ప్రధాన మంత్రి కార్యాలయం
అండమాన్ & నికోబార్ దీవులలో 21 దీవులకు పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టే కార్యక్రమంలో ప్రధాన మంత్రి చేసిన ప్రసంగానికి ఆంగ్ల అనువాదం
प्रविष्टि तिथि:
23 JAN 2023 2:12PM by PIB Hyderabad
నమస్కారం!
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేశ హోం మంత్రి శ్రీ అమిత్ భాయ్ షా, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, రక్షణ సిబ్బంది ప్రధానాధికారి, మన మూడు సాయుధ దళాల అధిపతులు, భారత తీర రక్షక దళ డైరెక్టర్ జనరల్, అండమాన్ నికోబార్ కమాండ్ కమాండర్-ఇన్-చీఫ్, అందరు అధికారులు, పరమ్ వీర్ చక్ర సైనికుల కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా!
ఈ రోజు నేతాజీ సుభాష్ జయంతి. అందుకే దేశం ఈ స్ఫూర్తిదాయకమైన రోజును ‘పరాక్రమ్ దివస్’ (ధైర్య దినోత్సవం) గా జరుపుకుంటోంది. పరాక్రమ్ దివస్ సందర్భంగా దేశప్రజలందరికీ అనేక శుభాకాంక్షలు. నేడు, పరాక్రమ్ దివస్ సందర్భంగా అండమాన్ నికోబార్ దీవులలో నూతన ఉషోదయ కిరణాలు కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. చరిత్ర సృష్టి జరిగినప్పుడు రాబోయే శతాబ్దాలు కూడా దాన్ని గుర్తుంచుకుంటాయి, అంచనా వేసి దాని నుండి ప్రేరణ పొందుతాయి. నేడు అండమాన్ నికోబార్ లోని 21 దీవులకు పేర్లు పెట్టాం. ఈ 21 దీవులు ఇకపై పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతలను గుర్తుకు తెస్తాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి, కృషికి అంకితం చేసేలా ‘ప్రేరణ స్థలి’కి శంకుస్థాపన కూడా ఆయన నివసించిన ద్వీపంలో జరిగింది. స్వాతంత్య్ర అమృత్ కాల్ లో ఈ రోజును భవిష్యత్ తరాలు ఒక ముఖ్యమైన అధ్యాయంగా గుర్తుంచు కుంటాయి. ఈ నేతాజీ స్మారక స్థలం, అమరవీరులు, సాహసికులైన సైనికులను గుర్తుకు తెచ్చే ఈ ద్వీపాలు... మన యువతకు, రాబోయే తరాలకు శాశ్వత ప్రేరణగా నిలుస్తాయి. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల ప్రజలను, దేశ ప్రజలందరినీ నేను అభినందిస్తున్నాను. నేతాజీ సుభాష్, పరమ్ వీర్ చక్ర యోధులకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
సోదరీసోదరులారా,
ఈ అండమాన్ భూమి మీదే తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ భూమిపై మొదటి స్వతంత్ర భారత ప్రభుత్వం ఇక్కడే ఏర్పడింది. దీనితో పాటు, వీర్ సావర్కర్ సహా ఆయన లాంటి అనేక మంది వీరులు ఇక్కడ నుంచే దేశం కోసం తపిస్తూ ఎన్నో త్యాగాలు చేశారు. అపూర్వమైన ఆ అభిరుచి, అపారమైన బాధల స్వరాలు నేటికీ సెల్యులార్ జైలులోని గదుల నుండి వినిపిస్తుంటాయి. కానీ దురదృష్టవశాత్తు, అండమాన్ గుర్తింపు స్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలకు బదులుగా బానిసత్వ చిహ్నాలతో ముడిపడి ఉంది. మన ద్వీపాల పేర్లు కూడా బానిసత్వ ముద్రను కలిగి ఉన్నాయి. నాలుగైదు సంవత్సరాల క్రితం నేను పోర్ట్ బ్లెయిర్ వెళ్లినప్పుడు మూడు ప్రధాన ద్వీపాలకు భారతీయ పేర్లను పెట్టే అవకాశం లభించడం నా అదృష్టం. నేడు రాస్ ద్వీపం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా మారింది. హావ్లాక్, నీల్ దీవులు స్వరాజ్ మరియు షహీద్ దీవులుగా మారిపోయాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్వరాజ్ మరియు షహీద్ పేర్లను నేతాజీ స్వయంగా ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పేరుకు పెద్దగా ప్రాముఖ్యత లభించలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు, మన ప్రభుత్వం ఈ పేర్లను పునరుద్ధరించింది.
మిత్రులారా,
ఇవాళ, 21వ శతాబ్దపు భారతదేశం, స్వాతంత్య్రం తర్వాత మరచిపోయిన నేతాజీని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటోందనే వాస్తవానికి సాక్షిగా ఉంది. నేడు ఆకాశాన్ని తాకిన త్రివర్ణ పతాకం.. అండమాన్లో నేతాజీ తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ శక్తిని ప్రశంసిస్తోంది. దేశం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చే ప్రజల హృదయాలు, సముద్ర తీరంలో త్రివర్ణ పతాకం రెపరెపలను చూసి దేశభక్తితో నిండిపోతాయి. ఇప్పుడు అండమాన్ లో ఆయన జ్ఞాపకార్థం నిర్మించబోయే మ్యూజియం, స్మారక చిహ్నం అండమాన్ పర్యటనను మరింత చిరస్మరణీయంగా మారుస్తాయి. నేతాజీకి సంబంధించిన అటువంటి ఒక మ్యూజియాన్ని 2019లో ఢిల్లీ ఎర్రకోటలో ప్రారంభించారు. నేడు, ఆ మ్యూజియం ఎర్రకోటను సందర్శించే ప్రజలకు స్ఫూర్తి ఇచ్చే ప్రదేశంగా పనిచేస్తోంది. అదేవిధంగా, ఆయన 125వ జయంతి సందర్భంగా బెంగాల్ సహా దేశంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఆయన జయంతి ఉత్సవాన్ని పరాక్రమ్ దివస్ గా ప్రకటించారు. అంటే, బెంగాల్ నుంచి ఢిల్లీ, అండమాన్ వరకు దేశంలో నేతాజీకి వందనం చేయని, ఆయన వారసత్వాన్ని గౌరవించని ఏ భాగం కూడా లేదు.
మిత్రులారా,
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన అనేక ప్రాజెక్టులను గత ఎనిమిది-తొమ్మిదేళ్లలో దేశంలో మొదలయ్యాయి. నిజానికి ఇవి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే జరగాల్సి ఉంది. కానీ ఆ సమయంలో అలా జరగలేదు. స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రభుత్వం 1943 లో దేశంలోని ఒక భాగంలో ఏర్పడింది. ఇప్పుడు ఆ సంఘటనను వేడుకగా జరుపుకోవడంలో దేశం గర్విస్తుంది. ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పడిన 75 సంవత్సరాల సందర్భంగా, దేశం ఎర్రకోట వద్ద జెండాను ఎగురవేసి నేతాజీకి వందనం చేసింది. నేతాజీ జీవితానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. ఈ విషయంలో దేశం పూర్తి భక్తితో పురోగతి సాధించింది. నేడు, మన ప్రజాస్వామ్య సంస్థల ముందు, కర్తవ్య పథ్ వద్ద నేతాజీ బోస్ యొక్క విగ్రహం మన కర్తవ్యాలను గుర్తు చేస్తోంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ పనులను చాలా కాలం క్రితమే చేయాల్సి ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, తమ హీరోలను సకాలంలో ప్రజలతో అనుసంధానం చేసిన దేశాలు... భాగస్వామ్య, సమర్థవంతమైన ఆదర్శాలను సృష్టించిన దేశాలు అభివృద్ధిలోను, దేశ నిర్మాణంలోను చాలా ముందుకు వెళ్లాయి. అందువల్ల, స్వాతంత్య్ర అమృత్ కాల్ లో తన పూర్తి శక్తితో భారత దేశం అదే చేస్తోంది.
మిత్రులారా,
నేడు 21 ద్వీపాల పేర్లను మార్చడంలో గంభీరమైన సందేశాలు కూడా దాగి ఉన్నాయి. ఈ సందేశం ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి. ఇది దేశం కోసం చేసిన త్యాగాల అమరత్వ సందేశం. ‘వయం అమృత పుత్ర’ అనేది, భారత సైన్యం ధైర్య సాహసాల సందేశం. 21 మంది పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతలు, ఈ ద్వీపాలు పేరొందిన తర్వాత, మాతృభూమిలోని ప్రతి కణాన్ని తమదిగా భావిస్తారు. భారత మాత రక్షణ కోసం వారు ప్రతిదీ త్యాగం చేశారు. భారత సైన్యానికి చెందిన ఆ ధైర్యవంతులైన సైనికులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, వివిధ భాషలు, మాండలికాలు మాట్లాడారు. అలాగే విభిన్నమైన జీవనశైలిలో గడిపారు. కానీ, భరత మాత సేవ, మాతృభూమి పట్ల అచంచలమైన భక్తి వారిని ఏకం చేసి, ఒకటిగా మార్చాయి. వారికి ఒకే లక్ష్యం, ఒకే మార్గం, ఒకే ఉద్దేశ్యం, పూర్తి అంకితభావం కలిగాయి.
మిత్రులారా,
సముద్రం వివిధ ద్వీపాలను కలిపే విధంగా, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ భావన భారత మాత ప్రతి బిడ్డను ఏకం చేస్తుంది. మేజర్ సోమనాథ్ శర్మ, పిరు సింగ్, మేజర్ షైతాన్ సింగ్, కెప్టెన్ మనోజ్ పాండే, సుబేదార్ జోగిందర్ సింగ్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, వీర్ అబ్దుల్ హమీద్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్ నుంచి మొత్తం 21 పరమ్ వీరుల వరకు, అందరికీ... ‘దేశమే ప్రధమం’, ‘ఇండియా ప్రధమం’ అనే ఒకే ఒక సంకల్పం ఉంది. ఈ దీవుల పేరిట ఈ తీర్మానం ఇప్పుడు శాశ్వతంగా అమరమైంది. కార్గిల్ యుద్ధంలో 'యే దిల్ మాంగే మోరే' అనే యుద్ధ నినాదాన్ని ఇచ్చిన కెప్టెన్ విక్రమ్ బాత్రా పేరిట కూడా అండమాన్ లోని ఒక కొండను అంకితం చేస్తున్నారు.
సోదరీసోదరులారా,
అండమాన్ నికోబార్ దీవుల పేరును మార్చడం, పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతలకు నివాళి అర్పించడమే కాకుండా, భారత దళాలకు కూడా గౌరవం. దేశంలోని ప్రతి కణాన్ని రక్షించడానికి తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం, సముద్రం లేదా పర్వతం, నిర్జనమైన లేదా మారుమూల ప్రాంతాల్లో దేశంలోని దళాలు మోహరిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మన సాయుధ దళాలు యుద్ధాలను ఎదుర్కోవలసి వచ్చింది. మన బలగాలు ప్రతి సందర్భంలోనూ, ప్రతి రంగంలోనూ తమ ధైర్యాన్ని నిరూపించుకున్నాయి. ఈ జాతీయ రక్షణ కార్యకలాపాల్లో తమను తాము అంకితం చేసుకున్న సైనికులను, సైన్యం సహకారాన్ని గుర్తించడం దేశం కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని, బాధ్యతను నెరవేర్చడానికి దేశం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. నేడు సైనికులు, సైన్యాల పేరుతో దేశానికి గుర్తింపు వస్తోంది.
మిత్రులారా,
అండమాన్ అనేది నీరు, ప్రకృతి, పర్యావరణం, ధైర్యం, సంప్రదాయం, పర్యాటకం, జ్ఞానోదయం నుండి ప్రేరణ వరకు ప్రతిదీ కలిగిన ఒక భూమి. దేశంలో ఎవరు అండమాన్ రావాలని ఇష్టపడరు? అండమాన్‌లో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ అవకాశాలు, సామర్థ్యాన్ని మనం గుర్తించాలి. గత ఎనిమిదేళ్లుగా దేశం ఈ దిశలో నిరంతరం కృషి చేస్తోంది. కరోనా కష్టకాలం తర్వాత కూడా ఈ ప్రయత్నాల ఫలితాలు ఇప్పుడు పర్యాటక రంగంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014 నుంచి చూస్తే 2022లో అండమాన్ ను సందర్శించే పర్యాటకుల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. పర్యాటకుల సంఖ్య రెట్టింపు కావడంతో పర్యాటక రంగానికి సంబంధించిన ఉపాధి కూడా పెరిగింది. దీనితో పాటు కొన్ని సంవత్సరాలుగా మరో పెద్ద మార్పు జరిగింది.
ఇంతకు ముందు ప్రజలు అండమాన్ కి దాని సహజ సౌందర్యం, సముద్ర తీరాల కోసమే వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఈ గుర్తింపు కూడా విస్తరిస్తోంది. ఇప్పుడు అండమాన్ కు సంబంధించిన స్వాతంత్ర్య చరిత్ర గురించి ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు కూడా చరిత్రను తెలుసుకోవడానికి మరియు జీవించడానికి ఇక్కడ వస్తున్నారు. అలాగే, అండమాన్ నికోబార్ దీవులు మన గొప్ప గిరిజన సంప్రదాయంతో గుర్తింపు పొందాయి. ఒకరి వారసత్వంపై గర్వపడే భావన ఈ సంప్రదాయాన్ని కూడా ఆకర్షణగా మార్చుతోంది. ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన స్మారక చిహ్నం, సైన్యం ధైర్యాన్ని గౌరవించడం ఇక్కడకు రావాలనుకునే దేశ ప్రజలలో కొత్త ఉత్సుకతను సృష్టిస్తుంది. సమీప భవిష్యత్తులో ఇక్కడ అనంతమైన పర్యాటక అవకాశాలు ఏర్పడుతాయి.
మిత్రులారా,
దశాబ్దాలుగా గత ప్రభుత్వాల ఆత్మన్యూనత వల్ల, ఆత్మవిశ్వాస లోపం వల్ల, ముఖ్యంగా వక్రీకరించిన సైద్ధాంతిక రాజకీయాల కారణంగా, దేశం సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువగానే అంచనా వేయడం జరిగింది. మన హిమాలయ రాష్ట్రాలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ వంటి సముద్ర ద్వీప ప్రాంతాలు... వీటిని మారుమూల, చేరుకోలేని, సంబంధం లేని ప్రాంతాలుగా పరిగణించేవారు. అటువంటి మనస్తత్వం వల్ల, ఇలాంటి ప్రాంతాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం అయ్యాయి. అంతేకదు, వాటి అభివృద్ధిని పక్కన పెట్టారు. అండమాన్-నికోబార్ దీవులు కూడా దీనికి సాక్షిగా నిలిచాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనేక అభివృద్ధి చెందిన ద్వీపాలు ఉన్నాయి. వాటి పరిమాణం మన అండమాన్ నికోబార్ కంటే చిన్నది. సింగపూర్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, సీషెల్స్ కావచ్చు, ఈ దేశాలు తమ వనరులను సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల పెద్ద పర్యాటక ఆకర్షణగా మారిపోయాయి. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పర్యాటకం, వ్యాపార అవకాశాల కోసం ఈ దేశాలకు వస్తున్నారు. భారతదేశంలోని ద్వీపాలు కూడా ఇలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మనమంతా ప్రపంచానికి చాలా ఇవ్వగలం. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ శ్రద్ధ తీసుకోలేదు. దేశంలో ద్వీపాలు, దీవులకు సంబంధించిన వివరాలు కూడా లేకపోయాయి. ఇప్పుడు దేశం ఈ దిశలో పయనిస్తోంది. ఇప్పుడు దేశంలో సహజ సమతుల్యత, ఆధునిక వనరులను కలిసి ముందుకు తీసుకువెళ్తున్నారు. ‘సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్’ ద్వారా అండమాన్ ను వేగవంతమైన ఇంటర్నెట్ తో అనుసంధానించే ప్రాజెక్టును మేము ప్రారంభించాము. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే అండమాన్ లో కూడా వేగంగా ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. డిజిటల్ చెల్లింపులు, ఇతర డిజిటల్ సేవలు ఇక్కడ చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. అండమాన్ సందర్శించే పర్యాటకులు కూడా దీని వల్ల ప్రయోజనం పొందుతున్నారు.
మిత్రులారా,
గతంలో అండమాన్ నికోబార్ స్వాతంత్య్ర పోరాటానికి కొత్త దిశను ఇచ్చింది. అదేవిధంగా, ఈ ప్రాంతం భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది. మనం సమర్థవంతమైన, ఆధునిక అభివృద్ధి అంచులను తాకగల భారతదేశాన్ని నిర్మిస్తామనే నమ్మకం నాకు ఉంది. ఈ ఆకాంక్షతో, నేను మరోసారి నేతాజీ సుభాష్, మన సైనికుల పాదాలకు నమస్కారిస్తున్నాను. మీ అందరికీ పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు!
చాలా ధన్యవాదాలు.
(ఇది ప్రధాన మంత్రి హిందీ ప్రసంగానికి స్వేచ్చానువాదం)
***
(रिलीज़ आईडी: 2203055)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam