ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
క్షయ రహిత భారత్ ప్రచార కార్యక్రమం (టీబీ ముక్త్ భారత్ అభియాన్) కింద సాధించిన పురోగతిపై పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జె.పి.నడ్డా
ఈ ప్రచార కార్యక్రమానికి పర్యవేక్షణ, అవగాహన కల్పన, సమాజ భాగస్వామ్యంలో మద్దతు ఇవ్వాలని పార్లమెంట్ సభ్యులను కోరిన శ్రీ నడ్డా
భారత్ లో 2015లో ప్రతి లక్ష జనాభాకు 237 నుంచి 2024 లో 187కి (21% ) తగ్గిన క్షయ వ్యాప్తి; ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన తగ్గుదల వేగం కంటే దాదాపు రెట్టింపు ఎక్కువ: శ్రీ జె.పి.నడ్డా
ఉత్తరప్రదేశ్ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న 60 మంది పార్లమెంట్ సభ్యులు: తమ నియోజకవర్గాలలో ప్రచార ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని, సమాజ సమీకరణ కార్యక్రమాలను ముందుకు తీసుకువెడతామని ప్రతిజ్ఞ చేసిన ఎంపీలు
प्रविष्टि तिथि:
02 DEC 2025 10:13PM by PIB Hyderabad
క్షయ రహిత భారత్ ప్రచార కార్యక్రమం (టీబీ ముక్త్ భారత్ అభియాన్) పురోగతిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు ఢిల్లీలోని ఎక్స్‌టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్ (ఈపీహెచ్ఏ) ఆడిటోరియంలో వివిధ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులకు అవగాహన కల్పించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్, వాణిజ్యం, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద, విదేశీ వ్యవహారాలు, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పార్లమెంట్ సభ్యులతో సమావేశాల వరసలో మొదటిదైన నేటి కార్యక్రమంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. తమ నియోజకవర్గాలలో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి, సమాజ సమీకరణ ప్రయత్నాలను పెంపొందించడానికి వారు తమ నిబద్ధతను తెలియజేశారు. ఈ ప్రచార లక్ష్యాలు, ప్రస్తుతం అమలు జరుగుతున్న ముఖ్య కార్యకలాపాలు, ఈ ప్రచార కార్యక్రమానికి మద్దతు ఇవ్వడంలో వారి పాత్ర గురించి ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.
సమావేశంలో ప్రసంగించిన శ్రీ నడ్డా, టీబీ నిర్మూలన లక్ష్యాన్ని సాధించడంలో పార్లమెంట్ సభ్యుల నాయకత్వ పాత్రను వివరించారు. వారివారి నియోజకవర్గాలలో టీబీ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, ఈ వ్యాధిపై అవగాహన పెంచాలని, అపోహలు తొలగించాలని ఎంపీలను కోరారు. ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొనేలా ప్రజలను సమీకరించాలని సూచించారు.

భారత్ లో టీబీ వ్యాప్తి (ప్రతి సంవత్సరం కొత్తగా నమోదయ్యే కేసులు) తగ్గుదల రేటును శ్రీ నడ్డా ప్రముఖంగా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ టీబీ నివేదిక 2025 ప్రకారం 2015లో ప్రతి లక్ష జనాభాకు 237 కొత్త కేసులు ఉండగా, 2024 నాటికి ఇది ప్రతి లక్ష జనాభాకు 187 కేసులకు (21%) తగ్గిందని వివరించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదైన తగ్గుదల రేటు 12% కంటే దాదాపు రెట్టింపు కావడం గమనార్హ మని పేర్కొన్నారు. అలాగే భారతదేశంలో టీబీ మరణాల రేటు కూడా 2015లో ప్రతి లక్ష జనాభాకు 28 మరణాలు ఉండగా, 2024 నాటికి ఇది ప్రతి లక్ష జనాభాకు 21 మరణాలకు తగ్గిందని, ఇది టీబీ కారణంగా సంభవించే మరణాల తగ్గుదలలో ముఖ్యమైన పురోగతిని సూచిస్తుందని శ్రీ నడ్డా తెలిపారు.
గత పది సంవత్సరాల్లో అమలు చేసిన అనేక కొత్త కార్యక్రమాల గురించి శ్రీ నడ్డా ఎంపీలకు తెలియజేశారు. వీటిలో చేత్తో పట్టుకునే ఏఐ ఆధారిత ఛాతీ ఎక్స్-రే యంత్రాలు, ట్రూనాట్ యంత్రాలు వంటి కొత్త సాంకేతికతలను వేగంగా స్వీకరించడం, మరింత ప్రభావవంతమైన తక్కువ వ్యవధి చికిత్స పద్ధతుల అమలు, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరాల నెట్‌వర్క్ ద్వారా క్షయరోగ సేవలను వికేంద్రీకరణ చేయడం, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలు ఉన్నాయి. క్షయ నిర్మూలన ప్రయత్నాలు విజయవంతం కావాలంటే, క్షేత్ర స్థాయిలో టీబీ స్క్రీనింగ్ సేవలను మరింతగా విస్తరించడం, అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని శ్రీ నడ్డా పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ద్వారా, టీబీ నిర్మూలనను ప్రజా/సామూహిక ఉద్యమంగా మార్చాలని ఆయన ఎంపీలను కోరారు.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ మాట్లాడుతూ, దేశంలో టీబీ భారాన్ని తగ్గించడంలో ఈ ప్రచారం ప్రాముఖ్యతను వివరించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న టిబి నిర్మూలన ప్రచారం పై సమగ్ర అవలోకనాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2198116)
आगंतुक पटल : 15