ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిజోరంలో విదేశీ సిగరెట్ల దొంగరవాణా... రూ.14.74 కోట్ల సిగరెట్లను జప్తుచేసిన డీఆర్ఐ...ముగ్గురి అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2025 7:15PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంతంలో విదేశీ సిగరెట్ల దొంగరవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) ‘‘ఆపరేషన్ ఫిల్టర్ అవుట్’’ అనే సంకేత నామంతో మిజోరంలో ఈ నెల 21, 22 తేదీల్లో సమన్వయపూర్వక కార్యకలాపాలను నిర్వహించింది. దీన్లో అస్సాం రైఫిల్స్‌తో పాటు సరిహద్దు భద్రతాదళం కూడా సహాయాన్ని అందించాయి.
ఒకటో కేసులో, ఈ నెల 21న మిజోరంలోని మమిత్ జిల్లా కన్హ్‌మున్‌లో అనుమానాస్పద వాహనాన్ని ఆపారు. ఆ వాహనంలో నుంచి 165 కార్టన్లలో  16 లక్షల యాభై వేల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఓరిస్, విన్, బెన్సన్ అండ్ హెడ్జెస్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు ఉన్నాయి. కన్హ్‌మున్‌లోనే ఒక గోదామును సోదా చేసి 110 కార్టన్ల ఓరిస్, బెన్సన్ అండ్ హెడ్జెస్ బ్లూ గోల్డ్ బ్రాండ్లకు చెందిన 11 లక్షల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. తరువాత  కన్హ్‌మున్‌లోని మరో గోదాము నుంచి 87 కార్టన్ల (8 లక్షల డెబ్భయ్ వేల సిగరెట్ల)ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ప్యారిస్ స్పెషల్ ఫిల్టర్, ఎక్స్ఎస్ఓ బ్లాక్ ఫ్రూట్స్, బెన్సన్ అండ్ హెడ్జెస్ బ్లూ గోల్డ్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 36 లక్షల ఇరవై వేల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్టు చేశారు.
రెండో కేసులో ఈ నెల 22న మిజోరంలోని లుంగ్‌లేయిలో గల చండ్‌మారీ ప్రాంతంలో రెండు గోదాములతో పాటు ఒక నివాస స్థలంలో సోదాలు చేశారు. 375 కార్టన్లను (వీటిలో 37 లక్షల యాభై వేల విదేశీ సిగరెట్లు ఉన్నాయి) స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరెట్లలో ఓరిస్, విన్, వీ, ఫార్ స్టార్, ఎస్సే లైట్, ప్యాట్రన్, మోండ్ అండ్ వేలియంట్ బ్రాండ్లవి ఉన్నాయి. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
ఈ కార్యకలాపాల్లో మొత్తం 73 లక్షల 70 వేల విదేశీ సిగరెట్లను జప్తు చేశారు. మార్కెట్లో వాటి విలువ రూ.14.74 కోట్లు. జప్తు చేసిన సిగరెట్ ప్యాకెట్లపై సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్రకటనల నిషేధంతో పాటు ఉత్పత్తి, వాణిజ్యం, సరఫరా, పంపిణీల నియంత్రణ) చట్టం-2003లో భాగంగా బొమ్మలతో ఆరోగ్య సంబంధ హెచ్చరికలేవీ ప్రచురించలేదన్న సంగతిని గమనించారు.
ఈ విదేశీ సిగరెట్లను భారత్-మయన్మార్ సరిహద్దులోని జోక్‌హాథర్ సెక్టర్ గుండా దొంగతనంగా రవాణా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్వాధీనం చేసుకున్న సిగరెట్లనూ, వాహనాన్నీ కస్టమ్స్ చట్టం-1962లో భాగంగా జప్తు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2194025) సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali