గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఢిల్లీ మెట్రో అయిదో దశ (ఎ) ప్రాజెక్టులో భాగంగా మూడు కొత్త కారిడార్లకు మంత్రివర్గం ఆమోదం
प्रविष्टि तिथि:
24 DEC 2025 3:28PM by PIB Hyderabad
ఢిల్లీ మెట్రో అయిదో దశ(ఎ) ప్రాజెక్టులో భాగంగా మూడు కొత్త కారిడార్లు - ఆర్‌కే ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ (9.913 కి.మీ.), ఏరోసిటీ నుంచి ఐజీడీ ఎయిర్పోర్టు టీ-1 (2.263 కి.మీ.), తుగ్లకాబాద్ నుంచి కాళింది కుంజ్ (3.9 కి.మీ.)లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 16.076 కి.మీ.ల పొడవైన ఈ ప్రాజెక్టు జాతీయ రాజధాని పరిధిలో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. ఢిల్లీ మెట్రో అయిదో దశ (ఎ) ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.12014.91 కోట్లు. ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీలు సమకూరుస్తాయి.
అన్ని కర్తవ్య భవన్లను సెంట్రల్ విస్టా కారిడార్ అనుసంధానిస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో కార్యాలయాలకు వెళ్లేవారికి, సందర్శకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీంతో 60,000 మంది ఉద్యోగులు, 2 లక్షల మంది సందర్శకులకు ప్రతి రోజు లబ్ధి చేకూరుతుంది. ఈ కారిడార్లు కాలుష్యాన్ని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి జీవన సౌలభ్యాన్ని పెంపొందిస్తాయి.
వివరాలు:
బొటానికల్ గార్డెన్-ఆర్‌కే ఆశ్రమ్ మార్గ్ కారిడార్‌కు కొనసాగింపుగా ఆర్‌కే ఆశ్రమ్ మార్గ్ - ఇంద్రప్రస్థ విభాగం ఉంటుంది. ఇది సెంట్రల్ విస్టా ప్రాంతానికి మెట్రో సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఏరోసిటీ-ఐజీడీ ఎయిర్ పోర్ట్ టెర్మినల్1, తుగ్లకాబాద్ - కాళింది కుంజ్ సెక్షన్లు ఏరోసిటీ-తుగ్లకాబాద్ కారిడార్‌కు కొనసాగింపుగా ఉంటాయి. ఇవి దేశ రాజధానిలోని తుగ్లకాబాద్, సాకేత్, కాళింది కుంజ్ తదితర దక్షిణ ప్రాంతాలతో విమానాశ్రయానికి అనుసంధానాన్ని పెంచుతాయి. ఈ విస్తరణలో 13 స్టేషన్లు ఉంటాయి. వీటిలో 10 భూగర్భ స్టేషన్లు కాగా మిగిలిన మూడు ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి.
కారిడార్ 1 అయిన ఆర్‌కే ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ (9.913 కి.మీ.) పూర్తయితే.. పశ్చిమ, ఉత్తర, పాత ఢిల్లీ ప్రాంతాల నుంచి మధ్య ఢిల్లీకి రవాణా వసతులు మెరుగవుతాయి. మరో రెండు కారిడార్లైన ఏరోసిటీ నుంచి ఐజీడీ ఎయిర్పోర్టు టీ-1 (2.263 కి.మీ.), తుగ్లకాబాద్ నుంచి కాళింది కుంజ్ (3.9 కి.మీ.) దక్షిణ ఢిల్లీని సాకేత్, ఛత్తర్పూర్ మీదుగా దేశీయ విమానాశ్రయం టెర్మినల్ 1తో కలుపుతాయి. ఇవి జాతీయ రాజధాని పరిధిలో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి.
అయిదో దశ (ఎ) ప్రాజెక్టులో భాగంగా చేపట్టే ఈ విస్తరణ పనులు మధ్య ఢిల్లీ, దేశీయ విమానాశ్రయ ప్రాంతాల్లో ఢిల్లీ మెట్రో పరిధిని విస్తరిస్తాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. మజెంటా లైన్, గోల్డెన్ లైన్ విస్తరణ వల్ల రహదారులపై రద్దీ తగ్గుతుంది. ఫలితంగా మోటారు వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం తగ్గుముఖం పడుతుంది.
ఆర్‌కే ఆశ్రమ్ మార్గ్-ఇంద్రప్రస్థ విభాగంలో వచ్చే స్టేషన్లు: ఆర్‌కే ఆశ్రమ్ మార్గ్, శివాజీ స్టేడియం, సెంట్రల్ సెక్రటేరియట్, కర్తవ్య భవన్, ఇండియా గేట్, వార్ మెమోరియల్ - హైకోర్టు, బరోడా హౌస్, భారత్ మండపం, ఇంద్రప్రస్థ.
తుగ్లకాబాద్ - కాళింది కుంజ్ విభాగంలో సరితా విహార్ డిపో, మదన్‌పూర్ ఖదర్, కాళింది కుంజ్ స్టేషన్లు ఉంటాయి. అలాగే ఐజీడీ టీ-1 స్టేషన్‌తో ఏరో సిటీ స్టేషన్ అనుసంధానమవుతుంది.
111 కి.మీ., 83 స్టేషన్లతో కూడిన ఫేజ్ - 4 నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఫేజ్-4 (మూడో ప్రాధాన్యం) కారిడార్ల నిర్మాణంలో 80.43 శాతం పని పూర్తయింది. 2026 డిసెంబర్ నాటికి ఫేజ్-4 (మూడో ప్రాధాన్యం) దశల వారీగా పూర్తయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం రోజుకు సగటున 65 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీ మెట్రో ద్వారా ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు గరిష్ట స్థాయిలో 2025, ఆగస్టు 8న 81.87 లక్షల మంది ప్రయాణించారు. సమయపాలన, విశ్వసనీయత, భద్రత లాంటి ఎంఆర్‌టీఎస్ పరామితుల్లో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ.. నగరానికి జీవనాడిగా ఢిల్లీ మెట్రో మారింది.
ప్రస్తుతం.. ఢిల్లీ, ఎన్సీఆర్లో మొత్తం 395 కి.మీ. మేర విస్తరించి, 289 స్టేషన్లను కలిగి ఉన్న 12 మెట్రో లైన్లను డీఎంఆర్‌సీ నిర్వహిస్తుంది. భారతదేశంలో అతి పెద్ద మెట్రో వ్యవస్థగా, ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో వ్యవస్థల్లో ఒకటిగా ఢిల్లీ మెట్రో నిలిచింది.
***
(रिलीज़ आईडी: 2208245)
आगंतुक पटल : 3