శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంట్ ప్రశ్న: పరిమళ, ఫ్లోరీకల్చర్ మిషన్

నాడు పోస్టు చేయడమైనది: 04 DEC 2025 4:30PM by PIB Hyderabad

భారతదేశంలో పుష్పాలు, పరిమళాల రంగాలకు ఊతమిచ్చేందుకు సీఎస్ఐఆర్ రెండు ముఖ్యమైన కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించటం, భారతదేశ ఫ్లోరీకల్చర్ రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యాలతో సీఎస్ఐఆర్ ఫ్లోరీకల్చర్ మిషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ మిషన్ రెండో దశలో ఉంది. ఫ్లోరీకల్చర్ పంటల సాగు నుంచి 32,44,000 పనిదినాల ఉపాధి వచ్చింది. ఈ మిషన్ 2,208.63 హెక్టార్ల విస్తీర్ణంలో భూమిని ఈ పంటల సాగులోకి తీసుకువచ్చింది. ఇది దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 126 జిల్లాలకు సంబంధించిన 399 క్లస్టర్లలో 16,220 మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చింది. తద్వారా గణనీయమైన సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని ఈ మిషన్ సృష్టించింది. అభివృద్ధి చేసిన 17 సాంకేతికతలను వ్యవస్థాపకులు, పరిశ్రమలకు బదిలీ అయ్యాయి. 5,728 లబ్ధిదారులు 144 సామర్థ్య నిర్మాణ, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో 1,615 మంది మహిళలు ఉన్నారు. ఈ మిషన్ తేనెటీగల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. ఫ్లోరీకల్చర్‌తో తేనెటీగల పెంపకాన్ని అనుసంధానించి 1,072 తేనెటీగల పెట్టెలను ఈ మిషన్ పంపిణీ చేసింది. దీనివల్ల 175 మంది రైతులు ప్రయోజనం పొందారు.

సీఎస్ఐఆర్‌ చేపడుతోన్న మరో ముఖ్యమైన కార్యక్రమం ఆరోమా మిషన్. దీనిని ఫ్లోరీకల్చర్ మిషన్ కంటే ముందే 2017లో ప్రారంభించింది. ఈ మిషన్ పరిమళ పంటల సాగు, ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా గ్రామీణ సాధికారతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉంది. అధిక ఆదాయాన్ని అందించడం ద్వారా రైతులకు ఈ మిషన్ గణనీయంగా ప్రయోజనం చేకూర్చింది. అలాగే సుగంధ పరిశ్రమకు నాణ్యమైన ముడి పదార్థాలను అందించటంతో పాటు ఆత్మనిర్భరతకు దోహదపడింది. 51,000 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భూమి పరిమళ పంటల కిందకు వచ్చింది. దేశంలోని 28 రాష్ట్రాలలో 4,500 కంటే ఎక్కువ అరోమా క్లస్టర్‌లు తయారయ్యాయి. వీటిలో 20 క్లస్టర్‌లు గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. నేటి వరకు 52 రకాల పరిమళ పంటలు, 82 ప్రాంతీయ-నిర్దిష్ట వ్యవసాయ-సాంకేతికతలు కొత్తగా వచ్చాయి. పరిమళ పంటల ప్రాసెసింగ్ కోసం వివిధ రాష్ట్రాలలో 408 స్వేదనం (డిస్టిల్లేషన్) యూనిట్లు ఏర్పాటయ్యాయి. నైపుణ్యాభివృద్ధి కింద 2,096 శిక్షణా- అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. వీటి ద్వారా 1.22 లక్షల మంది శిక్షణ పొందారు. వీరిలో 10,000 మంది మహిళలు ఉన్నారు. పరిమళ పంటల నుంచి విలువ-జోడించిన ఉత్పత్తులను తయారు చేసే విషయంలో 110 కంటే ఎక్కువ వ్యవస్థాపకులకు సహాయం అందింది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1 కోటి గ్రామీణ ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. అరోమా మిషన్ కింద పరిమళాల పరిశ్రమకు ముడి పదార్థంగా రూ. 600 కోట్ల విలువైన 6,000 టన్నుల కంటే ఎక్కువ ఎసెన్షియల్ ఆయిల్ ఉత్పత్తి అయింది. 

