ఆయుష్
azadi ka amrit mahotsav

భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా- 2025 (ఐఐటీఎఫ్)లో ప్రధానాకర్షణగా మారిన ఆయుష్ మండపం


ఐఐటీఎఫ్‌- 2025లో ఉచిత సంప్రదింపులు, ఉచిత మందులతో పాటు
పిల్లలు పాలుపంచుకోదగ్గ కార్యక్రమాలతో
కుటుంబాలను ఆకట్టుకుంటున్న ఆయుష్ మండపం

ఒంటికి మేలు చేసే చిరుతిళ్లతోనూ, ప్రీమిక్సులతోనూ
ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన తినుబండారాల్ని
పరిచయం చేసిన అఖిల భారత ఆయుర్వేద సంస్థ

ఐఐటీఎఫ్‌- 2025లో సాత్వికాహారంతో పాటు
ఆయుర్వేద ఆరోగ్య వర్ధక ఉత్పాదనలపై
దృష్టి కేంద్రీకరించిన జాతీయ ఆయుర్వేద సంస్థ

ఆయుర్వేద పద్ధతుల్లో పోషకాహారం, చిరుధాన్యాల క్విజ్,
ఆరోగ్యదాయకమైన కొత్త ఆహార పదార్థాలతో
ప్రపంచ దేశాల సందర్శకులను
ఆకర్షిస్తున్న రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్

యోగా ప్రదర్శనలు, క్విజ్‌లతో సందర్శకులను ఆకట్టుకుంటున్న మొరార్జీ దేశాయి జాతీయ యోగా సంస్థ

సాంప్రదాయక ఆహార పదార్థాలు, డిజిటల్ పద్దతిలో మిజాజ్ అంచనాతో పాటు
ఉచిత సంప్రదింపులతో ఆకట్టుకుంటున్న యునానీ విభాగం

హిబిస్కస్ టీ, పంచముట్టి కాంజీ వంటి నివారణ ప్రధాన, పౌష్టిక ఆహార పదార్థాలను ప్రదర్శిస్తున్న సిద్ధ సిస్టమ్స్

మూలికలపై అవగాహనను పెంచడానికి అటల్ ఆయుష్ మహోత్సవ్‌లో భాగంగా
ఔషధ మొక్కలను పంపిణీ చేస్తున్న జాతీయ ఔషధ మొక్కల మండలి

కొత్త వెల్‌నెస్ ఉత్పాదనలను ప్రదర్శిస్తూ ఐఐటీఎఫ్-2025లో
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిని ఇస్తున్న ఆయుష్ అంకుర సంస్థలు

प्रविष्टि तिथि: 21 NOV 2025 1:18PM by PIB Hyderabad

భారత సాంప్రదాయక ఆరోగ్య సంరక్షణ వారసత్వ సంప్రదాయాల్లో అత్యుత్తమమైన వాటిని ‘‘ఆయుష్ కే సాథ్...స్వస్థ్ భారత్, శ్రేష్ఠ్ భారత్’’ ఇతివృత్తంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా- 2025 (ఐఐటీఎఫ్) సందర్శకులకు పరిచయం చేస్తోంది. ఆయుష్ మండపంలో ప్రత్యేక అంశాలను ప్రతిబింబించే  ప్రధాన స్టాళ్లు, మేళాలో సందర్శకుల ఆదరణను ఎక్కువగా పొందుతున్నాయి. ఇవి ఆయుర్వేద, యోగా, నేచరోపతి, యునాని, సిద్ధ, సోవా-రిగ్పాలతో పాటు హోమియోపతి లలో ప్రస్తావించిన సమగ్ర ఆరోగ్య పద్ధతుల్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్న వేలాది సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.  

