ఉప రాష్ట్రపతి సచివాలయం
వెల్లూరులో శ్రీ శక్తి అమ్మవారి స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి
నిజమైన ఆధ్యాత్మికత కేవలం ఆచారాల్లోనే కాకుండా ప్రేమ, కరుణ, తోటి మానవులకు సేవ చేయడంలో కూడా ఉందన్న ఉపరాష్ట్రపతి
పర్యావరణాన్ని పరిరక్షించడం దైవిక సేవలో ఒక రూపమన్న ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
03 JAN 2026 2:30PM by PIB Hyderabad
తమిళనాడులోని వెల్లూరులో ఉన్న శ్రీపురంలో నేడు జరిగినశ్రీ శక్తి అమ్మవారి స్వర్ణోత్సవ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. శ్రీ శక్తి అమ్మ ఆధ్యాత్మిక ప్రయాణానికి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగమవ్వడం తనకు అపార ఆనందాన్ని కలిగించిందని ఆయన తెలిపారు.
శ్రీపురం స్వర్ణ దేవాలయం పవిత్రత, ఆధ్యాత్మిక ఔన్నత్యం.. ఆలయాన్ని సందర్శించిన భారత మాజీ రాష్ట్రపతులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, శ్రీ రామ్ నాథ్ కోవింద్, గత నెలలో జరిగిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పర్యటనల ద్వారా ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
ధర్మంపై శ్రీ శక్తి అమ్మ అంకితభావాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన మార్గదర్శకత్వం కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా సమగ్ర సామాజిక సేవలకుకూడా విస్తరించిందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలు కల్పించడం, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ వంటి దీర్ఘకాలిక కార్యక్రమాలు, అలాగే ప్రతిరోజు వేలాది మందికి భోజనం అందించే అన్నదానం కార్యక్రమం వంటి శ్రీపురంలో చేపట్టిన విస్తృత సేవా కార్యకలాపాలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమాలను నిజమైన భక్తి స్ఫూర్తితో నిర్వహిస్తున్న గొప్ప సేవలుగా ఆయన అభివర్ణించారు.
శ్రీపురం క్యాంపస్లో 50,000కి పైగా చెట్లను నాటడం, అలాగే సమీపంలోని కైలాసగిరి కొండలపై లక్షలాది మొక్కలను నాటడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. దీనిని భూ తల్లికి, మానవాళికి అందిస్తున్న గొప్ప సహకారమని ఆయన కొనియాడారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ఇది గొప్ప బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. పర్యావరణాన్ని రక్షించడం కూడా ఒక రకమైన దైవిక సేవగా పేర్కొన్నారు.
నిజమైన ఆధ్యాత్మికత అనేది కేవలం ఆచారాలు, పూజలు మాత్రమే కాదని... తోటి మానవుల పట్ల ప్రేమ, కరుణ, సేవను కలిగి ఉండటమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత కవి సుబ్రహ్మణ్య భారతి చెప్పిన ‘‘ప్రేమను మించిన తపస్సు మరొకటి లేదు" అనే మాటలను ఆయన గుర్తుచేశారు. సమాజాన్ని ప్రేమించడం, సేవ చేయడం ఆధ్యాత్మిక క్రమశిక్షణకు అత్యున్నత రూపమని తెలిపారు.
శ్రీ శక్తి అమ్మను ప్రస్తుత యుగానికి గొప్ప ఆధ్యాత్మిక జ్యోతిగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. తన జీవితం, పనుల ద్వారా "ప్రేమే దైవం’’ అనే సూత్రాన్ని నిరూపిస్తూ, సమాజంలో ధర్మాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని శక్తి అమ్మ పెంపొందిస్తున్నారని కొనియాడారు.
***
(రిలీజ్ ఐడి: 2211492)
సందర్శకుల సూచీ సంఖ్య : : 41