ఉప రాష్ట్రపతి సచివాలయం
చెన్నైలో 9వ సిద్ధ వైద్య దినోత్సవ వేడుకలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
సిద్ధ వైద్యం భారతీయ నాగరిక జ్ఞానంలో లోతుగా పాతుకుపోయిన సజీవ సంప్రదాయమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి
సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో అనుసంధానించాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి
భారతీయ ఆరోగ్య దృక్పథానికి సాంప్రదాయ వైద్యం అత్యంత కీలకమన్న ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
03 JAN 2026 5:30PM by PIB Hyderabad
చెన్నైలో జరిగిన 9వ సిద్ధ వైద్య దినోత్సవ వేడుకలను భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహర్షి అగస్త్యునికి నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి.. ప్రస్తుత ఆరోగ్య సంరక్షణలో సిద్ధ వైద్య విధానం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. సిద్ధ వైద్యం భారతీయ నాగరికత జ్ఞానంలో లోతుగా పాతుకుపోయిన ఒక సజీవ సంప్రదాయమని ఆయన అభివర్ణించారు. దేశ, విదేశాల్లోని సిద్ధ వైద్యులు, పరిశోధకులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయుష్ మంత్రిత్వశాఖ పరిధిలోని సిద్ధ, ఆయుర్వేద, యునాని, యోగా వంటి సంప్రదాయ ఆరోగ్య విధానాలు గతానికి సంబంధించినవి మాత్రమే కావని, కాల పరీక్షను తట్టుకొని నేటికీ లక్షలాది మంది ప్రజల సంక్షేమానికి తోడ్పడుతున్న పద్ధతులని ఆయన పేర్కొన్నారు. శరీరం, మనసు, ప్రకృతి మధ్య సమన్వయంపై ఆధారపడిన సిద్ధ వైద్య విధానం ఆరోగ్యం, నివారణ, సంరక్షణ, జీవనశైలి నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. నేటి ఆధునిక కాలంలో పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులు, ఒత్తిడి, పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సంప్రదాయ వైద్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
సిద్ధ వైద్య ప్రత్యేకతను వివరిస్తూ.. ఇది కేవలం వ్యాధి లక్షణాలకు మాత్రమే కాకుండా, వ్యాధి మూల కారణాలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. ఈ సమగ్ర విధానం ద్వారా రోగులకు సంపూర్ణ నివారణ, కోలుకుంటామనే ఆశను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను పరిరక్షించి, ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు.సిద్ధ వైద్యం నైతిక, తాత్విక పునాదులను కాపాడుతూనే, ఆ జ్ఞానాన్ని రక్షించడానికి, ఆధునికీకరించడానికి, ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడానికి పరిశోధకులు, వైద్యులు, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా, నయం చేయలేని వ్యాధులకు పరిష్కారాలను కనుగొనడానికి సిద్ధ వైద్యంలో శాస్త్రీయ పరిశోధనలు చేపట్టాలని యువ విద్యార్థులను, పరిశోధకులను ఆయన ప్రోత్సహించారు.
ప్రతి వైద్య విధానానికి దాని సొంత బలాలు,ప్రయోజనాలు ఉంటాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. మానవాళి ప్రయోజనం కోసం ఆయా వైద్య పద్ధతుల విశిష్టతలను ఉపయోగించుకుంటూ, అన్ని రకాల వైద్య వ్యవస్థల పట్ల సానుకూల, సమ్మిళిత దృక్పథాన్ని అవలంబించాల్సిన ప్రాముఖ్యతను ఆయన వెల్లడించారు.
సిద్ధ దినోత్సవం ఒక ముఖ్యమైన జ్ఞాపికగా పనిచేస్తుందని పేర్కొంటూ.. ఆరోగ్యకరమైన, సమతుల్యమైన, సుస్థిరమైన సమాజాన్ని నిర్మించడానికి సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.
ఈ ఏడాది వేడుకలను ‘‘ప్రపంచ ఆరోగ్యానికి సిద్ధ వైద్యం’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. సిద్ధ వైద్య పితామహుడిగా పిలిచే అగస్త్య మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సిద్ధ వైద్యులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పండితులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంతకుముందు ఈ వేదిక వద్ద ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఉపరాష్ట్రపతి సందర్శించారు. సిద్ధ వైద్య గ్రంథాలు, పుస్తకాలు, ముడి పదార్థాలు మరియు మూలికా ఔషధాల విస్తారమైన సేకరణను ప్రదర్శించినందుకు ఆయన ఆయుష్ మంత్రిత్వ శాఖను అభినందించారు. ఈ ప్రదర్శన సిద్ధ వైద్య విధానం సుసంపన్నమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
9వ సిద్ధ వైద్య దినోత్సవ వేడుకలను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ, తమిళనాడు ప్రభుత్వ భారతీయ వైద్య, హోమియోపతి డైరెక్టరేట్ సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా, సిద్ధ వైద్య రంగంలో విశేషమైన,ప్రశంసనీయమైన కృషి చేసిన అయిదుగురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత),కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్, తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మా సుబ్రమణియన్, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మోనాలిసా దాస్,ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2211497)
आगंतुक पटल : 7