సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
అమూర్త సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించే యునెస్కో అంతర ప్రభుత్వ కమిటీ 20వ సంచికకు న్యూఢిల్లీలో ఆతిథ్యమిస్తున్న భారత్
అమూర్త వారసత్వ సంపదను పరిరక్షించేందుకు యునెస్కో
చేపడుతున్న ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని
జీవన సంప్రదాయాలను పరిరక్షించడానికి భారత్ కట్టుబడి ఉంది: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
2025 డిసెంబర్ 13 వరకూ యునెస్కో 20వ అంతర ప్రభుత్వ కమిటీ సమావేశాలు
प्रविष्टि तिथि:
08 DEC 2025 3:44PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఎర్రకోటలో అమూర్త సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించే అంతర ప్రభుత్వ కమిటీ 20వ సమావేశం ప్రారంభమైంది. ఈ చారిత్రక కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ ఎస్.జైశంకర్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖాగుప్తా పాల్గొన్నారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఖలీద్ ఎల్-ఎనానీ, యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి విశాల్ వీ శర్మ, ఇతర విశిష్ట అతిథులు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ చదివి వినిపించారు. యునెస్కో చేపడుతున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి తన సందేశంలో ప్రశంసించారు. అలాగే పరిరక్షణ చర్యలను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
యునెస్కో జాబితాలో పేర్కొన్న అనేక అంశాలను భారత్ కలిగి ఉండటం గర్వించదగిన అంశమని తన సందేశంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. మన భాషా వైవిధ్యం, సుసంపన్నమైన సాహిత్యం, మన గ్రామాలు, పట్టణాలు, సమాజాల్లో పరిఢవిల్లుతున్న అనేక సంప్రదాయాలు కూడా గర్వించదగినవని ఆయన అన్నారు. వీటికంటూ అద్వితీయమైన కథ, చరిత్ర ఉన్నాయని, మానవాళికి ప్రత్యేక సహకారం అందిస్తున్నాయన్నారు.
కట్టడాలు, రాత ప్రతులను దాటి భాష, సంగీతం, పండగలు, పూజా కార్యక్రమాలు, కళలు, మౌఖిక సంప్రదాయాల్లో వారసత్వం దాగి ఉంటుందని కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ‘‘వసుధైక కుటుంబం’’ - ఈ ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం అనే భారతీయ నాగరిక సూక్తి దేశ సాంస్కృతిక విధానానికి, అంతర్జాతీయ సహకారానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని తెలిపారు.
అమూర్తమైన సాంస్కృతిక వారసత్వ సంపదకు సంబంధించి యునెస్కో రూపొందించిన జాబితాలో భారత్‌కు సంబంధించిన 15 అంశాలున్నాయని మంత్రి తెలియజేశారు. ఇది దేశంలో వైవిధ్యమైన జీవన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందన్నారు. అంతర్జాతీయంగా, 150 దేశాలకు చెందిన 788 అంశాలను యునెస్కో ఐసీహెచ్ జాబితాలో చేర్చారని ఇది పరిరక్షణా చర్యలు తక్షణమే బలోపేతం చేయాల్సిన స్థాయిని, అవసరాన్ని సూచిస్తున్నాయని తెలియజేశారు.
సాంస్కృతిక వారసత్వానికి సమాజాలే నిజమైన సంరక్షకులని మంత్రి స్పష్టం చేశారు. కళల పునరుజ్జీవం, సామాజిక భాగస్వామ్యం, గురు-శిష్య పరంపర విధానాలు, హస్త కళాకారులకు మార్కెట్ ఆధారిత జీవనోపాధి తోడ్పాటును అందించేందుకు భారత్ చేపడుతున్న కార్యకలాపాలను మంత్రి వివరించారు. భవిష్యత్తు తరాలకు సంప్రదాయాలను అందించే దిశగా పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలు, వృత్తిపరమైన శిక్షణ, సాంస్కృతిక పరిశోధన, డిజిటల్ వేదికల ద్వారా యువత పెద్ద సంఖ్యలో భాగస్వామ్యులు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసి, ఆచరణాత్మకమైన, సామాజిక కేంద్ర పరిరక్షణా చర్యలు చేపట్టే విశ్వాసాన్ని కమిటీ 20వ సమావేశం అందిస్తుందని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. అమూర్త సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించి, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంలో దేశ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రతినిధులందరికీ భారత్‌కు స్వాగతం పలికారు.
ప్రారంభోత్సవం అనంతరం, శాస్త్రీయ, జానపద, సమకాలీన సంప్రదాయాలను ప్రతిబింబించే భారతీయ కళా ప్రదర్శనలను ప్రతినిధులు వీక్షించారు. ఈ ప్రదర్శనలు సజీవంగా కొనసాగుతన్న భారతీయ వారసత్వ సారాంశాన్ని రూపొందించే సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
***
(रिलीज़ आईडी: 2200659)
आगंतुक पटल : 3