వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శంకుస్థాపన చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
Posted On:
14 NOV 2025 4:50PM by PIB Hyderabad
విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, దేశంలో సమాచార సాంకేతిక పరిజ్ఞాన వృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేసిన కృషిని ప్రశంసించారు.
కర్నూలు సమీపంలోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్‌లో ప్రత్యేకించి డ్రోన్‌ల కోసం సుమారు 300 ఎకరాల్లో దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీని నిర్మించడం ద్వారా ముఖ్యమంత్రి ఆ దార్శనికతను ముందుకు తీసుకెళ్లారని ఆయన అన్నారు. డ్రోన్‌ల ప్రభావవంతమైన ఉపయోగాన్ని, ఆపరేషన్ సిందూర్‌లో వాటి పాత్రనూ కేంద్ర మంత్రి ప్రస్తావించారు. అధిక నాణ్యత గల డ్రోన్‌ల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలనీ... కర్నూలులో ఏర్పాటు కానున్న డ్రోన్ సిటీ ఆ దిశలో ఎంతగానో సహాయపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
భారత రాకెట్ ప్రయోగాలకు కేంద్రంగా ఉన్న శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీని నిర్మించాలనే ఆలోచననూ కేంద్ర మంత్రి ప్రశంసించారు.
రాష్ట్ర జీఎస్టీని 100 శాతం రిఫండ్ చేయడం, 20 శాతం మూలధన పెట్టుబడిని తిరిగి చెల్లించడం కోసం ఎస్క్రో ఖాతాను రూపొందించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి సంభావ్య పెట్టుబడిదారులను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర మంత్రి సమర్థించారు. ఇది వ్యవస్థలో రాజకీయ, అధికారిక జోక్యం లేకుండా చేస్తుందనే ఒక పెద్ద సందేశాన్ని పెట్టుబడిదారులకు అందిస్తుందని శ్రీ గోయల్ వ్యాఖ్యానించారు.
ప్రతి రైతు పొలంలో డ్రోన్... ప్రతి భారతీయుడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలనే ప్రధానమంత్రి ఆశయం... స్వర్ణాంధ్ర-2047, వికసిత్ భారత్-2047 ద్వారా నెరవేరుతుందని పేర్కొంటూ కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 2190452)
Visitor Counter : 2