మిష్టి (తీర ప్రాంత ఆవాసాలు, ప్రత్యక్ష ఆదాయానికి మడ అడవుల పెంపకం) పథకంపై ఆంధ్రప్రదేశ్‌లో 2026 జనవరి 8, 9వ తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సు విజయవంతమైంది.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మిష్టి పథకం ద్వారా మడ అడవుల పరిరక్షణలో రాష్ట్రాలకు సహకరిస్తున్న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. మడ అడవుల సంరక్షణ, పునరుద్ధరణపై చర్చించటానికి అటవీ శాఖ అధికారులు, నిపుణులు, సంబంధిత భాగస్వాములు ఈ కార్యశాలలో పాల్గొన్నారు.
జాతీయ కాంపా సీఈఓ శ్రీ ఆనంద్ మోహన్ కీలక ప్రసంగమిస్తూ, మిష్టి పథకం ఉద్దేశ్యాలను, అమలు ప్రణాళికను వివరించారు. మడ అడవుల వ్యవస్థ అభివృద్ధి, సంరక్షణే మిష్టి పథక ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా మడ అడవుల పునరుద్ధరణ, తీర ప్రాంత రక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, తీరప్రాంత ప్రజల జీవనోపాధికి అవకాశాలను కల్పించటంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ (ఎంఏసీ) లక్ష్యాలకు అనుగుణంగా ఈ మిషన్ పనిచేస్తుంది. యూఎన్ఎఫ్సీసీసీ కాప్-27 సదస్సు సందర్భంగా ఈ కూటమిలో క్రియాశీల సభ్య దేశంగా భారత్ చేరింది.
వాతావరణ మార్పులను తట్టుకోవటం, తీరప్రాంత రక్షణ, స్థిరమైన ఆర్థిక ప్రయోజనాలు అందింటంలో మడ అడవుల కీలక పాత్రను నేషనల్ కాంపా సీఈఓ స్పష్టం చేశారు. వీటిని సమర్థవంతంగా అమలు చేయటానికి వివిధ రాష్ట్రాలు, సంస్థలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరముందన్నారు.
జ్ఞానాన్ని పంచుకోవటానికి, ఉత్తమ పద్ధతులపై చర్చించటానికి, విధానపరమైన సంభాషణలకు ఈ కార్యశాల వేదికగా నిలిచింది. మిష్టి ద్వారా మడ అడవుల పర్యావరణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు, ప్రజల సుస్థిర జీవనోపాధి పట్ల ప్రాధాన్యతను ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.