|
హోం మంత్రిత్వ శాఖ
సైబర్ నేరాల నియంత్రణకు సామర్ధ్యాన్ని పెంచుకునే దిశగా ఓ పథకం
प्रविष्टि तिथि:
03 DEC 2025 5:22PM by PIB Hyderabad
భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం ‘పోలీసు’, ‘శాంతిభద్రతలు’ రాష్ట్ర పరిధిలోని అంశాలు. చట్టాన్ని అమలు చేసే సంస్థల (ఎల్ఈఏ) ద్వారా సైబర్ నేరాలతో సహా ఇతర నేరాల నివారణ, గుర్తింపు, దర్యాప్తు, విచారణకు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని ఎల్ఈఏల సామర్థ్య నిర్మాణానికి సూచనలు, ఆర్థిక సాయం అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది.
సైబర్ నేరాలను సమగ్రంగా, సమన్వయ పద్ధతిలో ఎదుర్కొనే యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి దిగువ పేర్కొన్న చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది:
-
దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో, సమగ్రంగా పరిష్కరించేందుకు ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (ఐ4సీ)ను అనుబంధ కార్యాలయంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
-
ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. అన్ని రకాల సైబర్ నేరాలకు సంబంధించిన ఘటనలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఐ4సీలో భాగంగా ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (ఎన్‌సీఆర్‌పీ) (https://cybercrime.gov.in) ప్రారంభమైంది. ఈ పోర్టల్లో చేసిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చట్ట అమలు సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్ట ప్రకారం తదుపరి చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటాయి.
-
ఆర్థిక మోసాలపై తక్షణమే ఫిర్యాదు చేయడానికి, మోసగాళ్లు ఆ నిధులను దొంగిలించకుండా ఆపడానికి ఐ4సీ పరిధిలో ‘సిటిజన్ ఫైనాన్సియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎంఎస్) 2021లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు, అందిన 23.02 లక్షలకు పైగా ఫిర్యాదుల్లో సుమారుగా రూ.7,130 కోట్లకు పైగా మొత్తాన్ని రక్షించారు. ఆన్లైన్ సైబర్ ఫిర్యాదులు నమోదు చేయడంలో సాయం అందించడానికి టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ ‘1930’ పనిచేస్తోంది.
-
ఐ4సీ వద్ద అత్యాధునిక సౌకర్యాలతో సైబర్ నేరాల ఉపశమన కేంద్రం (సీఎఫ్ఎంసీ) ఏర్పాటయింది. ఇక్కడ సైబర్ నేరాలను సత్వరమే పరిష్కరించడానికి, ఎలాంటి అడ్డంకులు లేకుండా సహకరించుకోవడానికి ప్రధాన బ్యాంకులు, ఆర్థిక మధ్యవర్తులు, చెల్లింపుల అగ్రిగేటర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు, ఐటీ మధ్యవర్తులు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చట్టాన్ని అమలు చేసే సంస్థల ప్రతినిధులు కలసి పనిచేస్తున్నారు.
-
పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 11.14 లక్షల సిమ్ కార్డులను, 2.96 లక్షల ఐఎంఈఐలను భారత ప్రభుత్వం బ్లాకు చేసింది.
-
ఐ4సీ, ఎంహెచ్ఏ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, సామర్థ్యాలను విస్తరించడానికి ‘స్టేట్ కనెక్ట్’, ‘థానా కనెక్ట్’, పీర్ లెర్నింగ్ కార్యక్రమాలను ఐ4సీ, ఎంహెచ్ఏ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాయి.
-
ఐ4సీలో భాగంగా, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు విభాగానికి చెందిన దర్యాప్తు అధికారి (ఐవో)లకు ప్రాథమిక దశ సైబర్ ఫోరెన్సిక్ సాయం అందించడానికి న్యూఢిల్లీలో (18.02.2019న), అస్సాంలో (29.08.2025న) అత్యాధునిక ‘జాతీయ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ (దర్యాప్తు)’లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు న్యూఢిల్లీలోని నేషనల్ సైబర్ ఫోరెన్సిక్స్ ల్యాబరేటరీ (ఇన్వెస్టిగేషన్) సైబర్ నేరాలకు సంబంధించిన దాదాపు 12,952 కేసుల్లో రాష్ట్రాలు/యూటీల ఎల్ఈఏలకు తన సేవలను అందించింది.
-
సైబర్ నేర దర్యాప్తు, ఫోరెన్సిక్స్, విచారణ తదితర కీలకమైన అంశాలకు సంబంధించిన ఆన్‌లైన్ కోర్సుల ద్వారా పోలీసు అధికారులు/న్యాయాధికారుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ఐ4సీ పరిధిలో ‘సైట్రెయిన్’ పేరుతో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (ఎంవోవోసీ) పోర్టల్‌ను అభివృద్ది చేశారు. దీని ద్వారా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1,44,895 మందికి పైగా పోలీసు/న్యాయాధికారులు రిజిస్టర్ చేసుకున్నారు. 1,19,628 కంటే ఎక్కువ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి.
-
దేశంలో సైబర్ భద్రతా ముప్పును ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన సైబర్ కమాండోల ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడానికి 10.09.2024న సైబర్ కమాండో కార్యక్రమాన్ని గౌరవ హోం మంత్రి ప్రారంభించారు. ముఖ్యమైన సమాచార వ్యవస్థలకు రక్షణ కల్పించే, జాతీయ సైబర్ భద్రతా ప్రయత్నాలకు తోడ్పడే దిశగా అంకితభావంతో పనిచేసే నిపుణులను ఈ కార్యక్రమం సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు గాంధీనగర్, ఢిల్లీలోని ఐఐటీలు, ఐఐఐటీలు, రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం (ఆర్ఆర్‌యూ), జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం (ఎన్ఎఫ్ఎస్యూ) లాంటి ప్రముఖ విద్యా సంస్థల్లో 281 మంది సైబర్ కమాండోలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు.
-
సైబర్ ఫోరెన్సిక్-శిక్షణ ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి, జూనియర్ సైబర్ కన్సల్టెంట్లను నియమించడానికి, ఎల్ఈఏ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులకు శిక్షణ అందించే సామర్థ్య నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ‘మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్ నేరాల నియంత్రణ (సీసీపీడబ్ల్యూసీ)’ పథకం ద్వారా కేంద్ర హోం శాఖ అందించింది. 33 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సైబర్ ఫోరెన్సిక్-శిక్షణ ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సైబర్ నేరాలపై అవగాహన, దర్యాప్తు, ఫోరెన్సిక్స్, తదితర అంశాల్లో 24,600 మంది ఎల్ఈఏ సిబ్బందికీ, జ్యుడిషియల్ అధికారులకూ, ప్రాసిక్యూటర్లకూ శిక్షణ అందించారు.
-
ఐటీ చట్టం 2000లోని 79వ సెక్షన్లో సబ్ సెక్షన్ (3), క్లాజ్ (బీ) పరిధిలో సంబంధిత ప్రభుత్వం లేదా ఏజెన్సీ ద్వారా ఐటీ మధ్యవర్తులకు నోటీసుల పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి ‘సహయోగ్’ పోర్టల్ ప్రారంభమైంది. చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో ఉపయోగించిన ఏ సమాచారమైనా, డేటా లేదా కమ్యూనికేషన్ లింకునైనా తొలగించడానికి లేదా నిలిపివేయడానికి ఇది సహకరిస్తుంది.
-
బ్యాంకు/ఆర్థిక సంస్థల సహకారంతో 10.09.2024న సైబర్ నేరస్తుల అనుమానిత రిజిస్ట్రీని ఐ4సీ ప్రారంభించింది. ఇప్పటి వరకు 18.43 లక్షల మంది అనుమానితుల సమాచారాన్ని బ్యాంకులు పంచుకున్నాయి. అలాగే 24.67 లక్షల లేయర్ 1 మ్యూల్ ఖాతాల వివరాలను అనుమానితుల రిజిస్ట్రీలో భాగమైన సంస్థలకు అందించాయి. రూ.8031.56 కోట్ల విలువైన లావాదేవీలను నిలిపివేశాయి.
-
ఎల్ఏఈఏలతో సైబర్ నేరాల సమాచారాన్ని పంచుకోవడానికి, విశ్లేషణలు అందించడానికి సమన్వయ పోర్టల్ ప్రారంభమైంది. ఇది మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) వేదికగా, డేటా రిపోజిటరీగా, సమన్వయ వేదికగా పనిచేస్తోంది. ఇది వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులతో సంబంధమున్న నేరాలు, నేరస్తులకు సంబంధించిన అంతర్రాష్ట్ర సమాచారాన్ని అందిస్తుంది. నేరస్థులకు, నేర స్థావరాలకు సంబంధించిన లొకేషన్ సమాచారాన్ని జ్యుడీషియల్ అధికారులకు ‘ప్రతిబింబ్’ మాడ్యూల్ అందిస్తుంది. ఐ4సీ, ఇతర ఎస్ఎంఈల నుంచి లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థల నుంచి సాంకేతిక-న్యాయ సహాయాన్ని పొందడం, స్వీకరించడాన్ని ఈ మాడ్యూల్ సులభతరం చేస్తుంది. ఇది 16,840 మంది అరెస్టు చేయడానికి దారి తీసింది. 1,05,129 సైబర్ దర్యాప్తు సహాయ అభ్యర్థనలు స్వీకరించింది.
-
సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటిలో..
-
27.10.2024న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ ధారావాహికలో డిజిటల్ అరెస్టుల గురించి భారత పౌరులకు గౌరవ ప్రధానమంత్రి వివరించారు.
-
డిజిటల్ అరెస్టు గురించి 28.10.2024న న్యూఢిల్లీ ఆకాశవాణి కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
-
-
కాలర్‌ట్యూన్ ప్రచారం: సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930, ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు టెలీ కమ్యూనికేషన్ల విభాగం (డీవోటీ) సహకారంతో 19.12.2024 నుంచి అమల్లోకి వచ్చేలా కాలర్‌ట్యూన్ ప్రచారాన్ని ఐ4సీ ప్రారంభించింది. ఇంగ్లీషు, హిందీ సహా 10 ప్రాంతీయ భాషల్లో కాలర్ ట్యూన్లను టెలికాం సర్వీసు ప్రొవైడర్ (టీఎస్‌పీ)లు ప్రసారం చేశాయి. డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు, మాల్వేర్, నకిలీ రుణ యాప్, నకిలీ సామాజిక మాధ్యమ ప్రకటనల వంటి వివిధ మోసాల గురించి వివరిస్తూ 6 రకాల కాలర్ ట్యూన్లను ప్లే చేశాయి.
-
-
డిజిటల్ అరెస్టు మోసాలకు సంబంధించి సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానిలో వార్తాప్రతికల్లో ప్రకటనలు, ఢిల్లీ మెట్రోల్లో ప్రకటన, ప్రత్యేక పోస్టులను తయారు చేయడం కోసం సామాజిక మాధ్యమాల్లో ఇన్ప్లుయెన్సర్లను ఉపయోగించడం, ప్రసార భారతి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం, ఆకాశవాణిలో ప్రత్యేక కార్యక్రమం ఉన్నాయి.
-
సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి డీడీ న్యూస్ భాగస్వామ్యంతో 2025 జులై 19 నుంచి సైబర్ అలర్ట్ పేరుతో 52 వారాల పాటు నిర్వహించే వారాంతపు కార్యక్రమాన్ని ఐ4సీ నిర్వహిస్తోంది.
-
-
సైబర్ నేరాలపై మరింత అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వాటిలో: ఎస్ఎంఎస్, ఐ4సీ సామాజిక మాధ్యమ ఖాతాలైన ఎక్స్ (గతంలో ట్విట్టర్) (@CyberDost), ఫేస్‌బుక్(CyberDostI4C), ఇన్స్టాగ్రామ్ (CyberDostI4C), టెలిగ్రామ్ (cyberdosti4c) ద్వారా సమాచార ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. అలాగే ఎస్ఎంఎస్ క్యాంపెయిన్లు, టీవీ, రేడియో ప్రచారాలు, పాఠశాలల్లో ప్రచారం, సినిమా హాళ్లలో ప్రకటనలు, ప్రముఖులతో ప్రచారం, ఐపీఎల్ క్యాంపెయిన్, కుంభమేళా 2025, సూర్ కుండ్ మేళా 2025లో ప్రచారం, మైగవ్ ద్వారా వివిధ మాధ్యమాల్లో ప్రచారం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో సైబర్ భద్రత, భద్రతా అవగాహన వారోత్సవాల నిర్వహణ, యువత/విద్యార్థుల కోసం హ్యాండ్ బుక్ ప్రచురణ, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు తదితర ప్రదేశాల్లో డిజిటల్ ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి.
రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఈ సమాధానాన్ని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ లిఖితపూర్వకంగా అందించారు.
***
(रिलीज़ आईडी: 2199159)
|