|
గనుల మంత్రిత్వ శాఖ
ఐఐటీఎఫ్-2025లో గనుల మంత్రిత్వ శాఖకు రజత పురస్కారం
లక్ష మందికి పైగా సందర్శకులను ఆకర్షించిన భారత ఖనిజ సంపద.. ఆవిష్కరణ-సాంకేతిక నైపుణ్య ప్రదర్శన
प्रविष्टि तिथि:
27 NOV 2025 7:18PM by PIB Hyderabad
భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025 (ఐఐటీఎఫ్)లో కేంద్ర గనుల మంత్రిత్వశాఖ రజత పురస్కారం (ద్వితీయ బహుమతి) అందుకుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు-ప్రభుత్వ విభాగాల పెవిలియన్ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శనకుగాను ఈ గుర్తింపు దక్కింది. ‘ఐఐటీఎఫ్’ అధికారులు ఈ పురస్కారాన్ని మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఫరీడా ఎం.నాయక్, ఇతర సీనియర్ అధికారులకు అందజేశారు. ‘ఐఐటీఎఫ్-2025’ ఇతివృత్తం ‘ఒకే భారత్ - శ్రేష్ఠ భారత్’కు అనుగుణంగా భారత ఖనిజ సంపద, సాంకేతిక ఆవిష్కరణలు, సమాజ సాధికారత, స్థిరత్వ కార్యక్రమాలను ఆకట్టుకునే రీతిలో వివరిస్తూ మంత్రిత్వశాఖ తన పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. వికసిత భారత్- 2047 స్వప్న సాకారం దిశగా ప్రస్థానాన్ని ప్రతిబింబించే ఈ ప్రదర్శన లక్ష మందికిపైగా సందర్శకులను ఆకర్షించింది.
భారత పారిశ్రామిక, వ్యూహాత్మక సామర్థ్యాలను గనుల శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈ) ఆకర్షణీయ రీతిలో ప్రదర్శించాయి. ఇందులో భాగంగా అల్యూమినియం ఉత్పత్తిలో తన అగ్రస్థానాన్ని చాటుకుంటూ కాలుష్యరహిత ఇంధనం, రవాణా సహా వ్యూహాత్మక రంగాల్లో తన అనువర్తనాలను ‘నాల్కో’ ప్రదర్శించింది. అలాగే హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) రాగి ఉత్పత్తులతోపాటు విద్యుత్, నిర్మాణ, రైల్వే, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాగి ప్రాధాన్యాన్ని ప్రస్ఫుటంగా చాటింది. ముఖ్యంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం సందర్భంగా తన సాంస్కృతిక భాగస్వామ్యాన్ని వివరించింది. ఈ మేరకు రాళ్ల జోడింపు, నిర్మాణ బలోపేతం కోసం సుమారు 70,000 స్వచ్ఛమైన రాగి ఫలకాలు, దిమ్మెలను సరఫరా చేసింది. ఇక దేశంలో ఖనిజ వనరుల గుర్తింపు, అన్వేషణ, మ్యాపింగ్ తదితరాలకు అవసరమైన అధునాతన సాంకేతికతలు, కీలక నమూనాలు, ఉపకరణాలను ‘ఎంఈసీఎల్’ ప్రదర్శించింది.
భారత భూవిజ్ఞాన అధ్యయన సంస్థ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-జీఎస్‌ఐ) ఏర్పాటు చేసిన సమగ్ర భౌగోళిక గ్యాలరీ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో- రాక్షస బల్లులు, వృక్షాలు, గుడ్ల శిలాజాలతోపాటు కింబర్‌లైట్ నమూనాలు, ఆఫ్‌షోర్ సముద్ర నాడ్యూల్స్, లైమ్ మడ్, నిర్మాణ ఇసుక, అద్భుత జియోడ్‌లు, అమెథిస్ట్ స్ఫటికాలు వంటివాటిని ప్రదర్శించింది. అలాగే అధునాతన సాంకేతికతల కోసం సేకరించిన విస్తృత కీలక ఖనిజ సంపదతోపాటు భారతీయ సహజ వారసత్వం, దాని వ్యూహాత్మక ఖనిజ సామర్థ్యాన్ని సన్నిహితంగా చూసే అవకాశం కూడా సందర్శకులకు దక్కింది.
వ్యర్థాల పునరుపయోగం ద్వారా సుస్థిరత ఎలా సాధ్యమో వివరిస్తూ ‘జేఎన్‌ఏఆర్‌డీడీసీ’ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇందులో ఈ-వ్యర్థంతో సృజనాత్మకంగా రూపొందించిన మనిషి, ఏనుగు బొమ్మలతోపాటు ఇనుప తుక్కుతో ఆకర్షణీయంగా తయారుచేసిన గ్లోబ్ వంటి వస్తువులున్నాయి. అలాగే సందర్శకులలో పర్యావరణ స్పృహను పెంచే రీతిలో ‘రివర్స్ వెండింగ్ మిషన్’ (ఆర్‌వీఎం) ద్వారా, ప్లాస్టిక్ బాటిల్ క్రషర్ యంత్రాల ద్వారా 400 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించింది. మరోవైపు రాతి నమూనాలను పరీక్షించే తన సామర్థ్యాన్ని ‘ఎన్‌ఐఆర్‌ఎం’ ప్రదర్శించింది. ఈ మేరకు అయోధ్యలో బాల రాముని విగ్రహం, రామాలయ నిర్మాణంలో వాడిన పాలరాతి నాణ్యత ధ్రువీకరణలో తన పాత్రను ప్రముఖంగా వివరించింది. అంతేకాకుండా జాతీయ వారసత్వం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో శాస్త్రీయ ధ్రువీకరణ ప్రాధాన్యాన్ని సందర్శకుల కళ్లకు కట్టేలా ప్రదర్శించింది.
