రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఇవాళ (డిసెంబర్ 5, 2025) రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. గౌరవార్థంగా విందును కూడా ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడు పుతిన్‌కు, ఆయన ప్రతినిధి బృందానికి రాష్ట్రపతి భవన్‌కు స్వాగతం పలికిన భారత రాష్ట్రపతి.. పుతిన్ పర్యటన కీలక ఘట్టాన్ని సూచిస్తుందన్నారు. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస‌్వామ్యానికి ఇది 25వ వార్షికోత్సవమని తెలిపారు. అక్టోబర్ 2000వ సంవత్సరంలో పుతిన్ అధ్యక్షుడిగా మొదటిసారి భారత్‌ను సందర్శించినప్పుడు ఈ భాగస్వామ్యం మొదలైందని చెప్పారు.
భారత్-రష్యా ప్రత్యేక, విశేష భాగస్వామ్యానికి అధ్యక్షుడు పుతిన్ అందిస్తున్న మద్దతు, వ్యక్తిగత ప్రాధాన్యతను రాష్ట్రపతి ప్రశంసించారు.
శాంతి, స్థిరత్వం, పరస్పర సామాజిక-ఆర్థిక, సాంకేతిక పురోగతికి సంబంధించి ఉమ్మడి ప్రాధాన్యత ద్వారా మన భాగస్వామ్యానికి మార్గనిర్దేశం లభిస్తుందని ఆమె అన్నారు. బహుముఖ భాగస్వామ్యానికి ఈ 2025వ సంవత్సరం మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారు. ఈ ఏడాదిలో ఉన్నత-స్థాయి రాజకీయ మార్పిడులు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సంస్కృతి, క్రియాశీలక ప్రజల సంబంధాల వంటి అంశాల్లో మెరుగైన పురోగతి సాధ్యమైందని వెల్లడించారు.
భారత్-రష్యా 23వ వార్షిక సమావేశ ఉమ్మడి ప్రకటన మన బంధాల ప్రత్యేక స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సమగ్రమైన వ్యవస్థను అందిస్తుందని రాష్ట్రపతి అన్నారు.
ఇరుదేశాల ప్రజల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక బంధాన్ని రాష్ట్రపతి స్మరించుకున్నారు. ప్రాచీన వాణిజ్య మార్గాల నుంచి మహాత్మాగాంధీ, లియో టాల్‌స్టాయ్ మధ్య లేఖల ద్వారా జరిగిన స్ఫూర్తిదాయకమైన ఉత్తరప్రత్యుత్తరాల వరకు, ఒకరి గొప్ప సాంస్కృతిక, సాహిత్య, కళాత్మక వారసత్వంపై మరొకరికున్న పరస్పర అభిమానం వరకు ఈ సాంస్కృతిక బంధం విస్తరించిందన్నారు.
రెండు దేశాల మధ్య ఏళ్లుగా స్థిరంగా ఉన్న స్నేహం, రాబోయే ఏళ్లల్లోనూ కొనసాగుతుందని ఇరువురు నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.