గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఉద్భవ్-2025: జాతీయ స్థాయిలో మెరిసిన గిరిజన ప్రతిభ, పతకాల పట్టికలో అగ్రస్థానంలో తెలంగాణ
ముగిసిన ఆరో జాతీయ ఈఎంఆర్ఎస్ సాంస్కృతిక, సాహిత్య ఉత్సవం: దేశీయ ప్రతిభ సత్తా చాటిన 1500 మందికి పైగా గిరిజన విద్యార్థులు
కేఎల్ విశ్వవిద్యాలయంలో ఉద్భవ్-2025ను ముగించిన ఎన్ఈఎస్‌టీఎస్: గిరిజన సంస్కృతి, కళలు, యువ నాయకత్వాన్ని చాటి చెప్పిన ఉత్సవం
प्रविष्टि तिथि:
08 DEC 2025 9:11AM by PIB Hyderabad
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో గిరిజన విద్యార్థుల కోసం జాతీయ విద్యా సొసైటీ (ఎన్ఈఎస్‌టీఎస్) నిర్వహించిన ఆరో జాతీయ ఈఎంఆర్ఎస్ సాంస్కృతిక, సాహిత్య, కళా ఉత్సవం - ఉద్భవ్ 2025 ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ విశ్వవిద్యాలయంలో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఎన్ఈఎస్‌టీఎస్ నిర్వహించగా, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ - గురుకులం) ఆతిథ్యమిచ్చింది. కేఎల్ విశ్వవిద్యాలయం అందించిన సంస్థాగత సహకారంతో 2025 డిసెంబర్ 3 నుంచి 5 వరకు ఈ కార్యక్రమం జరిగింది.
ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి జీ సంధ్యారాణి, సామాజిక సంక్షేమం, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డాక్టర్ డీఎస్ స్వామి, పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలతో పాటు గుంటూరు జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీ కందుల దుర్గేశ్, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమం, గిరిజన సంక్షేమం విభాగం కార్యదర్శి శ్రీ ఎంఎం నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి హాజరు ఈ కార్యక్రమ గౌరవాన్ని పెంచింది. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి స్ఫూర్తినిచ్చింది.
ఉత్తమ ప్రదర్శన చేసిన గిరిజన విద్యార్థులను అతిథులు అభినందించారు. గిరిజన విద్య, సంస్కృతీ పరిరక్షణ, సాధికారతను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనబరుస్తున్న అంకితభావాన్ని స్పష్టం చేశారు. సుసంపన్నమైన భారత గిరిజన వారసత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా.. గిరిజన యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జాతీయ స్థాయి గుర్తింపును పెంపొందిచడంలో ఉద్భవ్ లాంటి వేదికలు ఉత్ప్రేరకంగా పని చేస్తాయన్నారు.
ఎన్ఈఎస్‌టీఎస్ కమిషనర్ శ్రీ అజిత్ కుమార్ శ్రీవాస్తవ (ఐఆర్ఏఎస్), ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమం, గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి శ్రీ ఎంఎం నాయక్ (ఐఏఎస్) మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్ఈఎస్‌టీఎస్, ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ అధికారులతో పాటు తన బృందం అందించిన తోడ్పాటుతో ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ (గురుకులం) కార్యదర్శి శ్రీమతి ఎమ్ గౌతమి (ఐఏఎస్) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వారి సమన్వయంతో అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తయ్యాయి.
ఈ ఉత్సవంలో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 1,558 విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 524 మంది బాలురు, 1,024 మంది బాలికలు ఉన్నారు. అలాగే 45 మంది బృంద నాయకులు 178 మంది ఎస్కార్టులు, 22 మంది కంటింజెంట్ మేనేజర్లు, 22 మంది లైసన్ అధికారులు, 10 మంది అధికారులు, 19 మంది ఎన్ఈఎస్‌టీఎస్ అధికారులు, 137 మంది సబ్ కమిటీ సభ్యులు, 48 మంది జ్యూరీ సభ్యులు, 60 మంది రాష్ట్ర, ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ అధికారులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవంలో భారత గిరిజన తెగల గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని చాటి చెప్పేలా 49 సాంస్కృతిక, సాహిత్య, సృజనాత్మక, కళా ప్రదర్శన పోటీలు జరిగాయి. ఈ పోటీల తొలి రోజు 18 విభాగాల్లోనూ. రెండో రోజు 22 విభాగాల్లో, మూడో రోజు 9 విభాగాల్లో పోటీలు జరిగాయి. ప్రతి ప్రదర్శన ఉత్తమ ప్రతిభను, సాంస్కృతిక అవగాహనను, కళాత్మక అభినయాన్ని చాటి చెప్పింది.
వివిధ కేటగిరీల్లో విజేతల ఫలితాలను ముగింపు ఉత్సవంలో ప్రకటించారు. పతకాల పట్టికలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా.. తదుపరి స్థానాల్లో జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. మొత్తం 105 ప్రథమ బహుమతులు, 105 ద్వితీయ బహుమతులు, 105 తృతీయ బహుమతులతో పాటు ఓవరాల్ స్టేట్ ఛాంపియన్‌షిప్‌ను అందించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందించారు.
ఉద్భవ్ 2025లో గుర్తించిన 12 విభాగాల్లో విజేతలు పుణెలోని యశదాలో నిర్వహించే జాతీయ కళా ఉత్సవ్‌లో ఈఎంఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే బృందాలు పాల్గొంటాయి. గిరిజన హస్తకళలు, విజువల్ ఆర్ట్స్, సంప్రదాయ ప్రదర్శనలు, దేశీయ సృజనాత్మక వ్యక్తీకరణలు ఈ కార్యక్రమానికి శోభను తీసుకొచ్చాయి. ఇవి గిరిజన తెగలు పరిరక్షిస్తున్న సాంస్కృతిక సంపదను, కళా సంప్రదాయాలను ప్రదర్శించాయి.
గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి వేదికను అందించి విశ్వాసాన్ని పెంపొందించి, వారి సాంస్కృతిక గుర్తింపును ప్రదర్శించే వీలు కల్పించడం ద్వారా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే ప్రధానమంత్రి దార్శనికతను ఉద్భవ్-2025 బలోపేతం చేస్తుంది. అలాగే అభివృద్ధి అంతరాలను పూరించడంలో, విద్యా, సాంస్కృతిక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, గిరిజనయ యువతలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడంలో ఈఎంఆర్ఎస్‌లు పోషిస్తున్న పాత్రను ఈ ఉత్సవం తెలియజేస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన యువతకు సమగ్ర విద్య, సాంస్కృతిక సాధికారత, సృజనాత్మక అవకాశాను అందించేలా తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ.. ఎన్ఈఎస్‌టీఎస్ ఆరో సంచిక విజయవంతంగా ముగిసింది. స్థానిక ప్రతిభను గుర్తించడానికి, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు అవసరమైన వేదికలను అందించడానికి ఈ సంస్థ అంకితమై ఉంది.
***
(रिलीज़ आईडी: 2200273)
आगंतुक पटल : 17