ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీ కర్ణాటక సంఘం అమృత మహోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 25 FEB 2023 9:44PM by PIB Hyderabad

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ ప్రహ్లాద్ జోషి, పార్లమెంటులో మా సీనియర్ సహచరుడు డాక్టర్ శ్రీ వీరేంద్ర హెగ్డే, పరమ పూజనీయ స్వామి నిర్మలానందనాథ, పరమ పూజనీయులైన శ్రీ శ్రీ శివరాత్రి దేశికేంద్ర స్వామి, శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామి, శ్రీ శ్రీ నంజవధూత స్వామి, శ్రీ శ్రీ శివమూర్తి శివాచార్య స్వామి, కేంద్ర మంత్రిమండలిలోని నా ఇతర సహచరులు, ఎంపీ శ్రీ సి.టి.రవి, ఢిల్లీ కర్ణాటక సంఘం సభ్యులు, సోదరీసోదరులారా!

ముందుగా అందరికీ నమస్కారం.. “ఎల్లాదరు ఇరు, ఎంతాదరు ఇరు, ఎందెందిగు నీ కన్నడవాగి ఇరు” (ఎక్కడున్నా... ఎలా ఉన్నా... ఎల్లప్పుడూ కన్నడిగుడివిగానే ఉండు) అనే అద్భుత  వారసత్వాన్ని ఢిల్లీ-కర్ణాటక సంఘం ఇవాళ కొనసాగిస్తోంది. భారత 75 ఏళ్ల స్వాతంత్ర్య అమృత మహోత్సవం నేపథ్యంలో ‘ఢిల్లీ కర్ణాటక సంఘం’ కూడా 75వ వార్షికోత్సవం నిర్వహించుకుంటోంది. ఆనాటి ఘట్టాలను స్మరించుకుంటూ, పరిస్థితులను అంచనా వేసే ప్రయత్నంలో నిత్య సత్యమైన భారతీయ ఆత్మ మనకు దర్శనమిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో ఢిల్లీ కర్ణాటక సంఘం ఏర్పాటు కావడాన్ని బట్టి, దేశాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యం దిశగా ప్రజల్లో ఐక్యత ఎంత పటిష్ఠంగా ఉన్నదీ అవగతమవుతుంది. స్వాతంత్ర్య ‘అమృత కాలం’ తొలి దశలోనూ దేశంలో అదే శక్తి, అంకితభావం సజీవ చైతన్యంతో తొణికిసలాడటం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సంఘం గురించి కలలుగని, దాన్ని సాకారం చేసిన మహనీయులందరికీ ఈ సందర్భంగా నేను శిరసాభివందనం చేస్తున్నాను. ఈ 75 సంవత్సరాల ప్రయాణం అంత సులభమైనదేమీ కాదు... ఇందులో అనేక ఒడుదొడుకులు ఉంటాయి. చాలా మందిని మన వెంట నడిపించాల్సి ఉంటుంది... తదనుగుణంగా ఈ సంఘాన్ని 75 ఏళ్లుగా నడిపిస్తూ... ఈ స్థాయికి తెచ్చిన వారందరూ అభినందనీయులే. దేశ పురోగమనంలో కర్ణాటక ప్రజల అవిరళ కృషికి కూడా నేను వందనం చేస్తున్నాను.

మిత్రులారా!

దేశం గుర్తింపు, సంప్రదాయాలు, స్ఫూర్తి ఏదైనప్పటికీ కర్ణాటక ప్రస్తావన లేనిదే భారత్‌కు సంపూర్ణ నిర్వచనం ఇవ్వలేం. పురాణ కాలం నాటినుంచీ ఈ దేశంలో కర్ణాటక పాత్ర హనుమంతునితో పోల్చదగినది. హనుమంతుడు లేనిదే రాముడు లేడు... రామాయణం లేదు. ఒకవేళ యుగ రూపాంతరీకరణ సంబంధిత కార్యక్రమం ఏదైనా అయోధ్య నుంచి ప్రారంభమై రామేశ్వరం దాకా వెళ్తే అది నిస్సందేహంగా కర్ణాటకలోనే బలం పుంజుకుంటుంది.

సోదరీసోదరులారా!

