రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

శాంతి, సద్భావన అనే మాటలను అర్థం చేసుకోని వారికి భారత్ సరైన జవాబు ఇస్తుంది.. దీనికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్‌: రక్షణ మంత్రి


‘‘భారత్ శాంతిని ప్రేమించే దేశం, అయితే.. దుర్బుద్ధిని ప్రదర్శించే వారిని వదలిపెట్టదు’’

‘‘మేం 2029 కల్లా రూ.3 లక్షల కోట్ల రక్షణ ఉత్పాదనలనూ, రూ.50,000 కోట్ల రక్షణ ఎగుమతులనూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’

సర్దార్ పటేల్ కన్న ‘ఒకే భారత్, అత్యుత్తమ భారత్’ కల
ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో మరింత బలాన్ని పుంజుకుంది: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

‘‘ఒక పెద్ద ఆర్థిక, వ్యూహాత్మక శక్తిగా మారే దిశగా భారత్ దూసుకుపోతోంది’’

‘‘ప్రభుత్వం భారత్‌ను సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక ఏకతాబంధంతో పెనవేస్తోంది’’

प्रविष्टि तिथि: 02 DEC 2025 2:09PM by PIB Hyderabad
‘‘శాంతి, సద్భావన అనే మాటలను అర్థం చేసుకోని వారికి భారత్ సరైన జవాబు చెబుతుందనడానికి ఆపరేషన్ సిందూర్‌యే నిదర్శనమ’’ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపడుతున్న చర్యలను సర్దార్ వల్లభాయ్ పటేల్ కనబరిచిన బలమైన ఇచ్ఛాశక్తి, నాయకత్వాలతో మంత్రి పోల్చారు. సర్దార్ పటేల్ సమస్యలను చర్చ ద్వారా పరిష్కరించడానికే ఎల్లవేళలా ప్రయత్నాలు చేశారు.. అయితే అవరమైనప్పుడు సాహసోపేతమైన దారిని కూడా ఎంచుకోవడానికి ఆయన ఎన్నడూ వెనుకాడలేదు.. ఉదాహరణకు భారత్‌తో హైదరాబాద్ విలీనాన్నే తీసుకోవచ్చు అని మంత్రి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని స్మరించుకోవడానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ (ఎంవై) భారత్ ఏర్పాటు చేసిన ‘యూనిటీ మార్చ్’లో భాగంగా గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి ప్రసంగించారు.

 
image.png

ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసినందుకు సాయుధ దళాల సాహసాన్నీ, అంకిత భావాన్నీ రక్షణ మంత్రి ప్రశంసించారు. భారతీయ సైనికుల శౌర్యాన్నీ, సామర్ధ్యాల్నీ ప్రపంచం ప్రస్తుతం అంగీకరిస్తోందని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్ ‘‘మనం శాంతిని ప్రేమించే దేశమనీ, ఏ దేశాన్నీ ఎన్నడూ కవ్వించబోమనీ, అయితే రెచ్చగొట్టితే మాత్రం మనకేసి దుర్బుద్ధితో చూసే వాళ్లని వదలిపెట్టే ప్రసక్తే లేద’’న్న స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.
దేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ పటేల్ ఒక ముఖ్య పాత్రను పోషించారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వర్ణించారు. సర్దార్ పటేల్ కన్న ‘ఒకే భారత్, అత్యుత్తమ భారత్’ కల.. ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో మరింత బలాన్ని పుంజుకుందని రక్షణ మంత్రి అన్నారు. 370వ అధికరణం రద్దు సంగతిని ఆయన ప్రస్తావిస్తూ, ఈ నిర్ణయం దేశ ప్రధాన స్రవంతిలో జమ్మూ, కాశ్మీర్‌ కలిసేటట్లుగా చేసిందని తెలిపారు.
సర్దార్ పటేల్ చూపిన మార్గాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. దీని ఫలితంగా ఒకప్పుడు సందేహాలు చుట్టుముట్టి ఉండే భారత్, ప్రస్తుతం ప్రపంచ దేశాలతో తన సొంత షరతులపై సంభాషిస్తోందని ఆయన అన్నారు. ఇదివరకటిలా కాకుండా, ప్రస్తుతం అంతర్జాతీయ వేదికల్లో భారత్ చెబుతున్న దానిని ప్రపంచం వింటోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ‘‘ఒక ప్రధాన ఆర్థిక, వ్యూహాత్మక శక్తిగా మారే దిశగా భారత్ పయనిస్తోంది. సర్దార్ పటేల్ అందించిన అపార సేవే దీనికి కారణం’’ అని కూడా ఆయన అన్నారు.
ప్రభుత్వం అధికారాన్ని స్వీకరించిన నాటి నుంచీ దేశ ప్రయోజనాలను కాపాడటానికి తిరుగులేని సంకల్పంతో ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 2014కు ముందు ప్రపంచంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉందనీ, మరి ఇవాళ 4వ స్థానానికి చేరుకుందనీ, త్వరలో అగ్రగామి 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబడడానికి సన్నద్ధం అవుతోందనీ ఆయన వివరించారు. ప్రభుత్వం రాజకీయ, భౌగోళిక ఏకతా మార్గంలో సర్దార్ పటేల్ ఊహించిన స్వతంత్ర దేశ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతూనే ‘తక్కువ మంది మంత్రులతో, సాధ్యమైనంత విస్తృత స్థాయి పాలనను అందించే’ లక్ష్యంతో పనిచేస్తోందని కూడా ఆయన అన్నారు.
రక్షణ రంగాన్ని ఆధునికీకరిస్తూ ఉండాలనీ ఆయుధాలనీ, యుద్ధ సామగ్రినీ దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలనీ సర్దార్ పటేల్ స్పష్టం చేశారనీ, దేశ భద్రత విషయంలో ఆయన దార్శనికతను ప్రభుత్వం ముందుకు తీసుకు పోతోందనీ రక్షణ మంత్రి చెప్పారు. ‘‘ప్రస్తుతం, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని అమలుచేస్తున్న కారణంగా, మనం రక్షణ రంగ ఉత్పాదనలో స్వయంసమృద్ధిని సాధించుకొంటున్నాం. సైనిక పరికరాలను మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మన రక్షణ ఎగుమతులు గత 11 ఏళ్లలో 34 రెట్లు పెరిగాయి. 2029 కల్లా రూ.3 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పాదనతో పాటు రూ.50,000 కోట్ల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలన్నదే మన లక్ష్యం’’ అని ఆయన వెల్లడించారు.
సర్దార్ పటేల్ జీవితం పవిత్రతకీ, నిజాయతీకీ సంకేతంగా నిలిచిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉన్నత ఆదర్శాల నుంచి ప్రభుత్వం స్ఫూర్తిని పొంది రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025కు పార్లమెంటు ఆమోదాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకుందనీ, దీనికి గాను అత్యున్నత పదవుల్లో ఉండే వారు అవినీతికి వ్యతిరేకంగా నైతిక నిష్ఠతో నడుచుకోవలసి ఉంటుందన్నారు. ‘‘దీనికి అర్థం.. పదవిలో ఉన్న ఏ వ్యక్తిని అయినా ఏదయినా తీవ్ర అభియోగంతో అరెస్టు చేసి 30 రోజుల లోపల జామీనును మంజూరు చేయకపోయిట్లయితే, ఆ వ్యక్తి తన పదవి నుంచి స్వతస్సిద్ధంగా వదులుకోవాల్సివస్తుంది..’’ అని ఆయన అన్నారు.

 

image.png
 

దేశ ఏకతనీ, అఖండతనీ, సార్వభౌమత్వాన్నీ పరిరక్షించే బాధ్యతను సర్దార్ పటేల్ భావి తరాల వారికి అప్పగించారని రక్షణ మంత్రి చెబుతూ, అభివృద్ధి చెందిన భారతదేశం కలను పండించుకోవడానికి పాటుపడాల్సిందిగా యువతకు విజ్ఞప్తి చేశారు. ‘‘దేశాన్నీ, సమాజాన్నీ ఒక్కటిగా ఉంచడం మన బాధ్యతే. మనం సర్దార్ పటేల్ బోధించిన విలువలను పూర్తి అంకితభావంతో, పవిత్రతతో అలవరచుకోవడం ఒక్కటే కాకుండా, ఈ విషయంలో భావి తరాల వారిని కూడా సంసిద్ధులను చేస్తామని తప్పక ప్రతిజ్ఞ చేయాలి. ఇది సర్దార్ పటేల్ వారసత్వానికి సిసలైన నివాళి కాగలదు’’ అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పంజాబ్ గవర్నరు శ్రీ గులాబ్ చంద్ కటారియా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ, కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్య వ్యవస్థల శాఖతో పాటు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
 
***

(रिलीज़ आईडी: 2197697) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali