|
వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి
प्रविष्टि तिथि:
02 DEC 2025 5:36PM by PIB Hyderabad
దేశంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనేక కేంద్ర రంగ పథకాలతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా అమలు చేస్తోంది. ఈ పథకాలు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), వ్యవసాయ రుణం, పంట బీమా, సేద్యపు నీటి పారుదల, నిల్వ, మార్కెటింగ్, సేంద్రియ వ్యవసాయం, సాంకేతిక నవకల్పన, వ్యావసాయిక ఎగుమతులు సహా వ్యవసాయానికి సంబంధించిన అన్ని పార్శ్వాలనూ స్పర్శిస్తున్నాయి.
వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలకు బడ్జెటులో కేటాయింపు జరపడంతో పాటు సముచిత విధాన నిర్ణయాల్ని తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండదండలను అందిస్తోంది. ఉత్పత్తిని పెంచి, గిట్టుబాటు ప్రతిఫలాలను ఇవ్వడంతో పాటు రైతులకు ఆదాయ పరంగా మద్దతివ్వడమే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ధ్యేయంగా ఉంది. వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగానికి (డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ)కు బడ్జెటు కేటాయింపును ప్రభుత్వం గణనీయంగా పెంచింది. 2013-14లో బడ్జెట్ అంచనా (బీఈ) రూ.21,933.50 కోట్లుగా ఉంటే, దీనిని 2025-26లో రూ. 1,27,290.16 కోట్లకు చేర్చారు. వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడానికి డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ మొదలుపెట్టిన ప్రధాన పథకాల్నీ, కార్యక్రమాల్నీ అనుబంధంలో చూడవచ్చు.
డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ పథకాలను వీటితో సంబంధం ఉన్న మంత్రిత్వ శాఖల, విభాగాల పథకాలతో మేళవించినందువల్ల ఆదాయాన్ని పెంచుకున్న 75,000 మంది రైతుల విజయ గాథల సంకలనాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) విడుదల చేసింది.
గణాంకాల, కార్యక్రమాల అమలు శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్ఓ) 2018 జులై మొదలు 2019 జూన్ మధ్య వ్యవసాయ సంవత్సరానికిగాను ఎన్ఎస్ఎస్ 77వ విడతలో (2019 జనవరి నుంచి అదే సంవత్సరంలో డిసెంబరు వరకు గ్రామీణ ప్రాంతాల రైతు కుటుంబాల స్థితిని అంచనా వేసేందుకు ఒక సర్వే (ఎస్ఏఎస్)ను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం, వ్యావసాయిక కుటుంబాల సగటు నెలవారీ ఆదాయ అంచనా 2012-13 (ఎన్ఎస్ఎస్ 70వ విడత) లో రూ.6,426 నుంచి పెరిగి, 2018-19 (ఎన్ఎస్ఎస్ 77వ విడత) లో రూ.10,218కు చేరింది.
కుటుంబ వినియోగ వ్యయానికి సంబంధించిన ఎన్ఎస్ఎస్ఓ సర్వే (2023-24)లో పేర్కొన్న ప్రకారం, అఖిల భారతీయ సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం (మంత్లీ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్.. ఎంపీసీఈ) అంచనాల పోలిక ఈ కింద ప్రస్తావించిన విధంగా ఉంది:
|
రంగం
|
వివిధ కాలాల్లో సగటు ఎంపీసీఈ (రూపాయల్లో)
|
|
2011-12 ఎన్ఎస్ఎస్ (68వ విడత)
|
2023-2024
|
|
గ్రామీణ
|
1,430
|
4,122
|
|
పట్టణ
|
2,630
|
6,996
|
|
గ్రామీణ ఎంపీసీఈలో తేడా శాతం రూపంలో
|
83.9
|
69.7
|
అనుబంధం
1. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్): ఇది ఆదాయ సహాయ ప్రధాన పథకం.. సాగు యోగ్యమైన భూమి గల రైతులకు సంవ్సరానికి మూడు వాయిదాల్లో రూ.6,000 ఇస్తున్నారు.
2. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (పీఎం-కేఎంవై): ఇది 18 ఏళ్లు మొదలు 40 ఏళ్ల వయోవర్గం వారికి ఒక స్వచ్ఛంద, తమ వంతుగా కొంత మొత్తాన్ని జమ చేయాల్సిన నిబంధన కలిగిన పింఛను పథకం. దీనిలో, 60 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు పింఛను రూపంలో నెల నెలా రూ.3,000 ఇచ్చే ఏర్పాటుంది.
3. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)/ పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్): రైతులకు అధిక ప్రీమియం రేట్లు, బీమా సొమ్ముకు ఒక నిర్దేశిత గరిష్ఠ పరిమితి సమస్యగా మారినందువల్ల, ఈ సమస్యలను పరిష్కరించడానికి పీఎంఎఫ్‌బీవైని తీసుకువచ్చారు. ఈ పథకంలో భాగంగా దేశంలో 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి ఏటా 4 కోట్ల మందికి పైగా రైతులకు బీమా సౌకర్యాన్ని సమకూరుస్తున్నారు.
4. వడ్డీ పరంగా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న పథకంలో సవరణ (మోడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్.. ఎంఐఎస్ఎస్): పంట దిగుబడి, పశుపోషణ, పాడి, చేపల పెంపకం తదితర సహాయక కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులకు రాయితీతో కూడిన స్వల్పకాలిక వ్యవసాయ రుణాన్ని వడ్డీ పరంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్న పథకం (ఐఎస్ఎస్) అందిస్తున్నది. ఒక సంవత్సర కాలానికి 7 శాతం వార్షిక వడ్డీపై, రూ.3 లక్షల వరకు స్వల్పకాల పంట రుణాన్ని అందుకొంటున్న రైతులకు ఐఎస్ఎస్ వర్తిస్తుంది.
5. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్): పంట కోత అనంతర నిర్వహణ, సాముదాయిక వ్యవసాయ ఆస్తుల్లో పెట్టుబడికి ఉద్దేశించిన మధ్య కాలిక, దీర్ఘకాలిక రుణాల సదుపాయాన్ని అందించడానికి రూ.1 లక్షకోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) పథకాన్ని ప్రారంభించారు. దేశంలో వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల వ్యవస్థను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ప్రోత్సాహకాలనూ, ఆర్థిక సహాయాన్నీ అందించాలని సంకల్పించారు. ఈ ఆర్థిక సహాయ సదుపాయంలో రూ. 2 కోట్ల పరిమితి వరకు ఉండే అన్ని రుణాలపైనా సాలుసరి 3 శాతం వడ్డీరూప ప్రభుత్వ ఆర్థిక సహాయం (ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్) అందుబాటులో ఉంది. మరి ఈ పరిమితి కన్నా ఎక్కువ రుణాల విషయంలో అయితే, ఈ ఆర్థిక సహాయ సదుపాయం రూ. 2 కోట్ల వరకే పరిమితమవుతుంది.
6. కొత్తగా 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేన్ల (ఎఫ్‌పీఓస్) ఏర్పాటు, ప్రోత్సాహం: భారత ప్రభుత్వం.. కేంద్ర రంగ పథకంలో భాగంగా 10,000 ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేసి, వాటిని ప్రోత్సహిస్తోంది. రైతులు తమ బేరమాడే శక్తిని పెంచుకొని, విస్తృత పరిమాణంలో లావాదేవీలు నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందగలిగేటట్లుగానూ, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొనే విధంగా వారి దిగుబడుల్ని ఏకీకరించుకొని వ్యావసాయిక ఆదాయాన్ని పెంచుకోగలిగేటట్లుగానూ ఈ పథకం తోడ్పడుతుంది. తద్వారా రైతులకు నిరంతర ఆదాయాన్ని సమకూర్చడంలో ఈ పథకం ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది.
7. జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్‌బీహెచ్ఎమ్): ‘‘తీపి విప్లవం’’ లక్ష్యాన్ని సాధించడానికి ఈ మిషన్‌ను ప్రవేశపెట్టారు. తేనెటీగల పెంపకానికి ఒక శాస్త్రీయ పద్దతిని రూపొందించి, దానికి సంపూర్ణంగా మెరుగులను దిద్దడానికి.. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో ఓ భాగంగా.. ఈ మిషన్‌ను ప్రారంభించారు.
8. నమో డ్రోన్ దీదీ: ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయంసహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీస్)కు డ్రోన్లను సమకూర్చడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు పొలం పనుల్లో (ఎరువులు, పురుగుమందులను చల్లడం వంటివి) బాసటగా ఉండటానికి డ్రోన్ సేవలను కిరాయికి అందించడం ఈ పథకం ముఖ్యోద్దేశం.
9. ప్రకృతి వ్యవసాయం అంశానికి సంబంధించిన జాతీయ మిషన్ (ఎన్ఎంఎన్‌ఎఫ్) : 7.5 లక్షల హెక్టార్ల ప్రాంతంలో 15,000 క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు, అవసరాలకు అనుగుణంగా 10,000 బయో-ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్ల (బీఆర్‌సీస్)ను ఏర్పాటు చేయడం ఈ మిషన్ లక్ష్యం.
10. ప్రధానమంత్రి అన్నదాతా ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆశా): ఎంఎస్‌పీ వ్యవస్థను బలపరిచి, రైతులకు గిట్టుబాటు ధరల్ని అందించడం ఈ పథకం లక్ష్యం. పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బరి.. వీటికి ధరల పరంగా మద్దతు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం. కనీసం ఇంత ఆదాయానికి హామీనిస్తూ, రైతులు వారి ఫలసాయాన్ని తెగనమ్ముకొనే స్థితిని ఎదుర్కోకుండా చూడడం, కొనుగోళ్లను ప్రోత్సహించడం, ధరల్లో తేడాలుంటే అందుకు చెల్లింపులు చేయడం, కొనుగోళ్ల ప్రక్రియలో ప్రయివేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.. ఈ మార్గాల్లో అంతిమంగా రైతులు పండించిన పంటలకు న్యాయమైన ప్రతిఫలాన్ని వారు పొందేటట్లుగా చూడడం.. ఇవన్నీ కూడా ‘పీఎం-ఆశా’ లక్ష్యాలే.
11. అంకుర సంస్థలకూ, గ్రామీణ వాణిజ్య వ్యవస్థలకూ ఉద్దేశించిన అగ్రి ఫండ్ (అగ్రిష్యూర్): వ్యావసాయిక, గ్రామీణ అనుబంధ విస్తారిత వ్యవస్థలో నవకల్పననూ, ఔత్సాహిక పారిశ్రామికత్వాన్నీ పెంపొందింప చేయడానికి ఉద్దేశించిన రూ.750 కోట్ల మిశ్రిత మూలధన నిధి ఇది. వ్యవసాయం, దానికి సంబంధించిన కార్యకలాపాల్లో నిమగ్నమైన అంకుర సంస్థల కోసం ఈక్విటీ, రుణ రూపాల్లో ఆర్థికసాయాన్ని అందించడంతో పాటు మన్నిక కలిగి ఉండే, విస్తరణయోగ్య వాణిజ్య నమూనాలకు ఈ నిధి దన్నుగా నిలుస్తుంది.
12. తక్కువ నీళ్లు.. ఎక్కువ పంట (పర్ డ్రాప్ మోర్ క్రాప్.. పీడీఎంసీ): సూక్ష్మ సేద్య సాంకేతికతలు (డ్రిప్, స్ప్రింక్లర్లను) ఉపయోగించి పొలాల్లో జల వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, తద్వారా దేశ రైతులు లాభపడే విధంగా చూడడం ఈ కార్యక్రమం ధ్యేయం.
13. వ్యవసాయ యంత్రీకరణకు సంబంధించిన ఉప-మిషన్ (ఎస్ఎంఏఎమ్) : వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని ఆధునికీకరించడంతో పాటు పొలం పనుల్లో శ్రమ తీవ్రతను తగ్గించడంలో వ్యవసాయ యంత్రీకరణ ఉప-మిషన్ ఎంతో కీలక పాత్రను పోషిస్తుంది.
14. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) : ఇది దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన మొదటి విస్తృత పథకం.
15. నేల ఆరోగ్యం, ఫలన సామర్థ్యం (ఎస్‌హెచ్ అండ్ ఎఫ్): భూమి స్వస్థత కార్డు (ఎస్‌హెచ్‌సీ) కార్యక్రమాన్ని అమలు చేస్తూ సంతులిత, ఏకీకృత పోషక తత్వాల నిర్వహణను ప్రోత్సహించడం ఈ పథకం ధ్యేయం. మట్టి నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణ, పోషక తత్వాల విషయంలో రైతులకు సలహాలను ఇవ్వడం వంటివి ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. పాఠశాల స్థాయిలో బుల్లి నేల ప్రయోగశాలల్ని ఏర్పాటు చేయడంతో పాటు (1,020 విధ్యుక్త పాఠశాలలు.. వీటిని 5,000 పీఎం శ్రీ స్కూళ్ల స్థాయికి విస్తరించేందుకు అవకాశం ఉంది) ప్రదర్శనలు, ప్రచార ఉద్యమాలు, రైతులకు శిక్షణ కార్యక్రమాల్ని కూడా నిర్వహించి సామర్థ్యాన్ని పెంచడానికి ఈ పథకం దోహదం చేస్తుంది.
16. వర్షాధారిత ప్రాంతాభివృద్ధి (రెయిన్‌ఫెడ్ ఏరియా డెవలప్‌మెంట్..ఆర్ఏడీ): సుస్థిర వ్యవసాయానికి ఉద్దేశించిన జాతీయ మిషన్ (ఎన్ఎంఎస్ఏ)లో భాగంగా ఆర్ఏడీని అమలు చేస్తున్నారు. ఉత్పాదనను పెంచడానికీ, వాతావరణ మార్పుతో సంబంధం కలిగిన రిస్కులను తగ్గించడానికీ ఇది ఏకీకృత వ్యవసాయ వ్యవస్థ (ఐఎఫ్ఎస్)పై దృష్టిని కేంద్రీకరిస్తుంది.
17. వ్యావసాయిక వనాల పెంపకం కార్యక్రమం: సుస్థిర వ్యవసాయానికి ఉద్దేశించిన జాతీయ మిషన్ (ఎన్ఎంఎస్ఏ) లో భాగంగా వ్యావసాయిక వనాల పెంపకానికి సంబంధించిన ఉప-మిషన్ (ఎస్ఎంఏఎఫ్)ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడానికి గాను ‘‘హర్ మేఢ్ పర్ పేడ్’’ నినాదంలో భాగంగా పొలాల్లో మొక్కలను పెంచడం ఈ ఉప-మిషన్ ధ్యేయంగా ఉంది.
18. పంట వివిధీకరణ కార్యక్రమం (సీడీపీ): ధాన్యం వంటి నీళ్లు ఎక్కువగా అవసరమయ్యే పంటల్ని పండించే రైతులను ఆ పంటల నుంచి మళ్లించి, అధిక మన్నికతో పాటు మరింత లాభదాయక ప్రత్యామ్నాయ పంటలు (పప్పుధాన్యాలు, నూనెగింజలు, ముతక ధాన్యాల వంటివి) వైపు నడిపించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇది వనరులను సంరక్షించడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వివిధ పంటల రూపేణా రైతుల ఆదాయాన్ని పెంచడంపైన కూడా దృష్టిని కేంద్రీకరిస్తుంది.
19. వ్యవసాయ విస్తరణకు సంబంధించిన ఉప- మిషన్ (ఎస్ఎంఎస్‌పీ): రైతు ప్రయోజనాలకు ఉద్దేశించిన, రైతు కూడా బాధ్యత పంచుకోవాల్సిన ఓ విస్తరణ వ్యవస్థని ఏర్పాటు చేయడం ఈ పథకం లక్ష్యం. దీనిలో భాగంగా, భాగస్వామ్య పద్ధతిలో విస్తరణ సంబంధిత సంస్కరణలను మొదలుపెట్టడానికి జిల్లా స్థాయిలో వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ.. ఏటీఎంఏ)ను స్థాపిస్తారు.
20. విత్తనాలు, మొక్కలను పెంచే సామగ్రికి సంబంధించిన ఉప- మిషన్ (ఎస్ఎంఎస్‌పీ): ఈ కార్యక్రమంలో విత్తన ఉత్పాదనకు సంబంధించిన అన్ని దశలనూ లెక్క లోకి తీసుకుంటారు. కేంద్రక విత్తనాల ఉత్పాదన మొదలు ధ్రువీకృత విత్తనాల సరఫరా వరకూ దీనిలో భాగంగా ఉంటుంది. అలాగే విత్తన రంగ అభివృద్ధికి అనుకూలంగా ఉండే మౌలిక సదుపాయాలను సమకూర్చుతుంది. విత్తన ఉత్పాదక సంస్థలకు ఊతాన్నిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వంటి ఆకస్మికంగా తలెత్తిన పరిస్థితుల్లో నిలదొక్కుకోవడానికి ప్రత్యేక విత్తన బ్యాంకును కూడా.. దీనిలో భాగంగా.. ఏర్పాటు చేస్తారు.
21. జాతీయ ఆహార భద్రత, పోషణ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎమ్): గుర్తించిన 28 రాష్ట్రాల్లోని జిల్లాల్లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో (జమ్మూ కాశ్మీర్‌తో పాటు లద్దాఖ్‌లో) బియ్యం, గోధుమ, పప్పుధాన్యాలు, ముతక తృణ ధాన్యాల (జొన్న, బార్లీ)కి తోడు పోషక ప్రధాన ధాన్యాలను పండించే ప్రాంతాలను విస్తరిస్తూ, క్రమంగా ఉత్పత్తిని పెంచడం ఈ మిషన్ లక్ష్యం.
22. వ్యవసాయ మార్కెటింగుకు గాను ఏకీకృత పథకం (ఐఎస్ఏఎమ్) : ఈ పథకం వ్యావసాయిక ఉత్పాదనల మార్కెటింగ్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడుతుంది. దీని కోసం మార్కెట్ వ్యవస్థల నిర్మాణంతో పాటు వాటికి మెరుగులు దిద్దడానికీ, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకు తోడు మార్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికీ తోడ్పాటును అందిస్తుంది.
23. ఉద్యాన పంటల సమీకృత అభివృద్ధి మిషన్ (ఎంఐడీహెచ్) : పండ్లు, కాయగూరలు, కంద మూలాలు, పుట్టగొడుగులు, మసాలా దినుసులు, పూలు, సుగంధ మొక్కలు, కొబ్బరి, జీడిపప్పు, కోకో, వెదురు సహా తోటల పెంపకం రంగంలో సమగ్ర వృద్ధిని సాధించడానికి తోడ్పడడం ఈ పథకం లక్ష్యంగా ఉంది.
24. వంట నూనెల జాతీయ మిషన్ (ఎన్ఎంఈఓ)- ఆయిల్ పామ్ : ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. దేశంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. భారత్‌లో మరీముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేకంగా దృష్టిని సారిస్తూ, మన దేశాన్ని స్వయంసమృద్ధ దేశంగా తీర్చిదిద్దడం ఈ పథకం ముఖ్యోద్దేశం.
25. వంట నూనెల జాతీయ మిషన్ (ఎన్ఎంఈఓ)- నూనెగింజలు : దేశీయ నూనెగింజల ఉత్పత్తిని పెంచి, భారీ పరిమాణంలో దిగుమతి చేసుకుంటూ వంట నూనెల కోసం భారత్ విదేశాలపైన. ఆధారపడుతున్న ప్రస్తుత స్థితిని తగ్గించడం ఈ పథకం ఉద్దేశం. నూనెగింజల పంటలు పండతున్న విస్తీర్ణాన్ని పెంచడం, నాణ్యమైన విత్తనాల, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సాయంతో దిగుబడిని మెరుగుపరచడం, నూనెగింజల దిశగా పంటల వివిధీకరణ, శుద్ధి ప్రక్రియల్నీ, విలువను జోడించే మౌలిక సదుపాయాల కల్పననీ బలోపేతం చేయడంతో పాటు మెరుగైన మార్కెట్ లభ్యతకు కూడా తగిన చర్యలను తీసుకుంటూ, నూనెగింజల సాగులో నిమగ్నమైన రైతులకు అధికాదాయాన్ని సమకూర్చడం ఈ మిషన్ లక్ష్యాలే.
26. ఈశాన్య ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొన్న మిషన్ ఆర్గానిక్ వేల్యూ చైన్ డెవలప్‌మెంట్ (ఎంఓవీసీడీఎన్ఈఆర్): దేశ ఈశాన్య ప్రాంతంలో నిర్దిష్ట సరకులనే ఉత్పత్తి చేయడానికి, అలాగే ధ్రువీకరించిన సేంద్రియ ఉత్పాదనల క్లస్టర్లను అభివృద్ధి చేసి ఉత్పాదకాలు, విత్తనాలు, ధ్రువీకరణ మొదలు సేకరణ, శుద్ధి, విక్రయం, బ్రాండ్ స్థాయిని సంతరించడం వరకూ ఒక సంపూర్ణ వేల్యూ చైన్‌ను తీర్చిదిద్ది రైతులకూ, వినియోగదారులకూ మధ్య లంకెను ఏర్పరచడం ఎంఓవీసీడీఎన్ఈఆర్ ధ్యేయం.
27. డిజిటల్ వ్యవసాయ మిషన్: వ్యవసాయంలో ప్రస్తుత జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక (ఎన్‌ఈజీపీఏ)కు మెరుగులు దిద్దే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. దీనికోసం వ్యవసాయానికి సంబంధించి ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థను రూపొందించాలని సంకల్పించారు. పంటల పథక రచన, పంటల ఆరోగ్యం, ఉత్పాదనకు దోహదం చేసే సూచనలు, వ్యవసాయ ఉత్పాదకాల లభ్యతను మెరుగుపరచడం, రుణం, బీమా, పంట దిగుబడి అంచనాలో సాయం, మార్కెటుకు సంబంధించిన కీలక సమాచారంతో పాటు వ్యవసాయ సాంకేతిక పరిశ్రమ, ఇంకా అంకుర సంస్థల వృద్ధికి సాయపడటానికి వీలుగా డీపీఐని అందరికీ అందుబాటులో ఉంటూ, ప్రజాహితానికి తోడ్పడేదిగా తీర్చిదిద్దుతారు.
28. జాతీయ వెదురు మిషన్: ఈ పథకాన్ని స్టేట్ బాంబూ మిషన్స్ (ఎస్‌బీఎమ్) ద్వారా గాని, లేదా స్టేట్ బాంబూ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎస్‌బీడీఏ) ద్వారా గాని అమలు చేస్తున్నారు. ఎన్‌బీఎమ్ ప్రధానంగా వెదురు రంగంలో పూర్తి వేల్యూ చైన్ అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకుర్ ఈ రోజు లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2198504)
|