ఉప రాష్ట్రపతి సచివాలయం
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్
శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవకు గొప్ప ప్రతీక శ్రీ సత్యసాయి బాబా: ఉపరాష్ట్రపతి
అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి, ఎల్లప్పుడూ సహాయం చేయి, ఎప్పుడూ బాధించకు...
కోట్లాది మందికి ప్రేరణనిస్తున్న శ్రీ సత్యసాయి బాబా బోధనలు: ఉపరాష్ట్రపతి
జీవితాన్ని కులం, మతం, జాతీయతలకు అతీతంగా మానవాళి అభ్యున్నతికి
అంకితం చేసిన శ్రీ సత్యసాయి బాబా: ఉపరాష్ట్రపతి
చెన్నైకి తాగునీటిని అందించే తెలుగు గంగ కాలువను
పునరుజ్జీవింపజేయడంలో కీలక పాత్ర పోషించిన శ్రీ సత్యసాయి బాబా
నేటి అనిశ్చిత, ఘర్షణలతో కూడిన ప్రపంచంలో శ్రీ సత్యసాయి బాబా బోధనలు మరింత అవసరం: ఉపరాష్ట్రపతి
ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక సంక్షేమంలో పరివర్తనాత్మకమైన
పని చేస్తున్న శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టును అభినందించిన ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
23 NOV 2025 2:22PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో ఈ రోజు శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉపరాష్ట్రపతి.. శ్రీ సత్యసాయి బాబాను శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవ విషయంలో దేవుడి ప్రతినిధిగా అభివర్ణించారు. ఆయనిచ్చిన సందేశం, సాధించిన లక్ష్యాలు.. కులం, మతం, వర్గం, జాతీయత వంటి అన్ని అడ్డంకులను అధిగమించాయని అన్నారు. ‘అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి’, ‘ఎల్లప్పుడూ సహాయం చేయి, ఎప్పుడూ బాధించకు’ అనే ఆయన బోధనలు ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమానికి.. ఆయన ప్రభావితం చేసిన ప్రతి జీవితాన్నీ దిశానిర్దేశం చేశాయని ఉపరాష్ట్రపతి అన్నారు.
ఈ సందర్భంగా కవి తిరువళ్ళువర్ రాసిన తిరుక్కురళ్‌ను ఉటంకించిన శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్.. శ్రీ సత్యసాయి బాబా జీవితం మొత్తాన్నీ మానవాళిని ప్రేమించేందుకు, సేవ చేయడానికి అంకితం చేయడం ద్వారా ఈ శాశ్వతమైన సత్యాన్ని నిరూపించారని పేర్కొన్నారు.
సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసల గురించి చెప్పే బాబా బోధనలను ప్రధానంగా పేర్కొన్న ఉపరాష్ట్రపతి.. సామరస్యపూర్వకమైన, ప్రగతిశీల సమాజాన్ని తయారుచేసేందుకు ఈ శాశ్వత విలువలు అవసరమని అన్నారు.
నేటి ప్రపంచంలో ‘అసమ్మతి బదులు సామరస్యం, స్వార్థం స్థానంలో త్యాగాన్ని నింపాలి’ అని మానవాళిని కోరే బాబా సందేశాన్ని ఉపరాష్ట్రపతి ప్రముఖంగా ప్రస్తావించారు. అనిశ్చితి, సంఘర్షణలతో కూడిన నేటి ప్రపంచంలో ఈ విలువలు సందర్భోచితంగా ఉన్నాయని ఆయన అన్నారు.
శ్రీ సత్యసాయి బాబా చెప్పినట్లుగా ప్రజా జీవితం కూడా సత్యం, ధర్మం, సానుభూతి, నైతిక బాధ్యత వంటి సద్గుణాల ద్వారా మార్గనిర్దేశం కావాలని ఆయన ప్రధానంగా చెప్పారు.
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు గురించి చెబుతూ ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక సంక్షేమంలో చేపట్టిన విస్తృతమైన కార్యక్రమాలను శ్రీ సీ.పీ. రాధాకృష్టన్ ప్రశంసించారు. ట్రస్టు చేపట్టిన మొబైల్ గ్రామీణ ఆరోగ్య సేవలు మారుమూల ప్రాంతాల ప్రజలకు ముఖ్యమైన జీవనాధారంగా ఉన్నాయని కొనియాడారు. ప్రపంచ స్థాయి ప్రమాణాల ప్రకారం విలువలతో కూడిన ఉచిత విద్యను అందిస్తున్న ట్రస్టు విద్యా సంస్థలను ఆయన మెచ్చుకున్నారు.
త్రాగునీటి ప్రాజెక్టులు, విపత్తుల విషయంలో సహాయం, అనేక మానవతా సేవలు ద్వారా ప్రజలను పురోగతి బాట పట్టిస్తూనే ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. చెన్నై నగరానికి తాగునీటి సరఫరాను అందించే తెలుగు గంగ కాలువను పునరుజ్జీవింపజేయడంలో శ్రీ సత్యసాయి బాబా అందించిన కీలక సహకారాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. తమిళనాడు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక సేవా కార్యంగా దీనిని వర్ణించారు. సేవ ద్వారా నెలకొనే ప్రేమ సమాజాన్ని ఏ విధంగా మార్చగలదన్న విషయంలో ఈ కార్యక్రమాలు శాశ్వత ఉదాహరణలుగా నిలుస్తాయని ఆయన అన్నారు.
అవసరమైన వారికి సహాయం అందించడంతో పాటు కుటుంబాలు, సమాజాలు, దేశంలో శాంతిని పెంపొందించడం ద్వారా బాబా వారసత్వాన్ని ఆచరణాత్మకంగా గౌరవించాలని భక్తులు, ప్రజలందిరికీ ఉపరాష్ట్రపతి విన్నవించారు.
సమస్త సాయి సమాజానికి ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘సమస్త లోకాః సుఖినో భవంతు’ అనే శ్రీ సత్యసాయి బాబా సూత్రాన్ని ఆయన ఉటంకించారు. ’ సేవే గొప్ప ఆరాధన, ప్రేమే గొప్ప నైవేద్యం’ అని మనకు తెలియజేసే శ్రీ సత్యసాయి బాబా బోధనలు మానవాళి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రసంగాన్ని ముగించారు.
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనను ఉపరాష్ట్రపతి కూడా తిలకించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్. ఇంద్రసేన రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ- ఎలక్ట్రానిక్స్ - కమ్యూనికేషన్- ఆర్టీజీ మంత్రి శ్రీ నారా లోకేష్, తమిళనాడు మంత్రి - శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ శేఖర్ బాబు, శ్రీ సత్యసాయి సేవా సంస్థ అఖిల భారత అధ్యక్షుడు శ్రీ ఆర్.జె. రత్నాకర్, శ్రీ సత్యసాయి హయ్యార్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ ఛాన్సలర్ శ్రీ నిమిష్ పాండ్య.. శ్రీ కే. చక్రవర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2193344)
आगंतुक पटल : 16