అణుశక్తి విభాగం
పార్లమెంటులో ప్రశ్న: అణు విద్యుత్ సామర్థ్య విస్తరణ
నాడు పోస్టు చేయడమైనది:
04 DEC 2025 6:22PM by PIB Hyderabad
వికసిత్ భారత్ కోసం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడమే అణు విద్యుత్ కార్యక్రమ లక్ష్యం. ఇది 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించేందుకు గణనీయంగా దోహదపడుతుంది. స్వల్ప కర్బన ఉద్గారాలతో అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచడం, శిలాజ ఇంధన విద్యుత్ కేంద్రాల ప్రస్తుతం అందిస్తున్న ప్రాథమిక అవసరాలను తీర్చేలా ప్రత్యామ్నాయాన్ని అందించడం దీనిలోని ప్రధానాంశాలుగా ఉన్నాయి. దేశీయ ఇంధన సాంకేతికతపై ప్రధాన దృష్టి సారిస్తూ.. వికసిత భారత్ కోసం దేశ విద్యుత్ శక్తిలో అణు విద్యుత్ వాటాను పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాల్లో మరొకటి. అణు విద్యుత్‌లో 100 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించడానికి భారత్ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది.
-
వేగవంతమైన విస్తరణ కోసం గ్రీన్‌ఫీల్డ్ క్షేత్రాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన 700 మెగా వాట్ల ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ (పీహెచ్‌డబ్ల్యూ ఆర్)లను, దిగుమతి చేసుకున్న అధిక సామర్థ్యం కలిగిన రియాక్టర్లను ఏర్పాటు చేయడం.
-
బ్రౌన్‌ఫీల్డ్ ప్రాంతాల కోసం 200 మెగావాట్ల భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (బీఎస్ఎంఆర్-200), 55 మెగావాట్ల స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్-55) వంటి చిన్న రియాక్టర్ల రూపకల్పన, అభివృద్ధి జరుగుతోంది. దీని లక్ష్యం ఏమిటంటే..
-
మూసివేతకు సిద్ధంగా ఉన్న శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లను పునరుద్ధరించడం,
-
విద్యుత్ అవసరం అధికంగా ఉండే పరిశ్రమల కోసం ప్రత్యేక విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం,
-
మారుమూల ప్రాంతాల కోసం ఆఫ్-గ్రిడ్ వ్యవస్థలు.
ఈ రియాక్టర్లను తరలించడానికి అవసరమైన సాంకేతికత.. దేశంలో అందుబాటులో ఉంది. దీనికోసం అవసరమైన చాలా పరికరాలను తయారు చేసే సామర్థ్యం భారతీయ పరిశ్రమలకు ఉంది. దీనికి బార్క్ సాంకేతిక, నిపుణుల మార్గదర్శకత్వం లభిస్తుంది.
అణు శక్తి విభాగం, విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్రీయ విద్యుత్ సంస్థకు చెందిన నిపుణులు 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికకు అనుగుణంగా, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు.. ఇప్పటికే కొనసాగుతున్న, ఆమోదం లభించిన ప్రదేశాల్లో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఆధారిత ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులను పొందడానికి, కొత్త ప్రదేశాలను గుర్తించడానికి ఎన్‌పీసీఐఎల్ చర్యలు ప్రారంభించింది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే పరిశ్రమల్లో డీకార్బనైజేషన్‌కు సహకరించేలా భారత్ స్మాల్ రియాక్టర్ (బీఎస్ఆర్)లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను ఆయా సంస్థల నుంచి ఎన్పీసీఐఎల్ ఆహ్వానించింది. భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (బీఎస్ఎంఆర్)లను అభివృద్ధి చేయడానికి బార్క్‌తో కలసి ఇది పనిచేస్తుంది. పరిశ్రమలు చేసే ప్రతిపాదనలను సమర్పించడానికి చివరి తేదీని 2026 మార్చి 31 వరకు పొడిగించింది.
****
(రిలీజ్ ఐడి: 2199698)
సందర్శకుల సూచీ సంఖ్య : : 45