ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్‌గఢ్‌లోని జగ్‌దల్‌పూర్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
03 OCT 2023 1:48PM by PIB Hyderabad
జై జోహార్!
ఛత్తీస్‌గఢ్ గవర్నరు శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారూ, పార్లమెంటులో మా జనప్రియ సభ్యులిద్దరూ, రాష్ట్ర శాసనసభ్యులూ, ఎంపీలూ, జిల్లా మండళ్లూ, తాలూకా మండళ్ల ప్రతినిధులూ, లేడీస్ అండ్ జంటిల్మన్..
ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాతో పాటు ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ కల నిజమవుతుంది. ఈ సంకల్పానికి బలాన్నివ్వడానికి, ఈ రోజు ఇక్కడ సుమారు రూ.27,000 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చోటుచేసుకున్నాయి. మీ అందరికీ, ఛత్తీస్‌గఢ్ ప్రజలకీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
అభివృద్ధి చెందిన భారత్ ఆవిష్కారానికి వస్తుపరమైన, డిజిటల్ మాధ్యమ, సామాజిక మాధ్యమ మౌలిక సదుపాయాల కల్పన కూడా రాబోయే కాలాల అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. ఈ కారణంగానే మా ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అయ్యే ఖర్చును పెంచి, ఈ సంవత్సరం 10 లక్షల కోట్ల రూపాయలుగా చేసింది. ఇది మునుపటి కన్నా 6 రెట్లు ఎక్కువ.
మిత్రులారా,
దేశంలో ప్రస్తుతం నిర్మాణం అవుతున్న రైలుమార్గాలు, రహదారులు, విమానాశ్రయాలు, విద్యుత్తు ప్రాజెక్టులు, వాహనాలు, పేదల ఇళ్లు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల్లో ఉక్కు ప్రధాన పాత్రను పోషిస్ స్. ఉక్కును ఉత్పత్తి చేయడంలో భారత్ స్వయంసమృద్ధిని సాధించేటట్లు గత తొమ్మిది సంవత్సరాల్లో అనేక నిర్ణయాల్ని తీసుకున్నారు. ఉక్కును ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఒక ప్రధాన రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్, ఈ పరిణామం నుంచి ఎంతో ప్రయోజనాన్ని పొందుతోంది. దీనిలో భాగంగానే, భారత్‌లోని అత్యాధునిక ఉక్కు కర్మాగారాల్లో ఒక కర్మాగారాన్ని ఈ రోజు నగర్‌నార్‌లో ప్రారంభించుకున్నాం. ఇక్కడ ఉత్పత్తి చేసే ఉక్కు భారత ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాలతో పాటు, శరవేగంగా దూసుకుపోతున్న రక్షణ తయారీ రంగానికి కూడా కొత్త శక్తిని అందిస్తుంది. బస్తర్‌లో ఉత్పత్తి చేసిన ఉక్కు మన సైన్యాన్ని పటిష్ఠపరచడమే కాకుండా, దేశ రక్షణ ఎగుమతులను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ ఉక్కు కర్మాగారం వల్ల బస్తర్ చుట్టుపక్కల దాదాపు 50,000 మంది యువతకు ఉపాధి లభిస్తుంది. బస్తర్ వంటి అభివృద్ధి కోసం తపిస్తున్న జిల్లాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కనబరుస్తున్న ప్రాధాన్యానికి ఈ ఉక్కు కార్ఖానా గొప్ప అండదండలను అందిస్తుంది. దీనికి గాను బస్తర్ యువతకూ, ఛత్తీస్‌గఢ్ యువతకూ నేను మన:పూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
గత తొమ్మిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా సంధానంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కూ ఎకనామిక్ కారిడార్లు, ఆధునిక హైవేలు సమకూరాయి. ఛత్తీస్‌గఢ్‌కు రైలు బడ్జెటును 2014కు వెనుకటి కాలంతో పోలిస్తే సుమారు 20 రెట్ల మేర పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రధాన రైల్వే ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా, ఛత్తీస్‌గఢ్‌లోని తాడోకీ ఇంకా రైలు మార్గానికి నోచుకోలేదు. ఇవాళ.. తాడోకీ ఒక కొత్త రైలుమార్గాన్ని బహుమతిగా అందుకొంటోంది. ఇది గిరిజనులకు సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాదు.. వ్యావసాయిక, అటవీ ఉత్పాదనల రవాణా కూడా సులభమవుతుంది. తాడోకీకి ఇక రాయ్‌పూర్-అనంతగఢ్ డెమూ రైలుతో బంధం ఏర్పడింది. అంటే, రాజధాని రాయ్‌పూర్‌కు రాకపోకలు సులభమైపోతాయి. జగ్‌దల్‌పూర్-దంతేవాడ రైలు లైన్ ప్రాజెక్టు కూడా ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు పరిశ్రమల రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ రైల్వే ప్రాజెక్టులన్నీ కలిసి ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాల్ని పెద్ద సంఖ్యలో అందిస్తాయి.
మిత్రులారా,
ఛత్తీస్‌గఢ్‌లో రైల్వే ట్రాకులన్నిటికీ విద్యుదీకరణ పనులను పూర్తి చేశారని తెలిసి నేను సంతోషిస్తున్నాను. ఇది రైళ్ల వేగాన్ని పెంచడంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో గాలిని పరిశుభ్రంగా ఉంచడంలో కూడా తోడ్పడుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో రైల్వే నెట్‌వర్కును పూర్తిగా విద్యుదీకరించిన తరువాత, రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను కూడా మొదలుపెడతారు.
మిత్రులారా,
రాబోయే కాలంలో, ఛత్తీస్‌గఢ్‌లో రైల్వే స్టేషన్లకు మరిన్ని మెరుగులు దిద్దడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకకంలో భాగంగా రాష్ట్రంలో 30కి పైగా స్టేషన్లను గుర్తించారు. వాటిలో 7 స్టేషన్లను సరికొత్తగా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే శంకుస్థాపన పూర్తి అయింది. బిలాస్‌పూర్, రాయ్‌పూర్, దుర్గ్ స్టేన్లకు తోడు జగ్‌దల్‌పూర్ స్టేషనును కూడా ఈ జాబితాలో చేర్చారు. రాబోయే రోజుల్లో, జగ్‌దల్‌పూర్ స్టేషన్.. నగరంలో ప్రధాన కేంద్రంగా మారుతుంది. ఇక్కడ ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి. గత 9 సంవత్సరాల్లో రాష్ట్రంలో 120కి పైగా స్టేషన్లలో ఉచిత వై-ఫై సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
మిత్రులారా,
ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు.. ప్రతి సోదరీ, ప్రతి పుత్రికా, అలాగే యువత.. వీరి జీవనాన్ని మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం సకల ప్రయత్నాలనూ చేస్తోంది. ఈ రోజు ప్రారంభించుకున్న ప్రాజెక్టులూ, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఛత్తీస్‌గఢ్‌లో అభివృద్ధి వేగాన్ని పెంచి, కొత్త ఉద్యోగావకాశాలను అందిస్తాయి.. కొత్త వాణిజ్య సంస్థలను ప్రోత్సహిస్తాయి. ఇదే వేగంతోచ ఛత్తీస్‌గఢ్‌ను ఇక ముందూ మరింత ముందుకు తీసుకుపోతూ ఉంటామని మీకు నేను హామీని ఇవ్వదలచాను. భారత భాగ్యాన్ని మార్చడంలో ఛత్తీస్‌గఢ్ కూడా తనదైన ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ ప్రాజెక్టులన్నింటికి గాను ఛత్తీస్‌గఢ్ ప్రజలకు మరో సారి నేను నా అభినందనలను తెలియజేస్తున్నాను. ఇది ప్రభుత్వ పక్షాన నిర్వహిస్తున్న ఒక చిన్న కార్యక్రమం కావడంతో, నేను మీ కాలాన్ని ఎక్కువగా తీసుకోను. మరో 10 నిమిషాల్లో ఇంకో సార్వజనిక కార్యక్రమం ఉంది.. అందులో, ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన అనేక సంగతులను పౌరులతో పంచుకుంటాను. అక్కడ, అభివృద్ధికి చెందిన అనేక విషయాల్ని తెలియజేస్తాను. గవర్నరు ఇక్కడి వరకూ రావడం.. రాష్ట్రానికి కొంత ప్రాతినిధ్యమైనా దక్కిన విషయాన్ని సూచిస్తోంది. ఛత్తీస్‌గఢ్ అంటే గవర్నరుకు ఉన్న ఆందోళనా, ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న చింతా.. ఇవి వాటంతట అవే ఒక సానుకూల సందేశాన్ని అందిస్తున్నాయి. మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం.
గమనిక: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి సుమారు అనువాదం. ఆయన హిందీలో మాట్లాడారు.
***
(रिलीज़ आईडी: 2199154)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam