అంతరిక్ష విభాగం
భారతదేశపు మొదటి మానవ అంతరిక్ష మిషన్ అయిన గగన్‌యాన్ విషయంలో ఇస్రో సంసిద్ధతను విజయవంతంగా నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్‌డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ) చాటి చెప్పిందని పార్లమెంట్‌కు తెలియజేసిన డాక్టర్ జితేంద్ర సింగ్
ఇస్రో చేపట్టిన ఎక్స్‌ట్రీమ్-కండీషన్ పారాచూట్ పరీక్ష గగన్‌యాన్ విషయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసిందన్న డాక్టర్ జితేంద్ర సింగ్
ఐఎంఏటీ ద్వారా నేర్చుకున్న విషయాలను వ్యోమగామి అత్యవసర ప్రోటోకాల్‌లు, మనుగడ శిక్షణలో చేర్చనున్నట్లు తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్
ఎక్స్‌ట్రీమ్-కండీషన్ పారాచూట్ పరీక్ష విజయవంతంతో భారత మొదటి మానవ సహిత అంతరిక్ష మిషన్‌ను 2027 మొదటి త్రైమాసికంలో చేపట్టాలన్న ప్రణాళిక సరైన విధంగా కొనసాగుతోందని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
03 DEC 2025 5:46PM by PIB Hyderabad
భారత మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అయిన 'గగన్‌యాన్' విషయంలో మిషన్ సంసిద్ధతను బలోపేతం చేయడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్‌డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ) ఒక ముఖ్యమైన దశను సూచిస్తోందని కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ సహాయ మంత్రి, పీఎంఓ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు పార్లమెంట్‌కు తెలియజేశారు. లోక్‌సభలో ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. మిషన్‌లోని అత్యంత క్లిష్టమైన మానవ సంబంధిత అంశాలలో క్రూ మాడ్యూల్ ఒకటని అన్నారు. దీనికి సంబంధించిన పారాచూట్ ఆధారిత డీసెలరేషన్ వ్యవస్థ కోసం జరుగుతున్న అర్హత పరీక్షల్లో ఐఎంఏటీ ఒక కీలకమైన భాగమని పేర్కొన్నారు.
కిందకు దిగే విషయంలో రెండు ప్రధాన పారాచూట్‌ల మధ్య డిస్‌రీఫింగ్‌లో ఉద్దేశపూర్వకంగా ఆలస్యాన్ని చొప్పించటం ద్వారా అత్యంత కఠిన పరిస్థితుల్లో ఐఐఎంటీ సిమ్యులేషన్ జరిగినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఈ అధిక ఒత్తిడితో కూడిన పరిస్థితిని విజయవంతంగా ఐఐఎంటీ ప్రదర్శించింది. ఇది అసమాన పరిస్థితుల కింద వ్యవస్థకు ఉన్న నిర్మాణ సమగ్రత, భారాన్ని మోసే సామర్థ్యం రెండింటినీ ధ్రువీకరించింది. ఈ విజయవంతమైన పరీక్ష మాన-రేటింగ్ ప్రక్రియను గణనీయంగా ముందుకు తీసుకెళ్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇది 2027 మొదటి త్రైమాసికంలో మొదటి మానవ సహిత గగన్‌యాన్ మిషన్‌ను చేపట్టాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతునిస్తుంది.
థర్డ్ పార్టీ ధృవీకరణ, సాంకేతిక పర్యవేక్షణకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్.. క్రూ మాడ్యూల్ పారాచూట్ వ్యవస్థ, దాని సంబంధిత అన్ని పరీక్షా ఫలితాలను ఇస్రో క్రమం తప్పకుండా స్వతంత్ర, కఠినమైన సమీక్షా యంత్రాంగాలకు అందిస్తోందని తెలిపారు. వీటిలో డిజైన్ రివ్యూ టీమ్ (డీఆర్‌టీ), ఇండిపెండెంట్ అసెస్‌మెంట్ కమిటీ, దేశవ్యాప్త ప్రముఖ నిపుణులతో కూడిన మానవ రేటింగ్- ధ్రువీకరణకు సంబంధించిన జాతీయ సలహా ప్యానల్ (ఎన్ఏపీ) ఉన్నట్లు వెల్లడించారు. ఈ వ్యవస్థలు మానవ-రేటింగ్ అంశాలన్నింటినీ పకడ్బందీగా పరిశీలించేలా చూసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
పారదర్శకత విషయంలో సభ్యులు లేవనెత్తిన సందేహాలపై మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఐఎంఏటీతో సహా ప్రధాన పరీక్షల ఫలితాలను తరచుగా కాలానుగుణంగా ఇస్రో ప్రకటిస్తోందన్నారు. ఈ మానవ సహిత అంతరిక్ష యాత్ర పురోగమిస్తున్న కొద్దీ ఇస్రో ప్రజలకు సమాచారం అందిస్తూనే ఉంటుందని మంత్రి తెలిపారు.
వ్యోమగాముల సంసిద్ధతకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతూ.. గగన్‌యాన్ మిషన్‌కు వ్యోమగాముల భద్రతే కీలక ప్రాధాన్యతగా ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. అన్ని వ్యవస్థలు కఠినమైన పరీక్షలు- నిపుణుల సమీక్షలకు లోనవుతాయని, ప్రతి అర్హత పరీక్ష నుంచి నేర్చుకున్న విషయాలు జాగ్రత్తతో కూడిన విశ్లేషణకు గురవుతాయని తెలిపారు. ఆయా అంశాలను వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించిన ఆయన.. దీని తర్వాత కూడా ఆయన వ్యవస్థలు మళ్లీ ధ్రువీకరణకు వెళ్తాయని చెప్పారు. గగన్‌యాన్ వ్యోమగాముల సమగ్ర సంసిద్ధతను నిర్ధారించేందుకు వ్యోమగామి శిక్షణలో అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమగ్ర సిమ్యూలేషన్లు, అసాధారణ ల్యాండింగ్‌ల విషయంలో మనుగడ విధానాలు, అత్యవసర మనుగడ కిట్‌లను ఉపయోగించే పద్దతి, మానసికంగా నిరంతర సహాయం వంటివి ఉన్నాయని తెలిపారు.
ఇప్పటికే ఉన్న ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఒక పటిష్ఠమైన రిస్క్-అసెస్‌మెంట్, నివారణ ఫ్రేమ్‌వర్క్‌ను ఇస్రో వ్యవస్థీకృతం చేసిందని మంత్రి సభకు తెలియజేశారు. మానవ రేటింగ్ సర్టిఫికేషన్ బోర్డ్, జాతీయ సలహా ప్యానల్ వంటి సంస్థలు.. ఆమోదయోగ్యమైన పరిమితుల్లోనే మొత్తం మిషన్ రిస్క్ ఉండేలా చూసుకోవడానికి ఈ ప్రక్రియలను పర్యవేక్షిస్తాయి.
ఇటీవల జరిగిన ఐఎంఏటీతో సహా ప్రతీ పరీక్ష.. కీలక వ్యవస్థలను ధ్రువీకరించటమే కాకుండా వ్యోమగాముల శిక్షణ, గ్రౌండ్ రికవరీ సన్నాహాలు, భారతదేశ చారిత్రాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించిన మిషన్ సురక్షిత అమలును మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.
***
(रिलीज़ आईडी: 2198487)
आगंतुक पटल : 6