ఫ్లోరీకల్చర్, తేనెటీగల పెంపకం నుంచి రూ. 262 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని అర్జించిన సీఎస్ఐఆర్ ఫ్లోరీకల్చర్ మిషన్ దేశవ్యాప్తంగా 22,137 మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమంగా ఇది నిరూపితమైంది. ఈ మిషన్‌లోని ప్రతి రైతు సుమారు రూ. 1.18 లక్షల ఆదాయాన్ని పొందారు. ఇది సంప్రదాయ పంటలతో పోలిస్తే సుమారు 2-3 రెట్లు ఎక్కువ. 44 లక్షల కంటే ఎక్కువ గ్రామీణ పనిదినాలను సృష్టించిన ఈ మిషన్.. జీవనోపాధి భద్రతను మరింత బలోపేతం చేసింది.

సీఎస్ఐఆర్ అరోమా మిషన్ కింద నిమ్మగడ్డి, పామరోసా, వెటివర్, తులసి, మెంథా వంటి పరిమళ పంటల సాగు కూడా ప్రారంభమైంది. వీటిని తక్కువ నీరు, పోషకాలతో సులభంగా సాగు చేయొచ్చు. ఈ పంటలను వర్షాధార పరిస్థితుల్లో కూడా సులభంగా సాగు చేయొచ్చు. సంప్రదాయ పంటలతో పోలిస్తే రైతులు హెక్టారుకు రూ. 60,000 నుంచి రూ. 70,000 ఎక్కువ ఆదాయాన్ని పొందటంతో పాటు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచి అవకాశాన్ని ఇది అందిస్తోంది. తుఫానులు, సునామీలు, వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన వెటివర్ వంటి పంటలు ఇప్పుడు రైతులకు లాభదాయకమైనవిగా మారాయి.

పూల దిగుమతులను సుమారు 15 శాతం తగ్గించాలనే ప్రారంభ లక్ష్యంతో సీఎస్ఐఆర్ ఫ్లోరీకల్చర్ మిషన్ ప్రారంభమైంది. ఇది దేశ పూల దిగుమతి-ఎగుమతి రంగంపై గణనీయమైన ప్రభావాన్ని కనబర్చింది. నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా దేశం మారేందుకు సీఎస్ఐఆర్ అరోమా మిషన్ దోహదపడింది. అధిక దిగుబడినిచ్చే రకాల విషయంలో సీఎస్ఐఆర్ చేస్తోన్న నిరంతర కృషి ఫలితంగా మెంథాల్ మింట్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచ నాయకత్వ స్థానానికి వచ్చింది. దేశం నుంచి పామరోసా ఆయిల్ కూడా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. అరోమా మిషన్ వల్ల ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడులలో వెటివర్ పంటల సాగు పెరిగింది. ఇది ఇతర దేశాల నుంచి వెటివర్ ఆయిల్ దిగుమతిని తగ్గించింది. 

దేశీయ ఫ్లోరీకల్చర్‌ను బలోపేతం చేయటం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సీఎస్ఐఆర్ ఫ్లోరీకల్చర్ మిషన్ కొత్త పుష్పాల రకాలను చురుకుగా అభివృద్ధి చేస్తోంది. ఈ మిషన్ కింద ఎనిమిది రకాలు విడుదలయ్యాయి. ఎన్‌బీఆర్ఐ-నమోహ్ 108 తామర రకం, సీఎస్ఐఆర్- ఎన్‌బీఆర్ఐ అభివృద్ధి చేసిన నాలుగు క్రైసాన్తిమం రకాలు (‘ఎన్‌బీఆర్ఐ-జగన్నాథ్’, ‘ఎన్‌బీఆర్ఐ-సరస్వతి’, ‘ఎన్‌బీఆర్ఐ-స్తుతి’, ‘ఎన్‌బీఆర్ఐ-పదం’), సీఎస్ఐఆర్- ఐహెచ్‌బీటీ అభివృద్ధి చేసిన మూడు జెర్బెరా రకాలు (‘హిమ్ అరుణ-మెరూన్’, ‘హిమ్ ప్రభ-పసుపు’, ‘హిమ్ కుముద్-పింక్’) ఇందులో ఉన్నాయి. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఎన్‌బీఆర్ఐ-నమోహ్ 108 వ్యవసాయ-సాంకేతికతను పలు రాష్ట్రాల్లో ఉన్న వ్యవస్థాపకులకు బదిలీ చేశారు. గ్లాడియోలస్, జెర్బెరా, క్రైసాన్తిమం, తామరకు సంబంధించిన అదనపు రకాల అభివృద్ధి కోసం పరిశోధన కొనసాగుతోంది. 

 

***


(రిలీజ్ ఐడి: 2199145) సందర్శకుల సూచీ సంఖ్య : : 37
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil