ఉప రాష్ట్రపతి సచివాలయం
పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్
సేవను జీవితంలో భాగంగా మార్చే విద్యను శ్రీ సత్య సాయిబాబా ఆశించారు: ఉపరాష్ట్రపతి
అనూహ్యమైన పురోగతికి అంచున నిలిచిన భారత్ ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా వేగంగా ఎదుగుతోంది: ఉపరాష్ట్రపతి
మూల విలువలకు కట్టుబడి ఉంటూ ప్రపంచ ఆలోచనలను స్వీకరించడంలోనే
నిజమైన పురోగతి ఉంది: ఉపరాష్ట్రపతి
భవిష్యత్ తరాలు జాతీయ విలువలకు కట్టుబడి కృత్రిమ మేధ (ఏఐ), బిగ్ డేటా, బ్లాక్‌చెయిన్ మొదలైన సాంకేతికతలలో ప్రావీణ్యం సంపాదించాలి: ఉపరాష్ట్రపతి
దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పట్టభద్రులకు ఉపరాష్ట్రపతి పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
22 NOV 2025 8:13PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈ రోజు జరిగిన శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ వేడుకకు ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ.రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, సేవ అనేది ఒక బాధ్యత కాకుండా, జీవితంలో ఒక భాగంగా ఉండే విద్యా వ్యవస్థను శ్రీ సత్యసాయిబాబా ఆశించారని, అది నిస్వార్థత, నిజాయితీ, ఉన్నత విలువలకు కట్టుబడిన నాయకులను అందిస్తుందని పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయిబాబా స్థాపించిన విశ్వవిద్యాలయం చిహ్నంగా ఉన్న సర్వధర్మ స్తూపం శాంతి, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి ప్రముఖంగా పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసం, విజ్ఞానం అందిస్తూ ఈ విద్యాసంస్థ అన్ని మతాలు, సంప్రదాయాలకు గౌరవం ఇస్తోందని ఆయన ప్రశంసించారు.
దేశంలో మార్పుదాయక వృద్ధి గురించి మాట్లాడుతూ, భారత్ అపూర్వమైన పురోగతి అంచున ఉందని, ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా, సుస్థిర అభివృద్ధికి, శాంతికి మార్గదర్శిగా ఆవిర్భవిస్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలులోకి వచ్చిన విస్తృతమైన సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020 ద్వారా ఉన్నత విద్యా వ్యవస్థ మరింత బలపడిందని అన్నారు. సమగ్ర బోధనా వర్గం అభివృద్ధి, గణనీయమైన మౌలిక సదుపాయాలపై గణనీయమైన పెట్టుబడులు, డిజిటల్ సాధనాల వినియోగం, మెరుగైన అభ్యసన ఫలితాలు ఈ విధానం ద్వారా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలు వేగంగా బహుళ విషయ పరిశోధన, ప్రతిభ దిశగా ముందుకు సాగుతున్నాయని, తద్వారా విజ్ఞాన సృష్టి, సాంకేతిక పురోగతి, సమ్మిళిత విద్యాపరమైన అభివృద్ధిలో భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థాయిలో నిలబెడుతున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పరిశోధనలో పెట్టుబడిని పెంచాల్సిన అవసరాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్ తరాలు కృత్రిమ మేధ, బిగ్ డేటా, బ్లాక్ చెయిన్, మెషిన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు తప్పనిసరిగా అలవాటు పడాలని, అదే సమయంలో జాతీయ విలువలకు కట్టుబడి ఉండాలని శ్రీ రాధాకృష్ణన్ ఉద్బోధించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సంస్కరణలు అమలు జరుగుతున్నాయని, ప్రపంచం భారతదేశం మాట వింటోందని ఉపరాష్ట్రపతి అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి పిలుపును గుర్తు చేస్తూ, భారత్ కేవలం తన కోసం మాత్రమే కాకుండా, మానవాళి శ్రేయస్సు కోసం వ్యాక్సిన్‌ను తయారు చేసిందని ఆయన పేర్కొన్నారు. దీనిని మన దేశం సాధించిన గొప్ప విజయాలలో ఒకటిగా ఆయన అభివర్ణించారు.
మానవీయ కోణంతోనే ఆర్థిక శక్తికి విలువ ఉంటుందని, అనేక దేశాలకు ఉచితంగా టీకాలను అందించడం ద్వారా భారతదేశం దీనిని నిరూపించిందని ఆయన అన్నారు. భారత్ ప్రపంచంలో నంబర్ వన్ ఆర్థిక శక్తిగా మారినప్పుడు, ప్రపంచ సంక్షేమానికి మరింత ఎక్కువ కృషి చేస్తుందని తెలిపారు.
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు, "డ్రగ్స్ వద్దు” అనే సందేశాన్ని మరోసారి ఉద్ఘాటించారు. విద్యార్థులు భారత ఆధ్యాత్మిక విలువలు, మానవత్వం, క్రమశిక్షణ అంకితభావంతో కూడిన జీవన విధానానికి రాయబారులుగా ఉండాలని ఆయన కోరారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'వికసిత్ భారత్ @ 2047' దార్శనికతతో తమను తాము సమన్వయం చేసుకుని, దేశ పురోగతికి అర్థవంతమైన సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి పట్టభద్రులను కోరారు.
"మానవతా విలువలను పెంపొందించుకోవడమే నిజమైన విద్య" అని శ్రీ సత్యసాయి బాబా ఇచ్చిన సందేశాన్ని ఉటంకిస్తూ తన ప్రసంగాన్ని ముగించిన ఉపరాష్ట్రపతి, ఈ అర్థవంతమైన సందేశాన్ని పట్టాలు తీసుకుంటున్న విద్యార్థులు తమ జీవితాలకు మార్గనిర్దేశంగా తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టీజీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్, ఎస్ఎస్ఎస్ఐహెచ్ఎల్ ఛాన్సలర్ శ్రీ కె. చక్రవర్తి, ఇతర ప్రముఖులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2193229)
సందర్శకుల సూచీ సంఖ్య : : 32