రైల్వే మంత్రిత్వ శాఖ
మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఛాంపియన్లు ప్రతీకా రావల్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్‌లకు ఓఎస్‌డీ (క్రీడలు)గా పదోన్నతి కల్పించిన భారతీయ రైల్వే
ఆర్థిక భద్రత పొందడంతో పాటు పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించనున్న ముగ్గురు మహిళా క్రికెటర్లు
प्रविष्टि तिथि:
01 DEC 2025 8:51PM by PIB Hyderabad
2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టు సభ్యులైన ప్రతీకా రావల్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్‌లకు భారతీయ రైల్వే పదోన్నతి కల్పించింది. ఐసీసీ ప్రపంచ కప్‌లో అసాధారణ ప్రతిభకు గానూ ఈ ముగ్గురు మహిళా క్రికెటర్లను అవుట్-ఆఫ్-టర్న్ పదోన్నతి ద్వారా గ్రూప్ 'బి' ఆఫీసర్-గ్రేడ్ పోస్టులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (క్రీడలు)గా నియమించింది.
ఈ ముగ్గురు క్రీడాకారిణులు 7వ సీపీసీ ప్రకారం పే మ్యాట్రిక్స్ లెవల్-8 కింద గ్రూప్ 'బి' గెజిటెడ్ అధికారి పొందే వేతనం, ప్రయోజనాలకు అర్హులు అవుతారు. రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఈ నిర్ణయం ద్వారా ఈ ముగ్గురు మహిళా క్రికెటర్లకు ఆర్థిక భద్రతను కల్పించడంతో పాటు వారికి పరిపాలనా బాధ్యతలను కూడా అప్పగించింది.
రైల్ భవన్‌లో నవంబరు ప్రారంభంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ ముగ్గురు అథ్లెట్లను సత్కరించారు.
నార్తర్న్ రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్న ప్రతీకా రావల్ ఇప్పుడు గ్రూప్ 'బి' గెజిటెడ్ పోస్టు ఓఎస్‌డీ (క్రీడలు)గా పదోన్నతి పొందారు. ఢిల్లీకి చెందిన ఓపెనింగ్ బ్యాటర్ అయిన రావల్... భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
నార్తర్న్ రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్న రేణుకా సింగ్ ఠాకూర్ ఇప్పుడు గ్రూప్ 'బి' గెజిటెడ్ పోస్టు ఓఎస్‌డీ (క్రీడలు)గా పదోన్నతి పొందారు. కుడిచేతి వాటం మీడియం-ఫాస్ట్ బౌలర్ అయిన ఠాకూర్... కీలక మ్యాచ్‌లలో అద్భుతమైన స్పెల్‌లతో స్థిరంగా రాణించి మ్యాచ్ విన్నర్‌గా నిలిచారు.
నార్తర్న్ రైల్వేలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌గా పనిచేస్తున్న స్నేహ్ రాణా ఇప్పుడు గ్రూప్ 'బి' గెజిటెడ్ పోస్టు ఓఎస్‌డీ (క్రీడలు)గా పదోన్నతి పొందారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ ఆల్ రౌండర్ ప్రపంచ కప్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శనతో రాణించారు.
క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం, మద్దతునివ్వడంలో సుదీర్ఘ సంప్రదాయాన్ని భారతీయ రైల్వే కొనసాగిస్తోంది. రైల్వే క్రీడాకారులు ప్రపంచ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు.
***
(रिलीज़ आईडी: 2197363)
आगंतुक पटल : 8