మధ్యయుగాల్లో దురాక్రమణదారులు భారతదేశాన్ని నాశనం చేయబూని, సోమనాథ్ వంటి ప్రాంతంలో శివలింగాలను ధ్వంసం చేసినప్పుడు- కర్ణాటక వాసులైన దేవర దాసిమయ్య, మదర చెన్నయ్య, దోహర కక్కయ్య, బసవేశ్వర వంటి సాధువులు ప్రజలను ‘ఇష్టలింగం’ (ఆత్మలింగం)తో అనుసంధానం చేశారు. దుష్టశక్తులు దేశంపై దాడికి పాల్పడితే- రాణి అబ్బక్క, ఒనకే ఓబవ్వ, రాణి చెన్నమ్మ, క్రాంతివీర సంగొల్లి రాయన్న వంటి వీరులు దుర్భేద్య దుర్గాల్లా నిలిచారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా మహారాజా కృష్ణరాజ ఒడియార్, ‘కాశీ హిందూ విశ్వవిద్యాలయం’ తొలి ఉప కులపతి, ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్ప, భారతరత్న ఎం.విశ్వేశ్వరాయ తదితరుల రూపాల్లో కర్ణాటక సదా దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇంతకు ముందే పూజ్య స్వామీజీ తన కాశీ అనుభవాలను వివరించారు.

మిత్రులారా!

కన్నడ ప్రజలు ‘ఒకే భారత్‌ - శ్రేష్ఠ భారత్’ మంత్రాన్ని అనుసరిస్తుంటారు. కర్ణాటక గడ్డ వారిలో సదా ఈ స్ఫూర్తిని నింపుతుంది. జాతీయ కవి కువెంపు రచించిన ‘నాదగీతం’ మనం ఇంతకుముందే విన్నాం... పూజ్య స్వామీజీ కూడా దాన్ని వివరించారు. ఎంత అద్భుతమైన పదబంధాలవి: “జయ భారత జననియ తనూజాతే.. జయ హే కర్ణాటక మాతే’ (భరతమాత పుత్రికవైన ఓ కర్ణాటక మాతా.. నీకు జయం జయం!). ‘జయ భారత జననియ తనూజాతే’ అని కర్ణాటక మాతను ఆయన ఎంతో ఆత్మీయతో కీర్తించారు. ఈ పద ప్రయోగం భారత నాగరికతను వివరించడమేగాక కర్ణాటక రాష్ట్ర ప్రాధాన్యాన్యాన్ని, పాత్రను కూడా ప్రస్తావిస్తుంది. ఈ పాట స్ఫూర్తిని అర్థం చేసుకున్నప్పుడు- ‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని కూడా మనం అర్థం చేసుకోగలం.

మిత్రులారా!

భారత్‌ నేడు జి20 వంటి అంతర్జాతీయ కూటమికి అధ్యక్ష బాధ్యత నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా ఈ దేశ ఆదర్శాలే మనకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. బసవేశ్వరుల వారు ‘అనుభవ మండపం’ ద్వారా చేసిన ఉద్బోధ, ప్రజాస్వామ్య ప్రవచనాలు దేశానికి వెలుగు దివ్వెలయ్యాయి. లండన్‌లో భగవాన్ బసవేశ్వర విగ్రహావిష్కరణ అవకాశం లభించడం నా అదృష్టం. ఆయన బోధనలను వివిధ భాషలలో విడుదల చేసే సదవకాశం కూడా నాకు కలసివచ్చింది. కర్ణాటక ఆలోచనా సంప్రదాయం, దాని ప్రభావం నిత్య సత్యాలని ఈ విజయాలన్నీ రుజువు చేస్తున్నాయి.

మిత్రులారా!

కర్ణాటక రాష్ట్రం సంప్రదాయాలకే కాదు.. సాంకేతిక పరిజ్ఞానానికీ నిలయం. ఇక్కడ చారిత్రక సంస్కృతితోపాటు అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) కూడా ఉంది. ఇవాళ ఉదయం నేను జర్మనీ చాన్సలర్‌తో సమావేశమైన నేపథ్యంలో రేపటి నుంచి ఆయన కార్యక్రమం బెంగళూరులో కొనసాగబోవడంపై నేనెంతో సంతోషిస్తున్నాను. అలాగే బెంగళూరులో ఈ రోజు జి20 కూటమి సంబంధిత ఓ కీలక సమావేశం కూడా నిర్వహిస్తున్నారు.

మిత్రులారా!

ఏ దేశాధినేతను కలిసినా ప్రాచీన-ఆధునిక భారత కోణాలు రెండూ వారికి అవగతమయ్యేలా నా వంతు కృషి నేను చేస్తాను. ఇక సంప్రదాయం, సాంకేతికతలు నేటి నవ భారత్‌ స్వరూప, స్వభావాల్లో అంతర్భాగాలు. ఈ దేశం నేడు అభివృద్ధిని, వారసత్వాన్ని, ప్రగతిని, సంప్రదాయాలను ఏకకాలంలో కొనసాగిస్తోంది. ఆ మేరకు ఇటు ప్రాచీన ఆలయాలను, సాంస్కృతిక కేంద్రాలను పునరుద్ధరిస్తూనే- అటు డిజిటల్ చెల్లింపులలో ప్రపంచ అగ్రగామిగా దేశం దూసుకెళ్తోంది. ఒకనాడు అపహరణకు గురైన శతాబ్దాల నాటి మన అపురూప విగ్రహాలు, కళాఖండాలను విదేశాల నుంచి నేటి నవ భారత్‌ తిరిగి మాతృభూమికి తెస్తోంది. అలాగే రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా రాబడుతోంది. నవ భారత అభివృద్ధి మార్గమిదే... మనల్ని వికసిత భారత్‌ లక్ష్యంవైపు నడిపించేది ఇదే!

మిత్రులారా!

కర్ణాటక అభివృద్ధి ఈ దేశానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికీ అత్యంత ప్రాధాన్యాంశం. ఒకనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశాక నాయకులు కర్ణాటక సొమ్మును తరలించుకుపోయే రోజులుండేవి. కానీ, నేడు దేశం సొమ్ము, వనరుల నుంచి కర్ణాటక ప్రగతి కోసం చిత్తశుద్ధితో నిధుల కేటాయింపు ఆనవాయితీగా మారింది. ఎలాగంటే- 2009-2014 మధ్య కేంద్రం ఈ రాష్ట్రానికి ఏటా రూ.11,000 కోట్లు కేటాయించేది. అయితే, మా ప్రభుత్వం వచ్చాక 2019-2023 మధ్య ఇప్పటిదాకా రూ.30,000 కోట్లు కేటాయించాం. అలాగే 2009-2014 మధ్య రైల్వేశాఖ మంత్రి కర్ణాటక వారైనా, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై వ్యయం ఐదేళ్లలో రూ.4,000 కోట్లకన్నా తక్కువే! మరోవైపు మా ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.7,000 కోట్లు మంజూరు చేసింది. నేను చెబుతున్నది ఈ ఒక్క సంవత్సరం లెక్కలే! ఇక గత ప్రభుత్వం ఐదేళ్లలో జాతీయ రహదారుల కోసం కర్ణాటకకు రూ.6000 కోట్లు ఇవ్వగా, మా ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఏటా రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. మరి అయిదేళ్లలో రూ.6,000 కోట్లు, ఏటా రూ.5,000 కోట్లకు మధ్యగల వ్యత్యాసాన్ని మీరే గమనించండి!

మిత్రులారా!

ఎంతో కాలం నుంచీ నెరవేరని ఎగువ భద్ర ప్రాజెక్టు డిమాండ్‌ను కూడా మా ప్రభుత్వం నెరవేరుస్తోంది. దీనివల్ల తుమకూరు, చిక్కమగళూరు, చిత్రదుర్గ, దావణగేరె సహా మధ్య కర్ణాటకలోని విశాల కరవు పీడిత ప్రాంత రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నవ్య పురోగమన వేగం కర్ణాటక రూపురేఖలను వేగంగా మార్చేస్తోంది. ఢిల్లీలో నివసిస్తూ, చాలా కాలం తర్వాత తమ గ్రామాలకు వెళ్లే కన్నడిగులు ఇదంతా చూసి ఆశ్చర్యపోవడమే కాదు... గర్వించడం కూడా తథ్యం.

మిత్రులారా!

అభివృద్ధి, విజయం, జ్ఞాన వికాస సంబంధిత అనేక చారిత్రక ఘట్టాలను ఢిల్లీ కర్ణాటక సంఘం 75 ఏళ్ల మనుగడ మనకు అవగతం చేస్తోంది. ఇక రాబోయే 25 ఏళ్లు మరింత కీలకం. ఈ అమృత కాలంలో మీరు, ఢిల్లీ కర్ణాటక సంఘం అనేక అత్యావశ్యక కార్యక్రమాలు చేపట్టవచ్చు. మీరు ప్రధానంగా దృష్టి సారించాల్సిన రెండు అంశాలు- ‘కళికె మట్టు కళె’... అంటే- జ్ఞానం, కళలు. మనం ‘కళికె’ గురించి మాట్లాడుతుంటే- కన్నడ భాష ఎంత అందమైనదో, ఆ సాహిత్యం ఎంత సుసంపన్నమైనదో మనకు తెలుసు. అంతేకాదు... ఈ భాష మాట్లాడే వారికి చదివే అలవాటు బలమైనది కావడం కన్నడ  భాష మరో ప్రత్యేకత. కన్నడలో ఒక మంచి కొత్త పుస్తకం ప్రచురితమైతే, కొన్ని వారాల్లోనే ప్రచురణకర్తలు పునర్ముద్రణకు వెళ్లాల్సి ఉంటుంది. కర్ణాటకకుగల ఈ అదృష్టం ఇతర భాషలకు లేదు.

మీలో ఢిల్లీ వాసులైన చాలా మందికి సొంత రాష్ట్రం వెలుపలగల నవ తరం ఎదుర్కొనే భాషాపరమైన ఇబ్బందుల గురించి తెలిసే ఉంటుంది. అందువల్ల, జగద్గురు బసవేశ్వరుని మాటలైనా... హరిదాసుల కీర్తనలైనా.. కుమార వ్యాసుని మహాభారతమైనా... కువెంపు విరచిత రామాయణ దర్శనమైనా ఈ విస్తృత వారసత్వాన్ని భవిష్యత్తరానికి సంక్రమింపజేయడం చాలా ముఖ్యం. మీరొక గ్రంథాలయాన్ని కూడా నడుపుతున్నారని నేను విన్నాను. అలాగే మీరు స్టడీ సర్కిల్ సదస్సులు, సాహిత్య సంబంధిత చర్చల వంటి అనేక కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. మీరు దీన్ని మరింత ప్రభావశీలం చేయవచ్చు. తద్వారా మీరు ఢిల్లీలోని కన్నడిగుల పిల్లల్లో మాతృభాషలో చదివే అలవాటును పెంచడానికి తోడ్పడవచ్చు. ఇటువంటి కృషి ద్వారా ‘కళికె’ లేదా జ్ఞానవ్యాప్తి ఢిల్లీలోని కన్నడ ప్రజలతోపాటు ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. ‘కన్నడ కలియిరి’.. అంటే- కన్నడ భాష నేర్చుకోవడం, ‘కన్నడ కలిసిరి’... అంటే- కన్నడ భాష నేర్పించడం రెండింటికీ తోడ్పడుతుంది.

మిత్రులారా!

‘కళికె’తోపాటు కర్ణాటక ‘కళా’ రంగంలోనూ అసాధారణ విజయాలు సాధించింది. ఇంత తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమంలో యావత్‌ కర్ణాటక సంస్కృతిని గమనించే అవకాశం నాకు కల్పించినందుకు నేను కృతజ్ఞుడిని. ప్రాచీన, జానపద కళలు రెండింటిలోనూ కర్ణాటక సుసంపన్నం. కన్సాలె నుంచి కర్ణాటక సంగీతం దాకా... భరతనాట్యం నుంచి యక్షగానం వరకూ... కర్ణాటక కళల్లోని  ప్రతి రూపం మన హృదయాల్లో ఆనందం నింపుతుంది. ఢిల్లీ కర్ణాటక సంఘం కొన్నేళ్లుగా ఇలాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించింది. కానీ, ఇప్పుడు ఈ ప్రయత్నాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినపుడు ప్రతి ఢిల్లీ కన్నడిగ కుటుంబం తమతోపాటు ఒక కన్నడిగేతర కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం నా సూచన. తద్వారా వారు కర్ణాటక వైభవాన్ని చూసి, ఈ రాష్ట్రంలోని సుసంపన్న కళారూపాలను ఆస్వాదించగలరు. కన్నడ సంస్కృతిని చిత్రీకరించే కొన్ని సినిమాలు కన్నడిగేతరులలోనూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇది కర్ణాటక గురించి తెలుసుకోవడం, అవగతం చేసుకోవడంపై ప్రజల్లో ఉత్సుకతను పెంచింది. ఇక మనం కూడా ఆ ఉత్కంఠను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే, మీ నుంచి నేను ఆశిస్తున్నది మరొకటుంది. అదేమిటంటే- ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కర్ణాటక కళాకారులు, మేధావులు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్, పీఎం మ్యూజియం, కర్తవ్య పథ్ తదితర ప్రదేశాలను తప్పక సందర్శించండి. మీరు గర్వంతో ఉప్పొంగే ఎన్నో అంశాలు అక్కడ మీకు దర్శనమిస్తాయి. ఈ పనులన్నీ ఎప్పుడో చేయాల్సినవేనని మీకు అనిపిస్తుంది. కాబట్టి, ఈ సందర్శన తర్వాత మీ అనుభవాలను కర్ణాటక ప్రజలతో పంచుకోవాలని నా ఆకాంక్ష.

మిత్రులారా!

భారత్‌ చొరవ ఫలితంగా ప్రపంచం ప్రస్తుతం ఈ ఏడాదిని ‘అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం’గా నిర్వహించుకుంటోంది. భారతీయ చిరుధాన్యాలకు... అంటే’ ‘సిరి’ ధాన్యాలకు కర్ణాటక ప్రధాన కూడలి. మీ ‘శ్రీ అన్న’-రాగి పంట కూడా కర్ణాటక సంస్కృతి, సామాజిక గుర్తింపులో ఒక భాగం. మన యడియూరప్ప గారి కాలం నుంచే ఈ రాష్ట్రంలో ‘సిరి ధాన్యాల’పై ప్రచారం దిశగా అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. ఇవాళ యావద్దేశం కన్నడిగుల బాటన చిరుధాన్యాలను ‘శ్రీ అన్న’గా వ్యవహరిస్తోంది. అలాగే ప్రపంచమంతా దీని ప్రయోజనాలను, అవసరాన్ని గుర్తిస్తున్నందున త్వరలోనే డిమాండ్ కూడా పెరుగుతుంది. తద్వారా కర్ణాటక ప్రజలకు, చిన్న రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా!

మన దేశం 2047లో స్వాతంత్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే సమయానికి ‘వికసిత భారత్‌’ సాకారం కానుంది. అదేవిధంగా ఢిల్లీ కర్ణాటక సంఘం కూడా తన వందో ఏట ప్రవేశిస్తుంది. కాబట్టి, భారత్‌ శాశ్వత కీర్తికి మీ వంతు కృషి గురించి కూడా అప్పుడు తప్పక చర్చించుకుంటారు. ప్రస్తుత అమృత మహోత్సవాల నేపథ్యంలో ఈ 75 ఏళ్ల మీ ప్రయాణానికిగాను మీకందరికీ మరోసారి నా శుభాకాంక్షలు. మమ్మల్ని ఆశీర్వదించి, స్ఫూర్తినిచ్చిన పూజ్య గురువులకూ హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి పవిత్ర ఆశీస్సులు పొందే అదృష్టం కూడా లభించినందుకు నేనెంతో గర్విస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ మళ్లీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నాతో గళం కలిపి నినదించండి...

భారత్ మాతా కీ- జై!

భారత్ మాతా కీ- జై!

భారత్ మాతా కీ- జై!

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

***


(రిలీజ్ ఐడి: 2209697) సందర్శకుల సూచీ సంఖ్య : : 19