నీతి ఆయోగ్
భారత్ లో ఉన్నత విద్య అంతర్జాతీయీకరణపై నీతీ ఆయోగ్ నివేదిక
प्रविष्टि तिथि:
22 DEC 2025 8:44PM by PIB Hyderabad
'భారతదేశంలో ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ: అవకాశాలు, సామర్థ్యం, విధాన సిఫార్సులు' పేరుతో నీతీ ఆయోగ్ ఈ రోజు సమగ్ర విధాన నివేదికను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శ్రీ సుమన్ బేరి, సభ్యుడు (విద్య) డాక్టర్ వి.కె.పాల్, సభ్యుడు డాక్టర్ అరవింద్ విర్మాణి, సీఈఓ శ్రీ బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం సహా నీతీ ఆయోగ్ సీనియర్ నాయకులు, ఉన్నత విద్య శాఖ కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి, ఏఈసీటిఈ ఛైర్మన్ ప్రొఫెసర్ సీతారాం పాల్గొన్నారు.
ఇది 2020 జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించిన విధంగా స్వదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంపై దృష్టి పెడుతుంది. అంతర్జాతీయ, జాతీయ, సంస్థాగత స్థాయుల్లో అంతర్జాతీయీకరణకు సంబంధించిన విద్యా విధానాలను, అలాగే గత 20 ఏళ్లలో విద్యాపరమైన చలనశీలతలో వచ్చిన కాలక్రమ పోకడలను కూడా విశ్లేషిస్తుంది. ఈ నివేదిక విద్యార్థులు, అధ్యాపకుల చలనశీలతను మరింత పెంచే అవకాశాలు, అంతర్జాతీయ స్థాయిలో విద్యా, పరిశోధనా సహకారాలను విస్తరించే మార్గాలు, అలాగే భారత్ లో అంతర్జాతీయ క్యాంపస్‌ల ఏర్పాటు అవకాశాలు, విదేశాల్లో భారత ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తుంది.
ఈ నివేదిక విస్తృతమైన గుణాత్మక, పరిమాణాత్మక విశ్లేషణపై ఆధారపడి ఉంది. ఇందులో 100+ ప్రశ్నలతో కూడిన సమగ్ర సర్వేకు 24 రాష్ట్రాల్లోని 160 భారతీయ ఉన్నత విద్యా సంస్థల నుంచి వచ్చిన స్పందనలు, ఈ సంవత్సరం ప్రారంభంలో ఐఐటి మద్రాస్‌లో నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో 140 మంది జాతీయ, అంతర్జాతీయ భాగస్వాముల నుంచి వచ్చిన సూచనలు, ఆలోచనలు, అనుభవాలు ఉన్నాయి.16 దేశాలలోని 30 అంతర్జాతీయ సంస్థల నిపుణులతో నిర్వహించిన ఇంటర్వ్యూల ద్వారా అంతర్జాతీయ దృక్పథాలపై సేకరించిన కీలక సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరిచారు.
ఈ సందర్భంగా శ్రీ సుమన్ బెరీ మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్నత విద్య అంతర్జాతీయీకరణను ప్రోత్సహించడానికి వ్యాపారపరమైన, దౌత్యపరమైన కారణం కూడా ఉందని, ముఖ్యంగా ఇది సాఫ్ట్ పవర్ గా ఉపయోగపడుతుందని అన్నారు.
జాతీయ విద్యా విధానం అమలు, వికసిత భారత్ 2047 దార్శనికత నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యతను డాక్టర్ పాల్ వివరించారు. 2030 నాటికి కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మొత్తం లక్ష మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవాలనే లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
భారతీయ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందే అంతర్జాతీయ విద్యార్థులు భారత్ తో పాటు ప్రపంచ అభివృద్ధికి దోహదపడగలరని డాక్టర్ విర్మాణీ పేర్కొన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా భారత పీహెచ్‌డీ కార్యక్రమాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
శ్రీ బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ లో ఉన్నత విద్యా వ్యవస్థను అంతర్జాతీయీకరించడం వల్ల కలిగే అనేక సానుకూల ఫలితాలను పేర్కొన్నారు. ఇది భారతీయ విశ్వవిద్యాలయాలలో కోర్సులు, పాఠ్యాంశాల నాణ్యతను మెరుగుపరుస్తుందనీ, విదేశీ మారకద్రవ్య నిల్వల స్థాయిని తగ్గించడంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుందనీ, పరిశోధనా భాగస్వామ్యాలకు మరిన్ని అవకాశాలను అందిస్తుందనీ అన్నారు. అంతర్జాతీయీకరణను ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పాత్రను, 3.5 కోట్ల మంది ఉన్న భారతీయ ప్రవాస సమాజాన్ని సమర్థంగా వినియోగించుకునే అవకాశాన్ని, నిబంధనల సడలింపు ద్వారా ప్రభుత్వం ఉత్ప్రేరక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
ప్రపంచానికి భారత్ ఉన్నత విద్యా కేంద్రంగా ఉండాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కలిసి పనిచేయాలని డాక్టర్ వినీత్ జోషి అన్నారు. జాతీయ విద్యా విధానం కింద తీసుకున్న చర్యలు దీనికి ఆరంభ దశగా నిలుస్తున్నాయని, అలాగే యూజీసీ నిబంధనలు భారతదేశానికి దాదాపు 13 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను ఆకర్షించడంలో దోహదపడ్డాయని ఆయన తెలిపారు. నివేదిక నాణ్యతను ప్రశంసిస్తూ, అందులో పేర్కొన్న 76 కార్యాచరణ మార్గాలు 2047 నాటికి అంతర్జాతీయీకరణ లక్ష్యాలను సాధించడానికి ఒక బలమైన ప్రణాళికను అందిస్తాయని అన్నారు.
ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ సీతారాం మాట్లాడుతూ ప్రతిభను ఆకర్షించే కేంద్రంగా భారత్ మారాలని, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ వంటి అత్యున్నత నాణ్యత గల కార్యక్రమాలలోకి మరింత మంది విద్యార్థులను ఆకర్షించాలని అభిప్రాయపడ్డారు.
ఈ నివేదిక 22 విధాన సిఫార్సులు, 76 కార్యాచరణ మార్గాలు, 125 పనితీరు విజయ సూచికలు,ప్రస్తుతం అనుసరిస్తున్న సుమారు 30 భారతీయ,ప్రపంచ పద్ధతులను అందిస్తుంది. ఈ సిఫార్సులు ఐదు ముఖ్యమైన రంగాలలో మెరుగుదల లక్ష్యంగా ఉన్నాయి. ఈ రంగాలలో వ్యూహం, నియంత్రణ, నిధులు, బ్రాండింగ్, కమ్యూనికేషన్, జనంలోకి చేరడం, పాఠ్యప్రణాళిక, సంస్కృతి ఉన్నాయి. వీటి ద్వారా 2047 నాటికి భారతదేశాన్ని ఉన్నత విద్య, పరిశోధనకు ప్రపంచ కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పూర్తి విధాన నివేదికను https://niti.gov.in/sites/default/files/2025-12/InternationalisationofHigherEducationinIndiaReport.pdf లో పొందవచ్చు.
సంక్షిప్త విధాన నివేదికను https://niti.gov.in/sites/default/files/2025-12/InternationalisationofHigherEducationinIndiaPolicy_Brief.pdf లో పొందవచ్చు.
***
(रिलीज़ आईडी: 2207621)
आगंतुक पटल : 5