరి 6న ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి సమీపంలో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను ఎన్‌హెచ్ఏఐ నెలకొల్పింది. 24 గంటల వ్యవధిలో 28.89 లేన్ కిలోమీటర్లు లేదా 3-లేన్ల వెడల్పు కలిగిన 9.63 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి అత్యంత పొడవులో బిటుమినస్ కాంక్రీట్ వేసినందుకు మొదటి రికార్డు నెలకొల్పింది. 24 గంటల్లో అత్యధికంగా 10,655 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరాయంగా వేసి రెండో రికార్డు నమోదు చేసింది. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లోని ఆరు-లేన్ల జాతీయ రహదారి ప్రాజెక్టులో నెలకొన్న ఈ రెండు రికార్డులు ప్రపంచంలోనే మొదటివి.

ఈ ఉత్తేజాన్నిమరింత ముందుకు తీసుకెళ్తూ 2026 జనవరి 11న మరో రెండు అదనపు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి. నిరంతరాయంగా 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను వేయడం, 156 లేన్ కిలోమీటర్లు లేదా 3-లేన్ల వెడల్పు కలిగిన 52 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిరంతరంగా నిర్మించటం ద్వారా ఈ రికార్డులు నెలకొన్నాయి. గతంలో ఉన్న 84.4 లేన్ కిలోమీటర్లు లేదా 2-లేన్ల వెడల్పు కలిగిన 42.2 కిలోమీటర్ల రికార్డును ఇది అధిగమించింది. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లోని ప్యాకేజీ-2, ప్యాకేజీ-3 విభాగాలలో ఈ రికార్డులు నమోదు చేసిన ఘట్టాలు నమోదయ్యాయి. 

70 టిప్పర్లు, ఐదు హాట్ మిక్స్ ప్లాంట్లు, ఒక పేవర్, 17 రోలర్లతో కూడిన అత్యాధునిక నిర్మాణ పరికరాలు, యంత్రాలను మోహరించడం ద్వారా ఈ చారిత్రాత్మక ఘనతను నిర్మాణ సంస్థ అయిన రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ సంస్థ, ఎన్‌హెచ్ఏఐ సాధించాయి. కఠినమైన నాణ్యత హామీ యంత్రాంగాల మద్దతుతో, ఐఐటీ బాంబే వంటి ప్రముఖ సంస్థల సహాయంతో నాణ్యత నియంత్రణకు సంబంధించిన పర్యవేక్షణ చేపట్టారు. దీనితో పాటు ‘ఓఈఎం’లు (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్) కూడా ఈ పనుల్లో పాలుపంచుకున్నాయి. ఇవి నాణ్యత, భద్రతకు సంబంధించిన అత్యున్నత ప్రమాణాలతో పనులు జరిగేలా చూసుకున్నాయి. 

343 కిలోమీటర్ల పొడవైన యాక్సెస్-కంట్రోల్డ్ ఆరు-లేన్ల బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌ను సురక్షితమైన, వేగవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని ఇచ్చేలా రూపొందించారు. ఇందులో 17 ఇంటర్‌ఛేంజ్‌లు, 10 వే-సైడ్ సౌకర్యాలు, 5.3 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉన్నాయి. ఈ కారిడార్‌లో సుమారు 21 కిలోమీటర్ల భాగం అటవీ ప్రాంతం గుండా వెళ్తుంది. 

గణనీయమైన ఆర్థిక, రవాణా ప్రయోజనాలను ఈ కారిడార్ అందించనుంది. పూర్తయిన తర్వాత ఇది ప్రయాణ దూరాన్ని ప్రస్తుతం ఉన్న 635 కిలోమీటర్ల నుంచి 535 కిలోమీటర్లకు అంటే 100 కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది. అలాగే ప్రయాణ సమయాన్ని ప్రస్తుతం ఉన్న పన్నెండు గంటల నుంచి సుమారు ఎనిమిది గంటలకు అంటే దాదాపు నాలుగు గంటల మేర తగ్గిస్తుంది. విజయవాడతో బెంగళూరును అనుసంధానించడం ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, ఉత్తర ప్రాంతాలకు.. అలాగే కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్‌కు మధ్య అనుసంధానతను మెరుగుపరుస్తూ ప్రాంతీయ అనుసంధానతను గణనీయంగా పెంచుతుంది.

ప్రపంచ స్థాయి జాతీయ రహదారి మౌలిక సదుపాయాలను అందించడంలో ఎన్‌హెచ్ఏఐకి ఉన్న అంకితభావానికి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా సురక్షితమైన, సమర్థవంతమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కారిడార్‌లను నిర్మించాలనే భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ రికార్డులను ఎన్‌హెచ్ఏఐ సాధించింది. 


(रिलीज़ आईडी: 2213627) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी