పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఎర్ర చందనం భద్రత, సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.39.84 కోట్లు విడుదల చేసిన ఎన్‌బీఏ
प्रविष्टि तिथि:
21 NOV 2025 8:59AM by PIB Hyderabad
భారత్ జీవవైవిధ్య సంరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహించే దిశగా, జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) ప్రతిష్ఠాత్మక ఎర్ర చందనం భద్రత, సంరక్షణలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ విభాగానికి రూ.38.36 కోట్లనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలికి రూ.1.48 కోట్లనూ విడుదల చేసింది. దీంతో పాటే భారత్ అమలు చేస్తున్న లభ్యత, లాభాల పంపిణీ (యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్..ఏబీఎస్) పద్ధతిలో చేసిన చెల్లింపులు రూ.110 కోట్లను దాటిపోయాయి. ఇది, దేశంలో జీవవైవిధ్య సంరక్షణకు ఏబీఎస్ రూపంలో ఇంతవరకు చేసిన అతి భారీ చెల్లింపుల్లో ఒకటి అని చెప్పవచ్చును.
ఎర్ర చందనం బాగా ఎర్రనైన కలపను అందిస్తూ ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది. ఈ జాతి చెట్లు మన దేశ తూర్పు కనుమలలోని కొన్ని ప్రాంతాల్లోనే, మరీముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశంతో పాటు కర్నూలు జిల్లాల్లో మాత్రమే సహజ సిద్ధంగా పెరుగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న లేదా వేలం వేసిన ఎర్ర చందనం ద్వారా లాభాలను ఆంధ్రప్రదేశ్ అటవీ విభాగంతో కలిసి పంచుకునే పద్ధతిలో రూ.87.68 కోట్ల ఆదాయం లభించింది.
ఎర్ర చందనం సంరక్షణ, పరిశోధన కోసం ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా అటవీ విభాగాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలికి ఇంతవరకు రూ.49 కోట్లను ఎన్‌బీఏ విడుదల చేసింది. దీనికి అదనంగా, ఆంధ్రప్రదేశ్‌లో 198 మంది రైతులకూ, తమిళనాడులో 18 మంది రైతులకూ రూ.3 కోట్లను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అటవీ విభాగానికి ఇప్పుడిచ్చిన రూ.38.36 కోట్లు అటవీ సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని అందించడం, పరిరక్షణ చర్యలను ఇప్పటితో పోలిస్తే పెంచడం, ఎర్ర చందన అడవుల శాస్త్రీయ నిర్వహణను ప్రోత్సహించడం, జీవవైవిధ్య నిర్వహణ సంఘాల ద్వారా జీవనోపాధి అవకాశాలను కల్పించడంతో పాటు దీర్ఘకాలిక పర్యవేక్షణ కార్యక్రమాన్ని బలపరచడానికి తోడ్పడుతుంది. దీంతో ఈ అరుదైన కలపను అందించే వృక్ష జాతులకు ఉజ్వల భవితను అందించే దిశగా ఓ ప్రధాన నిర్ణయాన్ని తీసుకున్నట్లయింది.
దీంతో పాటు, రూ.2 కోట్ల ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో ఒక లక్ష ఎర్రచందనం మొక్కలను పెంచాలన్న కార్యక్రమానికి కూడా ఎన్‌బీఏ ఆమోదాన్ని తెలిపింది. ఇందులో కొంత సొమ్మును ఇంతకుముందే విడుదల చేశారు. మిగిలిన రూ.1.48 కోట్లను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలికి ఇచ్చారు. ఈ మొక్కలను పెంచి, వాటిని రైతులకు ఇస్తారు. దీంతో అడవుల్లో కాకుండా ఇతర చోట్ల మొక్కల పెంపకం (ట్రీస్ అవుట్‌సైడ్ ఫారెస్ట్‌స్.. టీఓఎఫ్) కార్యక్రమానికి దన్ను లభించడంతో పాటు, ఈ అరుదైన వృక్ష జాతిని దాని సహజ స్థలానికి ఆవల పెంచడానికి కూడా తోడ్పడినట్లు అవుతుంది.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఏబీఎస్ ఏ విధంగా ప్రపంచ జీవవైవిధ్య సిద్ధాంతాల ఆచరణలో నాయకత్వాన్ని ప్రోత్సహించి భారత్ విజయాలకు తోడ్పడగలుగుతుందో సూచిస్తుంది.అంతేకాక, ఇది సంరక్షణతో ముడిపడ్డ లాభాలు స్థానికులకూ, రైతులకూ, జీవవైవిధ్య సంరక్షకులకూ అందేటట్లు కూడా చూస్తుంది. మన సమృద్ధ జీవశాస్త్ర వారసత్వాన్ని దేశ భావి తరాల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని పరిరక్షించడానికి రాష్ట్రాల జీవవైవిధ్య మండలులు, అటవీ విభాగాలు, జీవవైవిధ్య నిర్వహణ సంఘాలు, స్థానిక ఆసక్తిదారులతో పాటు ఎన్‌బీఏ తాను కూడా కలిసి కృషి చేస్తూనే ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 2192672)
आगंतुक पटल : 38