పర్యటక మంత్రిత్వ శాఖ
ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల అభివృద్ధి
प्रविष्टि तिथि:
08 DEC 2025 2:47PM by PIB Hyderabad
పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, ప్రచార బాధ్యతలను ప్రధానంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం/ కేంద్రపాలిత ప్రాంత పరిపాలన యంత్రాంగం చేపడతాయి.
‘మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం (ఎస్ఏఎస్‌సీఐ) – ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల అభివృద్ధి’ కార్యక్రమం ద్వారా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ సహా 23 రాష్ట్రాల్లో రూ. 3295.76 కోట్లతో 40 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దేశంలోని అద్భుత పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, ప్రపంచ వ్యాప్తంగా వాటికి ప్రత్యేక గుర్తింపును తేవడం, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ దీని ప్రధాన లక్ష్యం. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వీకరించిన ప్రతిపాదనలు, ఈ విషయంలో అధికారిక ప్రమాణాల ఆధారంగా ప్రాజెక్టులను గుర్తించారు. ఎస్ఏఎస్‌సీఐ పరిధిలోని ప్రాజెక్టులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇందుకోసం వ్యయ విభాగం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను మంజూరు చేసింది / విడుదల చేసింది. పంజాబ్ సహా ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మంజూరైన ప్రాజెక్టులు, నిధుల వివరాలను జత చేశాం.
ప్రస్తుతం ఎస్ఏఎస్‌సీఐ పథకం కింద మరిన్ని ప్రాజెక్టులను మంజూరు చేసే ప్రతిపాదన లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశఈ దర్శన్, స్వదేశీ దర్శన్ 2.0, దాని ఉప పథకం ‘సవాళ్లనెదుర్కొంటున్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధి (చాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్- సీబీడీడీ)’, ‘తీర్థయాత్రల పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ అభివృద్ధి కార్యక్రమం (ప్రసాద్) కింద... దేశంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన పర్యాటక అనుభవాన్ని అందించడం కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంత పరిపాలన యంత్రాంగాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఇందుకోసం పథకం మార్గదర్శకాలు, ప్రభుత్వ సూచనలు, నిధుల లభ్యత మొదలైన అంశాలకు అనుగుణంగా సంబంధిత పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిపాదనలు అందించాల్సి ఉంటుంది. దీని ప్రకారం స్వదేశీ దర్శన్ కింద రూ.5290.33 కోట్ల విలువైన 76 ప్రాజెక్టులు, స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.2208.27 కోట్ల విలువైన 53 ప్రాజెక్టులు, సీబీడీడీ కింద రూ.648.11 కోట్ల విలువైన 36 ప్రాజెక్టులు, పంజాబ్ సహా దేశవ్యాప్తంగా ప్రసాద్ పథకంలో భాగంగా రూ.1726.74 కోట్ల విలువైన 54 ప్రాజెక్టులను పర్యాటక మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ రోజు లోకసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2200666)
आगंतुक पटल : 13