image.png

డిజిటల్ విధానంలో రోగనిర్ధారణ మొదలు మితాహార పద్ధతులేమేమిటన్నది తెలియజేయడం, సందర్శకులు పాల్గొనేందుకు అవకాశాన్ని ఇచ్చే ఆటలు, నిపుణుల సలహాలు.. ఇలా ప్రతి స్టాల్లోనూ ఆయుష్ ఆరోగ్య వ్యవస్థల్లో ఒక నిర్దిష్ట అంశాన్ని ప్రముఖంగా చాటిచెప్తున్నారు.  అన్ని వయోవర్గాల ప్రజలు పాలుపంచుకునే వీలున్న కార్యక్రమాలనూ, ప్రత్యక్ష ప్రదర్శనలను, అవగాహన కలిగించే సదస్సులనూ ఏర్పాటు చేస్తూ సందర్శకుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు.

అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఆలిండియా ఆయుర్వేద ఇనిస్టిట్యూట్..ఏఐఐఏ) స్టాల్ ఈ మండపంలో ముఖ్యాకర్షణగా నిలుస్తోంది. దీనిలో మౌలిక ఆహార ఉత్పాదనలూ, వాటిని స్వీకరించినప్పుడు లభించే ప్రయోజనాలను సమగ్రంగా వివరిస్తూ ఆయుర్వేద ఆధారిత, పథ్యాన్ని పాటించాల్సిన పద్ధతుల్ని విడమరచి చెబుతున్నారు. ఈ సంస్థ రాగి నాచోలు, సుంథ్యాది లడ్డూ, రాగి-మినప లడ్డూ, ముడ్గా జావ పొడి (సూప్ ప్రీమిక్స్), యవదీ సక్తు వంటి రుచులపై అవగాహన కల్పిస్తోంది. వాటన్నిటినీ శాస్త్రీయ ఆయుర్వేదిక సిద్ధాంతాలకు అనుగుణంగా తయారు చేశారు. ఈ పదార్థాలు మానవ పోషణను... ప్రత్యేకించి రక్తహీనతను అధిగమించడం, వ్యాధుల నుంచి కాపాడుకునే శక్తిని పెంపొందించడంతో పాటు జీర్ణక్రియకు సంబంధించిన పటుత్వాన్ని కూడా ఎలా మెరుగుపరుస్తాయో నిపుణులు వివరిస్తున్నారు. తినుబండారాలను తయారు చేసుకొనే విధానాలను పొందుపరిచిన చిన్న పుస్తకాలనే కాకుండా, మనిషి శరీరంలో సహజంగానే నిరోధకతను బలపరచడంలో సాంప్రదాయక ధాన్యాలు, మూలికలు, మసాలా దినుసులు పోషించే పాత్రను గురించిన సమాచారాన్ని కూడా సందర్శకులకు అందజేస్తున్నారు.    
image.png

జైపూర్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ ఆయుర్వేద సంస్థ (నేషనల్ ఆయుర్వేద ఇనిస్టిట్యూట్..ఎన్ఐఏ) ‘ఆయుష్ ఆహారం’ ఇతివృత్తానికి అనుగుణంగా ఓ సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించింది. త్రిఫల జామ్, కొత్త బలాన్నిచ్చే గింజలు, రాగి బిస్కెట్లు సహా సాత్విక పథ్య సంబంధమైన ఆహార ఉత్పాదనల శ్రేణినీ, ఎలోవెరా జెల్, పెదవులకు పూతమందు, పాదాలకు రాసుకోవాల్సిన మీగడ (క్రీమ్) వంటి శారీరక సంరక్షణ సాధనాలనూ ఈ సంస్థ ప్రదర్శిస్తోంది. సాత్విక ఆహార సిద్ధాంతాలు మానసిక స్పష్టతకూ, సంతులిత శక్తితో పాటు దీర్ఘకాలిక స్వస్థతకూ ఎలా దోహదం చేస్తాయో  సందర్శకులకు అర్థమయ్యేటట్టు సంస్థకు చెందిన అధ్యాపకులు చెబుతున్నారు. ఆయుర్వేదం సూచిస్తున్న ప్రకారం ఆహార నియంత్రణ పరంగా మామూలు మార్పుల్ని నిత్య జీవనంలో ఎలా చేసుకోవచ్చో సందర్శకులు గ్రహించగలిగేలా వివరణ పత్రాల్ని కూడా ఈ స్టాల్ అందిస్తోంది.

image.png

ఆయుష్ ఆహార్ ఇతివృత్తంతో అనేక ఆయుర్వేద ఆధారిత పోషక ఉత్పాదనలను రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ (ఆర్ఏవీ) ప్రదర్శనకు పెట్టింది. దీన్లో నువ్వులు, వాము, జీలకర్ర, ఎనీ బ్రెడ్, జీతాయు టీ, ఎన్‌పీ పానీయం (Enppy Drink), ఫుల్ మూన్ చాకొలెట్ల వంటివి ఉన్నాయి. ఇవి దైనందిన ఆహారంలో ఆయుర్వేదిక సిద్ధాంతాలను అనుసరించడం వల్ల ప్రయోజనాలుంటాయని సూచిస్తాయి. ఆయుర్వేదంలో చిరుధాన్యాల వల్ల పొందగలిగిన లాభాలపై సందర్శకులలో అవగాహనను పెంచడానికి ఒక మిల్లెట్ క్విజ్‌ను కూడా ఆర్ఏవీ నిర్వహిస్తోంది. విద్యార్థులు, కుటుంబాలతో పాటు అంతర్జాతీయ సందర్శకులు కూడా ఉత్సాహంతో ఈ స్టాల్‌లో గుమికూడుతున్నారు. వారంతా ఆయుర్వేద విజ్ఞానంతో ముడిపెట్టిన ఆరోగ్యదాయక, మానవ మనుగడ దీర్ఘకాలం కొనసాగేందుకు అనువైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే దిశగా ఆర్ఏవీ చేస్తున్న ప్రయత్నాల్ని ప్రశంసిస్తున్నారు.


image.png

యోగా ఆధారిత ప్రదర్శనలనూ, అవగాహన కలిగించే అనేక కార్యక్రమాలనూ చేపట్టి మొరార్జీ దేశాయి జాతీయ యోగా సంస్థ (ఎండీఎన్ఐవై) తన వంతు తోడ్పాటును అందిస్తోంది. ఉమ్మడి యోగా ప్రోటోకాల్, లయబద్ధ యోగా ప్రదర్శనలు, యోగాపై ప్రశ్నోత్తరాల పోటీ, కొద్ది సమయంలోనే ఆచరించదగ్గ యోగా (‘‘వై-బ్రేక్’’) అభ్యాసాల వంటి మార్గదర్శక కార్యక్రమాల్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. పనికి వెళ్లే వ్యక్తులు బిజీగా ఉండే తమ రోజువారీ జీవనంలో త్వరగా సేద తీరే మెలకువలను కోరుకుంటారు.  ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని  ‘‘వై-బ్రేక్’’ను రూపొందించారు. ఈ కార్యక్రమాలను నిర్వహించి దీని ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని, ఏకాగ్రతను పెంచుకొని, సరళత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సీదాసాదా యోగాభ్యాస రీతులను ఆధునిక జీవన శైలుల్లో ఎంత నిరాటంకమైన పద్ధతిలో ఇముడ్చుకోవచ్చో సందర్శకులకు తెలియజేయాలని ఎండీఎన్ఐవై లక్ష్యంగా పెట్టుకుంది.   
image.png

కేంద్ర యునానీ వైద్య చికిత్స పరిశోధన మండలి (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ యునానీ మెడిసిన్..సీసీఆర్‌యూఎమ్)తో పాటు యునానీ వైద్య జాతీయ సంస్థ (నేషనల్ యునానీ మెడిసిన్ ఇనిస్టిట్యూట్..ఎన్ఐయూఎం) ఈ రెండూ కలిసి, యునానీ వైద్య చికిత్సకు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ స్టాల్‌ను ఏర్పాటు చేశాయి. ఈ స్టాల్లో హరేరా, యునానీ కహ్వా, హల్వా ఘీక్వార్, గుల్‌కంద్, తల్‌బీనా ఆధారిత బార్లీ ఉత్పాదనల వంటి సాంప్రదాయక యునానీ ఆహారపదార్థాలను పరిచయం చేస్తున్నారు. వైద్య చికిత్స పరంగా వాటికి యూనానీ సంతులితాహార ఫ్రేంవర్క్ పరిధిలో ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసే వివరణలనూ ప్రదర్శిస్తున్నారు. ఈ స్టాల్‌లో ఏర్పాటు చేసిన ఒక డిజిటల్ మిజాజ్ అంచనా కియోస్క్ చాలా మందిలో ఉత్సుకతను కలిగిస్తోంది. ఈ కియోస్క్ సాయంతో ఆగంతుకులు తమ వ్యక్తిగత శారీరక స్వభావం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి దమ్వీ, బల్గామీ, సఫ్రావీ లేదా సౌదవీ.. వీటిలో ఏ స్వభావం కలిగిన వారో తెలుసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. దీనికోసం ఇది యునానీ రోగనిర్ధారణ సిద్ధాంతాలను ప్రాతిపదికగా తీసుకుంటుంది. సీసీఆర్‌యూఎం, ఎన్ఐయూఎంల వైద్యులు సంప్రదింపు సేవల్ని ఉచితంగా అందజేయడమే కాక మందుల్ని కూడా ఇస్తున్నారు. దీంతో సందర్శకులు యునానీ ఆహార నియమాల ప్రకారం తమ ఆరోగ్యాన్ని కాపాడుకొనే తీరుతెన్నులను గురించి తెలుసుకోగలుగుతున్నారు.   
image.png


సిద్ధ వ్యవస్థ పక్షాన జాతీయ సిద్ధ సంస్థ (ఎన్ఐఎస్), కేంద్ర సిద్ధ పరిశోధన మండలి (సెంట్రల్ సిద్ధ రిసర్చ్ కౌన్సిల్.. సీసీఆర్‌ఎస్)లు స్టాల్‌ను ఏర్పాటు చేశాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా ఎన్ఐఎస్ పనిచేస్తోంది. వ్యాధులకు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పోషణ, ప్రజల్లో అవగాహన.. ఈ విషయాల్ని ఈ స్టాల్‌లో ప్రధానంగా తెలియజేస్తున్నారు. ‘ఆయుష్ ఆహార్’ ఇతివృత్తంలో భాగంగా, హిబిస్కస్ ఇన్‌ఫ్యూజన్ టీ, పంచముట్టీ కాంజీ, కరిసలాయి మిఠాయి, హలీమ్ నాచోస్ అందజేస్తున్నారు. వీటిలో హిబిస్కస్ ఇన్‌ఫ్యూజన్ టీ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఎన్ఐఎస్ బృందం ఐఈసీ సామగ్రి, 100 మందికి పైగా లబ్ధిదారులకు  వైద్య చికిత్స సంప్రదింపు సేవల్ని ఉచితంగా అందించడమే కాకుండా, ఐఐటీఎఫ్ ఆయుష్ స్టాల్‌లో అవగాహన కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తోంది. ఈ సంస్థ తాను బోధిస్తున్న యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల సమాచారాన్ని కూడా పంచుకుంటూ, సిద్ధ విద్యను అభ్యసించడంతో పాటు పరిశోధనలు చేయడానికి కూడా ముందుకు రావడానికి మరింత మందికి ప్రోత్సాహాన్ని అందిస్తోంది.    
image.png


కేంద్ర హోమియోపతి పరిశోధన మండలి (సెంట్రల్ హోమియోపతి రిసర్చ్ కౌన్సిల్.. సీసీఆర్‌హెచ్) ఒక అతి పెద్ద స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ భారీ స్టాల్‌లో కలియదిరిగి పరిశోధన ప్రధాన ప్రచురణలు, పోస్టర్లు, డిజిటల్ కంటెంటు, హోమియోపతిలో రోగ చికిత్సకు సంబంధించిన అధ్యయనాలు, భద్రత ప్రోటోకాల్స్ గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మండపంలో ఓ హోమియోపతి ఓపీడీ కూడా పనిచేస్తోంది. దీనిలో వైద్యులు సంప్రదింపు సేవల్ని ఉచితంగా అందించడంతో పాటు, అవసరమైన మందులనూ ఇస్తున్నారు. హోమియోపతి మౌలిక సిద్ధాంతాలు, వ్యక్తిగత చికిత్సకున్న ప్రాధాన్యంతో పాటు పరిశోధన, చికిత్స ప్రమాణీకరణ కోసం సీసీఆర్‌హెచ్ అనుసరించిన శాస్త్రీయ దృష్టికోణాలను గురించి కూడా ఈ స్టాల్‌లో వివరిస్తున్నారు.    

image.png

ఆయుష్ వ్యవస్థల్లోని వివిధ సంస్థలు ఈ మండపంలో పాలుపంచుకుంటున్నాయి. హిమాలయ ప్రాంతానికి చెందిన ప్రాచీన చికిత్స సంప్రదాయాలను సందర్శకులకు జాతీయ సోవా-రిగ్పా సంస్థ పరిచయం చేస్తోంది. ఈ స్టాల్‌లో సోవా-రిగ్పా ఆహారం, చికిత్స నియమాలు, మూలికా సంబంధ సూత్రీకరణల గురించి విస్తృత సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. ఈ సంస్థ ప్రతి రోజూ దాదాపు నలభై ఉచిత సంప్రదింపు సేవల్ని సమకూరుస్తోంది. శాస్త్రీయ గ్రంథాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా నిపుణులు వ్యక్తిగత మార్గదర్శనాన్ని అందజేస్తున్నారు. ఈ మాటామంతీ.. ఆహారం, ప్రవర్తన, మూలికాధారిత చికిత్సల్ని కలపడం ద్వారా ప్రకృతితో పొందికకు ప్రాధాన్యాన్నిచ్చే వైద్య విధానాన్ని గురించి తెలుసుకొనే ఒక విశిష్ట అవకాశాన్ని సందర్శకులకు కలగజేస్తోంది.    

image.png

ఔషధ మొక్కలతో ఒక ప్రదర్శనను నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు (ఎన్ఎంపీబీ) నిర్వహిస్తోంది. దీనిలో ఆయా మొక్కల గుర్తింపు, సాగు, చికిత్సలో అవి చూపే ప్రభావాల సమగ్ర అవగాహనను పొందవచ్చు. మూలికలను ఇళ్లలో ఉపయోగించుకొనే తీరుతెన్నులను తెలిపే ప్రచురణలను సందర్శకులకు అందజేస్తున్నారు. ‘‘అటల్ ఆయుష్ మహోత్సవ్’’లో భాగంగా, భారత్ రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ గారి శత జయంతి సందర్భంగా ఔషధ మొక్కల పంపిణీనీ ఎన్ఎంపీబీ చేపడుతోంది. దీంతో ఇంటి వద్దే ఔషధ మొక్కలను పెంచనుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్లు చాలా మంది ఈ స్టాల్‌ను సందర్శిస్తున్నారు.

 
image.png


ఆయుష్ శాఖలో భాగమైన భారత ప్రభుత్వ సంస్థ ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యుటికల్ కార్పొరేషన్ (ఐఎంపీసీఎల్) ఈ మండపంలో తన ప్రామాణిక ఆయుర్వేదిక, యునానీ మందుల శ్రేణిని పరిచయం చేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని మోహన్‌లో ఐఎంపీసీఎల్ నెలకొల్పిన తయారీ కేంద్రం డబ్ల్యూహెచ్ఓ-జీఎంపీ, ఐఎస్ఓ ధ్రువీకరణలను సంపాదించింది. ఉన్నత నాణ్యత కలిగిన సాంప్రదాయక ఔషధాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యసంరక్షణ సంస్థలకు ఐఎంపీసీఎల్ సరఫరా చేస్తోంది. ఈ ఔషధాలను సంస్థ ఐఐటీఎఫ్‌లో ప్రదర్శిస్తోంది. విశ్వసనీయ ఉత్పాదనలనూ, 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.170 కోట్ల వార్షిక టర్నోవర్‌ను సాధించిన వైనాన్ని తన స్టాల్ ద్వారా తెలియజేస్తోంది. ఇది దేశంలో నాణ్యమైన, సురక్షితమైన ఆయుష్ ఔషధాలను అందించడంలో సంస్థ పోషిస్తున్న కీలక భూమికను చాటిచెబుతోంది.

image.png

భారతీయ వైద్యం, హోమియోపతిల ఫార్మాకోపియా కమిషన్ (పీసీఐఎం అండ్‌ హెచ్) తన మ్యాండేట్, కార్యకలాపాలు, పరిశోధనల పరంగా చోటు చేసుకున్న పురోగతికి సంబంధించిన వివరణ పత్రాలను, శ్రవణ-దృశ్య సామగ్రితో పాటుగా ఏఎస్‌యూ అండ్ హెచ్ ఫార్మాకోపియా, ఫార్ములరీస్, ఎండబెట్టిన ఏక రూప ఔషధాలు సహా ప్రధాన ప్రచురణల్ని ఇక్కడ ప్రదర్శిస్తోంది. ఔషధకోశం (ఫార్మకోపియా) ప్రమాణాల పరంగా దేశంలో సర్వోన్నత సంస్థ అయిన కారణంగానూ, బీఐఎస్ ధ్రువీకరించిన ఏకీకృత నిర్వహణ వ్యవస్థలతో పాటు ఎన్ఏబీఎల్ గుర్తింపును పొందిన ప్రయోగశాలగానూ ఉన్న పీసీఐఎం అండ్ హెచ్.. ఈ మండపాన్ని ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతి మందుల నాణ్యత, భద్రత, విజ్ఞానశాస్త్ర పరమైన గుర్తింపుల పట్ల ప్రజల్లో అవగాహనను పెంపొందించడానికి ప్రభావవంతమైన వేదికగా ఉపయోగించుకుంటోంది.

    
image.png

కేంద్ర యోగా, ప్రాకృతిక చికిత్స పరిశోధన మండలి (సెంట్రల్ యోగ, నేచరోపతి రిసర్చ్ కౌన్సిల్.. సీసీఆర్‌వైఎన్) ప్రక‌తి చికిత్స ఆధారిత పోషణ, వెల్‌నెస్‌లకు సంబంధించిన అనేక కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తోంది. ఈ స్టాల్‌లో ‘ఆయుష్ ఆహార్’ను భౌతిక, డిజిటల్.. ఈ రెండు రూపాల్లోనూ పరిచయం చేస్తున్నారు. దీనిలో డాక్యుమెంటరీలు, శ్రవణ-దృశ్య సామగ్రి కలిసి ఉన్నాయి. సందర్శకులకు ప్రకృతి చికిత్స, యోగాభ్యాసాలపై ఐఈసీ మెటీరియల్‌‌ను కూడా సీసీఆర్‌వైఎన్ పంపిణీ చేస్తోంది. వారికి నువ్వుల లడ్డూ, వేరుసెనగతో నువ్వులను కలిపి చేసిన లడ్డూ, మఖానా లడ్డూ, చిరుధాన్యాలతో చేసిన ఖారా.. వీటిని రుచి చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇవి సంప్రదాయ ప్రకృతి చికిత్స గ్రంథాల్లో వివరించిన సరళమైన, ఆరోగ్యవర్థక ఆహార ఐచ్ఛికాలకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.  

image.png

ఈ మండపంలో అనేక ఆయుర్వేద ఆధారిత అంకుర సంస్థలు కూడా పాలుపంచుకుంటున్నాయి. ఇవి చర్మ సంరక్షణ ఉత్పాదనలనూ, కేశ సంరక్షణ ఉత్పాదనలనూ, డిటాక్స్ డ్రింకులనూ, ఆయుర్వేదిక ఆహార పదార్థాలనూ, ఇతర ఆరోగ్య వర్ధక ఉత్పాదనలనూ పరిచయం చేస్తున్నాయి. వీటి భాగస్వామ్యం యువ వాణిజ్య సంస్థలను ప్రోత్సహించాలన్న, నవకల్పనకు అండదండలను అందించాలన్న ఆయుష్ శాఖ నిబద్ధతను చాటిచెబుతోంది. దీంతో కొత్త సంస్థలకు సందర్శకులతో నేరుగా సంభాషించే, వారికి సాంప్రదాయక చికిత్స పద్ధతుల ఆధునిక ఉపయోగాలపై అవగాహనను కలిగించే
అవకాశం లభిస్తోంది.

image.png

మండపం ఆకర్షణ శక్తిని మరింత పెంపొందిస్తూ, ఒక ప్రత్యేక కార్యక్రమాల క్షేత్రాన్ని కూడా ఆయుష్ మండపంలో ఏర్పాటు చేశారు. బాలలు, యువత, కుటుంబాల దృష్టిని ఆకట్టుకొనే ఉద్దేశంతో దీనిని తీర్చిదిద్దారు. 6-12 ఏళ్ల పిల్లల కోసం చిత్రకళ పోటీలు, ఆరోగ్య అంశాలతో కూడిన పాములు, నిచ్చెన ఆట, వ్యక్తిత్వాన్నీ, స్వభావాన్నీ తెలుసుకొనేందుకు ఉద్దేశించిన పరీక్షలు, నినాదం రాసే పోటీ, పోస్టర్ ను తయారు చేసే కార్యక్రమాలు, చక్రాన్ని తిప్పాల్సిన ఆటలు, చిరుధాన్యాలపై ప్రశ్నలు, జవాబుల పోటీలు, ఒక ప్రత్యేక ఫోటో బూత్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ ఆగంతుకులకు సంపూర్ణ భాగస్వామ్యాన్ని ఏర్పరచడానికే కాకుండా, వినోదాత్మక, సంభాషణ ప్రధాన పద్ధతుల్లో స్వస్థతపై అవగాహనను కూడా కల్పిస్తున్నాయి.      



image.png

ఐఐటీఎఫ్‌- 2025లో భాగమైన ఆయుష్ మండపం పెద్ద ఎత్తున సందర్శకులను ఆకర్షిస్తోంది. వారు ఇక్కడ విభిన్నమైన వస్తువులను చూసి, వివరాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఈ మండపం సంపూర్ణ ఆరోగ్యసంరక్షణ తాలూకు భారత సమృద్ధ సంప్రదాయాన్ని  చాటిచెప్పడంతో పాటు, సంప్రదాయ ఆయుష్ విజ్ఞానాన్ని ఏయే విధాలుగా ఆధునిక శాస్త్రీయ విధానాల్లో మమేకం చేస్తున్నదీ కూడా కళ్లకు కడుతోంది.  సందర్శకులకు ఉచిత ఆరోగ్య పరీక్షలే కాక ఆయుష్ మందులను కూడా ఇస్తున్నారు. ప్రజలు తక్కువ ఖర్చుతో, నివారణ ప్రధాన పద్దతుల్లో, తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే అంశంపై శ్రద్ధ వహించేటట్లు చూడాలన్న తన నిబద్ధతను దీని ద్వారా ఆయుష్ మంత్రిత్వ శాఖ బలంగా చాటుకుంటోంది.

 

***


(रिलीज़ आईडी: 2192936) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil