సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
జ్ఞాన భారతం కార్యక్రమం
प्रविष्टि तिथि:
08 DEC 2025 3:36PM by PIB Hyderabad
భారత్‌లో చేతిరాత ప్రతుల జ్ఞాన సంపదపై సర్వేను చేపట్టడం, పూర్తి వివరాల్ని సేకరించడం, సంరక్షించడం, డిజిటల్ రూపంలోకి మార్చడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం అనే లక్ష్యాలతో జ్ఞాన భారతం పేరిట ఒక ప్రధాన కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ చేపడుతుందని ఈ సంవత్సరపు కేంద్ర బడ్జెటు (84వ పేరా)లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థలూ, వస్తు ప్రదర్శనశాలలూ, గ్రంథాలయాలూ, సేకరణాభిలాషుల సహాయ సహకారాలను తీసుకుని, ఒక కోటికి పైగా రాత ప్రతులను పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమాచారాన్ని దేశ, విదేశాలకు అందుబాటులో ఉంచడానికి వీలుగా ఆధునిక సాంకేతికతనూ, కృత్రిమ మేధనూ ఉపయోగించుకుంటూ జాతీయ డిజిటల్ భాండాగారాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి 2025-2031 మధ్య కాలానికి రూ.491.66 కోట్లను ఆర్థిక స్థాయీసంఘం (ఎస్ఎఫ్సీ) మంజూరు చేసింది.
జ్ఞాన భారతం డిజిటల్ వెబ్ పోర్టల్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు. 31 సంస్థలతో అవగాహన ఒప్పందంపై సంతకాలయ్యాయి. వాటిలో 19 సంస్థలు క్లస్టర్ సెంటర్లుగానూ, మిగతా 12 సంస్థలు స్వతంత్ర కేంద్రాలుగానూ సేవలను అందిస్తాయి. ఇవి అయిదు జ్ఞాన భారత కీలక విభాగాలు.. 1. సర్వే, కేటలాగింగ్, 2. సంరక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు, 3. సాంకేతికత, డిజిటలీకరణ; 4. భాషా విజ్ఞానం, అనువాదం, 5. పరిశోధన, ప్రచురణ, ప్రజాసంబంధాలకు.. సంబంధించిన సేవల్ని అందిస్తాయి. దేశమంతటా క్లస్టర్ సెంటర్లకూ, స్వతంత్ర కేంద్రాలకూ తోడ్పడటానికి సాంకేతిక భాగస్వాముల్ని ఖరారు చేశారు. ఇంతవరకు సుమారు 3.5 లక్షల రాతప్రతులకు జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా డిజిటల్ రూపాన్నిచ్చారు.
సంస్థల్నీ, పండితుల్నీ, సమాజాల్నీ, సేకరణాభిలాషుల్నీ ఏకం చేస్తూ దేశంలో చేతిరాత పుస్తకాల బృహత్ వారసత్వాన్ని పరిరక్షించడం, డిజిటలీకరించడం, పునరుత్తేజితం చేయడమనే జాతీయ వాగ్దానాన్ని ఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రకటించారు. (దీనిని జ్ఞాన భారతం సంకల్ప పత్రం అని కూడా పేర్కొన్నారు). రాతప్రతులు భారత నాగరికత సజీవ స్మృతులు అని ఈ డిక్లరేషన్ స్పష్టం చేసింది. సాంప్రదాయిక జ్ఞానానికి సమకాలీన సందర్భ శుద్ధిని సంతరించడానికి ఆధునిక సంరక్షణ పద్ధతులూ, భారీ స్థాయిలో డిజిటల్ లభ్యతలతో పాటు పరిశోధనను నవీకరించాల్సిన అవసరం ఎంతయినా ఉందని కూడా ఇది పిలుపునిస్తోంది. వారసత్వ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మలిచి, ప్రపంచ స్థాయిలో సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా రాతప్రతుల ఆధారిత జ్ఞానార్జనకు భారత్‌ను ఒక ప్రపంచ కేంద్రంగా ఈ డిక్లరేషన్ నిలబెడుతూనే విభిన్న రాతప్రతుల్నీ, జ్ఞాన సంప్రదాయాల్నీ కాపాడడంలో కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తోంది.
జ్ఞాన భారతం అఖిల భారత స్థాయిలో అమలవుతున్న కార్యక్రమం. కాబట్టి దీని పరిధి దేశంలో ఏ
నిర్దిష్ట రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితం కాదు. దీనికి అనుగుణంగా మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో గల డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయంతో ఎంఓయూను కుదుర్చుకున్నారు.
సంగీత నాటక అకాడమీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది భారతదేశ శాస్త్రీయ, సాంప్రదాయక, గిరిజన, జానపద ప్రదర్శన కళల్నీ, ఒడిస్సీ నాట్యం, ఒడిస్సీ సంగీతం, సంబల్‌పురీ నాట్యాన్నీ పరిరక్షిచడంతో పాటు ప్రోత్సహించడానికి ఉత్సవాల్నీ, కార్యశాలల్నీ, ప్రదర్శనల్నీ, ఇతర కార్యక్రమాల్నీ నిర్వహిస్తూ ఉంటుంది. సంగీత ఉత్సవాల్నీ, సెమినార్లనీ, కార్యశాలల్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఒడిస్సీ నాట్యం, ఒడిస్సీ సంగీత కళాకారులకు సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం వంటి జాతీయ అవార్డులనూ ప్రదానం చేస్తోంది.
కోల్‌కతా లోని తూర్పు మండల సాంస్కృతిక కేంద్రం (ఈజడ్సీసీ) సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈజడ్సీసీ ఒడిశా సహా తన సభ్య రాష్ట్రాల్లో జానపద కళను ప్రోత్సహిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాల్నీ, ఉత్సవాల్నీ నిర్వహిస్తూ చైతన్యవంతమైన జానపద నృత్య కళారూపైన సంబల్‌పురీ నృత్య కార్యక్రమాల్ని తరచుగా ఏర్పాటు చేస్తూ ఉంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2200661)
आगंतुक पटल : 5