శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
క్వాంటం సెన్సింగులో ఐఐటీ బాంబే పురోగతిని ప్రశంసించిన డాక్టర్ జితేంద్ర సింగ్.. భారత మొదటి ద్రవ హీలియం క్రయోజనిక్ సదుపాయం ప్రారంభం
ఐఐటీ బాంబేలో మంత్రి పర్యటన సందర్భంగా మొదటి దేశీయ క్వాంటం మ్యాగ్నెటోమీటర్, డైమండ్ మైక్రోస్కోప్ ప్రదర్శన
ఐఐటీ బాంబేలో కొత్త ద్రవ హీలియం సదుపాయాన్ని ప్రారంభించిన మంత్రి.. దేశ క్రయోజనిక్, క్వాంటం పరిశోధన సామర్థ్యానికి ఊతం
క్వాంటం నిర్ధారణ పద్ధతులు, ఆధునిక ఇమేజింగ్ టెక్నాలజీలు, కృత్రిమ మేధతో అనుసంధానమైన సెన్సార్లు... బలమైన భారత డీప్‌టెక్ శక్తికి నిదర్శనాలు
తక్కువ వ్యయం, అధిక సామర్థ్యం గల ద్రవ హీలియం సదుపాయాన్ని ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్... దేశ క్వాంటం, క్రయోజనిక్ సామర్థ్యాలకు ఊతం
మొదట్లోనే క్యాన్సర్ నిర్ధారణ, అత్యాధునిక బయోమెడికల్ ఆవిష్కరణల దిశగా.. ఐఐటీ బాంబేలో రూపొందించిన క్వాంటం మైక్రోస్కోపు ప్రధాన ముందడుగు
ఐఐటీ బాంబేలో కీలకమైన క్వాంటం, క్రయోజనిక్ మౌలిక వసతుల ప్రారంభం నేపథ్యంలో.. అగ్రశ్రేణి సాంకేతికతలను అందిపుచ్చుకునే దిశగా భారత నిబద్ధతను పునరుద్ఘాటించిన మంత్రి
प्रविष्टि तिथि:
24 NOV 2025 7:46PM by PIB Hyderabad
అగ్రశ్రేణి సాంకేతికతల్లో పురోగమించేందుకు భారత్ నిబద్ధతతో ఉందని కేంద్ర విజ్ఞానశాస్త్ర- సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖ (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయ, అణు ఇంధన, అంతరిక్ష, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. ఐఐటీ బాంబేలో ఈ రోజు క్వాంటం పరిశోధన ప్రయోగశాలలను సందర్శించిన ఆయన.. సంస్థలో కొత్త ద్రవ హీలియం సదుపాయాన్ని ప్రారంభించారు. క్వాంటం సైన్స్, క్రయోజనిక్స్, అధునాతన పదార్థాలు, తదుపరి తరం కంప్యూటింగ్ రంగాల్లో భారత్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇదో కీలక మైలురాయి.
క్వాంటం ప్రయోగశాలలో సందర్శన సందర్భంగా దేశీయ క్వాంటం సెన్సింగ్, ఇమేజింగ్ ప్లాట్‌ఫాం తొలి సిరీస్‌ను మంత్రి సమీక్షించారు. దేశ పరిశోధన - అభివృద్ధి సామర్థ్యాల్లో ఇది భారీ ముందడుగు. నానోటెస్లా స్థాయిలో అతిచిన్న అయస్కాంత క్షేత్రాలను గుర్తించగల సామర్థ్యమున్న, దేశంలో మొదటి పోర్టబుల్ మాగ్నెటోమీటర్ అయిన క్యూమాగ్‌పై గురించి ఆయనకు వివరించారు. వజ్రంలో అణువుల స్థాయిలో ఖాళీగా ఉన్న నత్రజని లోప కేంద్రాలను (ఎన్‌వీ సెంటర్లు) ఉపయోగించి రూపొందించిన ఈ పరికరం.. వ్యూహాత్మక రంగాలు, ఖనిజాల అన్వేషణ, శాస్త్రీయ పరికరాల కోసం అత్యంత కచ్చితమైన మాగ్నెటిక్ సెన్సింగుకు వీలు కల్పిస్తుంది. చిన్నగా, సులభంగా విస్తరించగల సామర్థ్యమున్న వ్యవస్థను సృష్టించడంలో బృందం సాధించిన విజయాన్ని మంత్రి అభినందించారు. దీంతో ఈ సామర్థ్యమున్న అతికొన్ని దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఈ విజయానికి సహకరించిందని, డీప్ సైన్స్ను రియల్ టైమ్ అప్లికేషన్లుగా మార్చేలా వీలు కల్పించిందని ఆయన పేర్కొన్నారు.
ఐఐటీ బాంబేకు చెందిన పీక్వెస్ట్ గ్రూప్ రూపొందించిన మొదటి దేశీయ క్వాంటం డైమండ్ మైక్రోస్కోపు (క్యూడీఎం)ను కూడా మంత్రి పరిశీలించారు. వజ్రంలోని ఎన్‌వీ కేంద్రాలనుపయోగించి పనిచేసే క్యూడీఎం పరికరం... చాలా సూక్ష్మ స్థాయిలో మూడు దిశలలో అయస్కాంత క్షేత్ర చిత్రాలను తీసేందుకు వీలు కల్పిస్తుంది. న్యూరోసైన్స్, పదార్థ పరిశోధన, సెమీకండక్టర్ పరీక్షల విస్తృతస్థాయి మ్యాపింగులో ఇది విప్లవాత్మక మార్పులను తేబోతోంది. కృత్రిమ మేధ/ మెషీన్ లెర్నింగ్ వ్యవస్థలతో అనుసంధానమైన ఈ సాంకేతికత.. భవిష్యత్తులో సాంకేతికతలో భారత్‌ను అగ్రగామిగా నిలపడంలో కీలకంగా ఉన్న ఎలక్ట్రానిక్స్, బయాలజీ, జియాలజీ, తదుపరి తరం చిప్ టెస్టింగుల్లో భారీ పురోగతిని తెస్తుంది.
ఆరోగ్య రక్షణ సాంకేతికతల్లో క్వాంటం టెక్నాలజీల పాత్ర పెరుగుతుండడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. నానోడైమండ్లలోని నత్రజని లోప కేంద్రాల క్వాంటం లక్షణాలను వినియోగించుకోవడం కోసం దేశీయంగా తయారు చేసిన కేంద్రీకృత (కాన్పోకల్) మైక్రోస్కోప్ అయిన క్యూ- కాన్ఫోకల్ వ్యవస్థను మంత్రి పరిశీలించారు. టీ₁ రిలాక్సోమెట్రీని ఉపయోగించి.. క్యాన్సర్ తొలి దశ నిర్ధారణ కోసం ముఖ్యమైన రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల స్థాయిలు సహా.. కణాల లోపలి మార్పులను కూడా సునిశితంగా గుర్తించగలదు. యూ87-ఎంజీ గ్లియోబ్లాస్టోమా, కెరాటినోసైట్ కణాలపై విజయవంతంగా చేసిన ప్రయోగాలు.. సూక్ష్మస్థాయిలో వ్యాధి సంబంధిత మార్పులను అంచనా వేయడంలో ఈ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని చూపుతున్నాయి. ఆవిష్కరణ బృందాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఈ క్వాంటం ఆధారిత బయోమెడికల్ పరికరాలు.. భారత్‌లో ఆరోగ్య విజ్ఞాన శాస్త్రాలు, అత్యున్నత సాంకేతికతల సమ్మేళనాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ప్రయోగశాలను సందర్శించిన అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్ ద్రవ హీలియం సౌకర్యాన్ని ప్రారంభించారు. క్రయోజెనిక్ ఇంజినీరింగ్, సూపర్ కండక్టివిటీ, క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం సెన్సింగ్, ఫొటోనిక్స్, ఆరోగ్య రక్షణ సాంకేతికతలు, పర్యావరణ హిత ఇంధన పరికరాల్లో దేశ సామర్థ్యాలను గణనీయంగా పెంచే ప్రధానమైన జాతీయ పరిశోధన ఆస్తిగా దీనిని అభివర్ణించారు. ఎంఆర్ఐ వ్యవస్థలు, అధునాతన పదార్థ వర్గీకరణ, క్రయోజెనిక్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ (క్రయో-ఈఎం)లకు ద్రవ హీలియం ఎంతో అవసరమని పేర్కొంటూ.. ఈ కొత్త సౌకర్యాన్ని ఇప్పుడు దేశానికి అంకితం చేశామనీ.. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు దీనిని ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సమర్థమైన హీలియం రీకవరీ వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఇది క్రయోజనిక్ ప్రయోగాల ఖర్చును ప్రస్తుత ఖర్చులో దాదాపు పదో వంతుకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచంలో అత్యంత అరుదైన వనరుల్లో ఒకటైన హీలియంను కూడా ఇది సంరక్షిస్తుంది.
క్వాంటం కంప్యూటర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్ కూడా క్రయోజనిక్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటర్లు ముఖ్యంగా 10 మిల్లీ కెల్విన్ (దాదాపు మైనస్ 272 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ) వంటి అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో పనిచేసే డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లపై ఆధారపడతాయని ఆయన వివరించారు. ఈ వ్యవస్థలు అధునాతన శీతలీకరణ (క్రయోజనిక్) సాయంపై ఆధారపడతాయి కాబట్టి.. ద్రవ హీలియం సదుపాయాన్ని ప్రారంభించడమన్నది భవిష్యత్తులో దేశీయంగా డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ల రూపకల్పనకు పునాదులు వేస్తుంది. దేశ దీర్ఘకాలిక సాంకేతిక స్వావలంబనకు ఇది వ్యూహాత్మక అవసరం. అంతకుముందు సమీక్షించిన క్వాంటం సాంకేతికతల్లా కాకుండా.. ద్రవ హీలియం సదుపాయానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మద్దతు ఇంకా తగినంతగా లభించలేదని మంత్రి అంగీకరించారు. దేశీయ క్రయోజెనిక్ సామర్థ్యాలను పెంచడం కోసం మరింత జాతీయ సహకారం ఆవశ్యకతను ఇది సూచిస్తుంది.
క్వాంటం ల్యాబ్ పురోగతి, కొత్త క్రయోజెనిక్స్ సదుపాయం రెండూ తదుపరి తరం శాస్త్ర సాంకేతిక రంగంలో భారత నేతృత్వం వేగంగా విస్తరిస్తున్న తీరును ప్రతిబింబిస్తాయని మంత్రి పేర్కొన్నారు. డీప్ టెక్ పరిశోధన, వ్యూహాత్మక ఆవిష్కరణ, దేశీయ అభివృద్ధి... ఇవన్నీ కలిసి భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని ముందుకు నడిపేలా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత భారత దార్శనికతకు అనుగుణంగా ఈ విజయాలు ఉన్నాయని ఆయన అన్నారు. విద్యాసంస్థలు, ప్రభుత్వం, పరిశ్రమలు సంయుక్తంగా... భవిష్యత్ సాంకేతికతలను రూపొందించగల ప్రపంచ స్థాయి శాస్త్రీయ వ్యవస్థను ఎలా నిర్మించవచ్చో ఐఐటీ బాంబే కృషిని బట్టి తెలుస్తోందన్నారు.
ఐఐటీ బాంబే పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థుల మార్గదర్శక సేవలపట్ల మంత్రి అభినందనలు తెలిపారు. క్వాంటం సైన్స్, క్రయోజెనిక్స్, ఆరోగ్య రక్షణలో ఆవిష్కరణలు, జాతీయ సాంకేతిక మిషన్లలో పురోగతి కోసం ప్రభుత్వ ప్రోత్సాహం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 2196723)
आगंतुक पटल : 11