సామాజిక సాధికారత సాధన ఈ పెవిలియన్‌లో కీలకాంశంగా నిలిచింది. ఈ మేరకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) చేయూతతో వివిధ రాష్ట్రాల స్వయం సహాయ సంఘాల సభ్యుల హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించింది. వీటిలో వెదురుతో తయారుచేసిన కళాకృతులు, ఇతర వస్తువులు, ప్రాంతీయ ప్రత్యేక ఉత్పత్తులు సందర్శకులను అలరించాయి. మొత్తం ₹20 లక్షలకుపైగా వస్తు విక్రయం ఈ ప్రదర్శన ప్రత్యేకత కాగా- గనుల తవ్వకం ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి ప్రజల సాధికారత, గ్రామీణ వ్యవస్థాపన, సుస్థిర జీవనోపాధిని ఇది ప్రతిబింబించింది.
గనుల శాఖ పెవిలియన్‌లో ప్రైవేట్ రంగ అగ్రశ్రేణి పరిశ్రమలు తమ ప్రత్యేకతను ఘనంగా చాటుకున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద సమీకృత జింక్ ఉత్పత్తిదారు, తొలి 5 వెండి ఉత్పత్తి సంస్థల జాబితాలోగల హిందుస్తాన్ జింక్ లిమిటెడ్- ఇంటరాక్టివ్, భవిష్యత్ సంసిద్ధ అంశాలతో స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారత కీలక ఖనిజ సామర్థ్యాల బలోపేతంలో తన పాత్రను, ప్రపంచ ఇంధన మార్పిడి కేంద్రకమైన బహుళ లోహ సంస్థగా తన పరిణామాన్ని కూడా ప్రస్ఫుటం చేసింది. టంగ్‌స్టన్, పొటాష్, హాలైట్, కాడ్మియం, జెర్మేనియం వంటి కీలక ఖనిజాలు సహా రక్షణ, కాలుష్యరహిత ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, తయారీ వంటి రంగాల్లో వాడే అరుదైన మూలకాల ప్రాధాన్యాన్ని తెలిపే ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత అనుభవాలతో వికసిత భారత్‌కు సారథ్యం వహించగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. వెండి, ఎస్‌హెచ్‌జి జింక్ సహా ఆసియాలోనే తొలి స్వల్ప కర్బన ఈకోజెన్ వంటి ఉత్పత్తులతోపాటు ఖనిజాల నమూనాలను సందర్శకులు ఆసక్తిగా పరిశీలించారు. అలాగే ‘హెచ్‌జడ్‌ఎల్’ ప్రపంచ స్థాయి మైనింగ్, స్మెల్టింగ్ కార్యకలాపాల వీడియోల ద్వారా గనుల తవ్వకం, ఖనిజాల వెలికితీత విధానాలను తెలుసుకున్నారు. సంస్థ ఉత్పత్తులకు సమాంతరంగా సామాజిక ప్రభావ విభాగం ద్వారా స్థానిక మహిళల హస్తకళా ఉత్పత్తులను కూడా ప్రదర్శించారు. గ్రామీణ వ్యవస్థాపన, మహిళల సారథ్యంలో సూక్ష్మ సంస్థల పనితీరు, సుస్థిర జీవనోపాధిని ఇవి ప్రతిబింబించాయి.
చంద్రయాన్-3 ప్రయోగం, వందే భారత్ రైళ్లు, ఏరోస్పేస్, అత్యాధునిక ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఉపయోగించే అల్యూమినియంను హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రదర్శించింది. తద్వారా తేలికైన, కచ్చితత్వం గల భావితరం ఉత్పత్తుల రూపకల్పనలో ఇనుమడిస్తున్న తన సాంకేతిక సామర్థ్యాన్ని చాటింది.
ఐఐఎఫ్‌టీ-2025లో సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరత, సాంస్కృతిక వారసత్వం, సామాజిక కర్తవ్య నిబద్ధతను గనుల మంత్రిత్వశాఖ పెవిలియన్ ఒకేచోటకు తెచ్చింది. తద్వారా ప్రజా సంబంధాలు, రంగాలవారీ ప్రదర్శనకు సంబంధించి ఓ కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. సమగ్ర ప్రదర్శన, సార్వజనీన కార్యక్రమాలు, ప్రత్యక్ష వీక్షణానుభవ కల్పన సమ్మేళనంతో ‘ఒకే భారత్ - శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని సోదాహరణంగా చాటింది. అలాగే ‘సీపీఎస్‌ఈ’లు, పరిశోధన సంస్థలు, ప్రైవేట్ రంగ సహకారం, సామాజిక సాధికార సంఘాల ద్వారా గనుల తవ్వకం-నిర్వహణ వ్యవస్థ దేశాన్ని స్వావలంబన, భవిష్యత్ సంసిద్ధ భారత్‌వైపు నడిపిస్తున్న తీరును మంత్రిత్వశాఖ ప్రదర్శించింది.
***
(रिलीज़ आईडी: 2196725)
|