ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఇన్‌ఫ్లూయెంజా చింతన్ శిబిరం
ఫ్లూ వ్యాప్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సంసిద్ధత, ప్రతిస్పందన కోసం
వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం
ఇన్‌ఫ్లూయెంజాను ఎదుర్కోవడానికి నిఘా, ముందస్తు హెచ్చరికలు, ప్రమాద అంచనా, ప్రయోగశాల వ్యవస్థలు,
వైద్య ప్రతిస్పందన, ‘వన్ హెల్త్’ సమన్వయం వంటి అంశాలతో కూడిన సమగ్ర, నిర్మాణాత్మకమైన జాబితా రూపకల్పన
సీజనల్, జంతువుల ద్వారా వచ్చే ఇన్‌ఫ్లూయెంజాను పరిష్కరించడానికి ఏకోన్ముఖ ప్రభుత్వం, వన్ హెల్త్ విధానం అవలంబించడంపై ఏకాభిప్రాయంతో ముగిసిన చింతన్ శిబిరం
సమగ్ర నిఘా వ్యవస్థ బలోపేతం, ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచడం, మహమ్మారి సంసిద్ధత కోసం సమన్వయంతో పనిచేస్తామని స్పష్టం చేసిన వివిధ మంత్రిత్వ శాఖలు
प्रविष्टि तिथि:
23 DEC 2025 3:39PM by PIB Hyderabad
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్ సీడీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ తో కలిసి డిసెంబర్ 22, 23 తేదీల్లో న్యూఢిల్లీలో రెండు రోజుల ఇన్‌ఫ్లూయెంజా చింతన్ శిబిరాన్ని నిర్వహించింది. ఇన్‌ఫ్లూయెంజా సంసిద్ధత, ప్రతిస్పందన కోసం అంతర్-మంత్రిత్వశాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం’’ ఇతివృత్తంతో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ శిబిరంలో మంత్రిత్వశాఖ విపత్తు నిర్వహణ విభాగం, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం (డీఏహెచ్ డీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డీసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే ఇన్‌ఫ్లుయెంజా సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణమే స్పందించే విధానాలను బలోపేతం చేయడానికి ఈ శిబిరం ఒక నిర్మాణాత్మక వేదికను అందించింది.
చింతన్ శిబిర తొలి కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా వీడియో సందేశం ద్వారా ప్రారంభించారు. ఇన్‌ఫ్లుయెంజా వంటి మహమ్మారులను ఎదుర్కోవడంలో దేశ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ముందస్తు ప్రణాళికలు సహా సమన్వయంతో కూడిన జాగ్రత్తలు, ప్రతిస్పందన చర్యలు ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. సమగ్ర వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమం (ఐడీఎస్ పీ) కీలక పాత్రను ప్రస్తావించారు. బలమైన, సహకార నిఘా వ్యవస్థలను నిర్ధారించడానికి కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయ ప్రయత్నాల గురించి వివరించారు.
చింతన్ శిబిరంలో ఆరోగ్యం, పశుసంవర్ధక, వ్యవసాయం, పర్యావరణం వంటి మంత్రిత్వ శాఖల నుంచి సుమారు 100 మంది ప్రముఖ ప్రతినిధులు, ప్రముఖ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములు పాల్గొన్నారు. ఇది ప్రభుత్వ ‘వన్ హెల్త్’, ‘ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం' అనే విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. గతంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు నమోదైన పదకొండు రాష్ట్రాలు ఈ శిబిరంలో స్వయంగా పాల్గొన్నాయి. రాష్ట్ర, జిల్లా నిఘా విభాగాల నుంచి ఐడీఎస్ పీ అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఉత్తమ పద్ధతులను, అనుభవాలను పంచుకోవడం ద్వారా పరస్పర అభ్యాసానికి అవకాశం కలిగింది. చర్చల్లో సాంకేతిక ప్రదర్శనలు, నిపుణుల చర్చలు, గ్రూప్ వర్క్ సమావేశాలు, రాష్ట్ర ప్రదర్శనలు ఉన్నాయి.
ఇన్‌ఫ్లూయెంజా ఇప్పటికీ ప్రజారోగ్యానికి ముఖ్యమైన సవాలుగా నిలుస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాలానుగుణంగా వచ్చే ఇన్‌ఫ్లూయెంజా కేసుల ధోరణులను ఐడీఎస్‌పీ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంది. ఇన్ఫ్లుయెంజాను ఎదుర్కోనేందుకు సరైన జాగ్రత్తలు అవసరమని, ఈ సిద్ధత విజయవంతంగా జరగాలంటే వివిధ రంగాల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే నిఘా వ్యవస్థను బలపరచడం, ప్రయోగశాల సామర్థ్యాన్ని పెంచడం, వైద్య సన్నద్ధతను బలోపేతం చేయడం వంటి చర్యల ద్వారా సీజనల్, జంతువుల ద్వారా వచ్చే ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తిని త్వరగా గుర్తించి దానికి అడ్డుకునేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఒక వ్యవస్థీకృత సన్నద్ధత పరిశీలన జాబితాను రూపొందించడం చింతన్ శిబిరం ముఖ్య ఫలితాల్లో ఒకటి. కేంద్రం, రాష్ట్రాలు, జిల్లాలకు మార్గదర్శకంగా ఉండే ఈ చెక్‌లిస్టు ముఖ్యంగా ఈ క్రింది నాలుగు ప్రధాన విభాగాలపై దృష్టి సారిస్తుంది.
· నిఘా, ముందస్తు హెచ్చరిక, ప్రమాద అంచనా
· ప్రయోగశాల వ్యవస్థల బలోపేతం
· ఆసుపత్రి సన్నద్ధత, క్లినికల్ ప్రతిస్పందన
· వన్ హెల్త్ సమన్వయం, ప్రమాద కమ్యూనికేషన్, సముదాయ భాగస్వామ్యం
సీజనల్, జంతువుల ద్వారా వచ్చే ఇన్‌ఫ్లూయెంజాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏకోన్ముఖ ప్రభుత్వం, వన్ హెల్త్ విధానాన్ని అనుసరించాలనే ఏకాభిప్రాయంతో చింతన్ శిబిరం ముగిసింది. మానవ, జంతు, వన్యప్రాణులు సంబంధిత రంగాల్లో సమగ్ర నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రయోగశాలు, జన్యువిశ్లేషణ సామర్థ్యాలను మెరుగుపరచడం, సకాలంలో సమాచార మార్పిడి, ప్రతి రంగానికి చెందిన చర్యా ప్రణాళికలను జాతీయ మహమ్మారి సిద్ధత ప్రణాళికకు అనుసంధానం చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలు అంగీకరించాయి. ఈ చర్చల ద్వారా ఇన్‌ఫ్లుయెంజా, ఇతర శ్వాసకోశ వైరల్ వ్యాధులను నివారించడం, తొలిదశలో గుర్తించడం, ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన జాతీయ చర్యలకు భారత్ కట్టుబడి ఉందని మరోసారి నిరూపితమైంది.
***
(रिलीज़ आईडी: 2207931)
आगंतुक पटल : 6