వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ వాణిజ్యానికి విశాఖపట్నం ముఖద్వారం.. స్టీలు తయారీ, సెమీ కండక్టర్ వ్యవస్థ, సముద్ర ఆహారాలకు కీలకం: 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


· 2047 నాటికి వికసిత భారత్ దిశగా దేశ ప్రస్థానంలో మార్గనిర్దేశం కోసం మూడు మూల సూత్రాలతో కూడిన ప్రణాళిక

· దేశంపై పెరుగుతున్న అంతర్జాతీయ విశ్వాసానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) విస్తరణ నిదర్శనం: శ్రీ పీయూష్ గోయల్

Posted On: 14 NOV 2025 4:29PM by PIB Hyderabad

విశాఖపట్నం ప్రాంతం నేడు ప్రపంచ వాణిజ్యానికి ముఖద్వారంగా నిలుస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు- 2025 సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్టీలు తయారీ, కొత్తగా వస్తున్న సెమీకండక్టర్ వ్యవస్థ, సముద్ర ఆహార ఎగుమతుల వంటి రంగాలతో ఈ ప్రాంతం దూసుకుపోతోందన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం దిశగా భారత సమగ్రాభివృద్ధి ప్రస్థానం విజయవంతంగా ముందుకు సాగుతోందని శ్రీ గోయల్ అన్నారు. దేశం అభివృద్ధి చెంది, సుసంపన్నంగా మారితే... ప్రతి రాష్ట్రమూ పురోగమిస్తుందని, ప్రతి పౌరుడికీ ఉన్నత జీవన ప్రమాణాలు లభిస్తాయని, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించే ప్రతి బిడ్డకూ ఉజ్వలమైన, భద్రమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు భారత ప్రయాణానికి మార్గనిర్దేశం చేసేలా.. చాణుక్యుడి అర్థశాస్త్రం స్ఫూర్తితో రూపొందించిన మూడు మూల సూత్రాలను మంత్రి వివరించారు.

మొదటిది- సాంకేతికతతో సౌభాగ్యం. డిజిటల్, ఆవిష్కరణ ఆధారిత భారత వికాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. అందరికీ అందుబాటులోకి రావడం, విస్తరణ - వేగంతోపాటు ప్రతిభ - నైపుణ్యాలు చోదక శక్తిగా ఉంటూ భారత సాంకేతికతా వృద్ధి ముందుకు సాగుతోందని శ్రీ గోయల్ అన్నారు. భారత్ ఇప్పటికే 144 కోట్లకు పైగా ప్రజలకు సేవలందించగల ప్రపంచ స్థాయి డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు. మన యూపీఐ రియల్‌టైమ్ చెల్లింపుల వ్యవస్థను అనుసరించడానికి అనేక దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. ‘ఆధార్ ద్వారా ప్రతి భారతీయుడికీ సురక్షిత డిజిటల్ గుర్తింపు లభించింది. మరోవైపు భారత్ ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సమగ్ర సెమీకండక్టర్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇది వృద్ధి చెందుతోంది. ఇండియా ఏఐ మిషన్ కృత్రిమ మేధను అందరికీ అందుబాటులోకి తెస్తోంద’ని ఆయన అన్నారు. ప్రస్తుతం బిలియన్ మంది భారతీయులు ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యారని, ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీని ఉపయోగించే వారిలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా నిలిచిందని తెలిపారు.

అంగారక మిషన్‌ ప్రారంభం నుంచి ఒకే సారి 104 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం వరకు.. ఆవిష్కరణ, విస్తృత స్థాయిలో సామర్థ్యాలను భారత్ చాటింది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 500 గిగావాట్లకు చేరిందని, ఇందులో 51 శాతానికి పైగా పునరుత్పాదక వనరుల నుంచి వస్తోందని శ్రీ గోయల్ వివరించారు. వచ్చే అయిదేళ్లలో భారత్ తన పర్యావరణ హిత ఇంధన సామర్థ్యాన్ని రెట్టింపు చేసి 500 గిగావాట్లకు పెంచాలని భావిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంధన పరివర్తనల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన్నారు.

భారత్ తన అంతర్జాతీయ భాగస్వాములకు మార్కెట్లను మాత్రమే కాకుండా.. ఉమ్మడి శ్రేయస్సు, పరస్పర వృద్ధి కోసం సహకారాన్ని కూడా అందిస్తోందన్నారు. భారత డిజిటల్ మౌలిక వసతులు, ఉత్తేజకరమైన వ్యవస్థాగత ఏర్పాట్లు, ఇంజినీరింగ్ ప్రతిభ భారీ విస్తరణ మార్గాలకు బలమైన లాంచ్‌పాడ్‌గా నిలుస్తాయన్నారు.

రెండో మూల సూత్రం - న్యాయబద్ధత ద్వారా విశ్వాసం. విశ్వసనీయ ప్రపంచ స్థాయి భాగస్వామిగా భారత్ స్థాయి పెరుగుతుండడాన్ని ఇది చాటుతుంది. ప్రస్తుత భౌగోళిక - ఆర్థిక పరిస్థితుల్లో నమ్మకమే అత్యంత విలువైన సంపద అని శ్రీ గోయల్ వ్యాఖ్యానించారు. వందకు పైగా దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్‌లు, ఔషధాల ఉచిత సరఫరా సహా భారత మానవతా చర్యలు అంతర్జాతీయంగా దేశ విశ్వసనీయతను మరింతగా పెంచాయన్నారు.

విస్తరిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్‌టీఏ) విశ్వాసంతో కూడిన భారత దౌత్య విధానం స్పష్టమవుతోందని మంత్రి అన్నారు. ఇటీవల బ్రిటన్‌తో కుదిరిన ఎఫ్‌టీఏ, అలాగే 100 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చిన ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ) కూటమితో అమల్లోకి వచ్చిన ఎఫ్‌టీఏలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్‌లతో కూడా భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్, అమెరికా, ఒమన్, న్యూజిలాండ్, చిలీ, పెరూలతో చర్చలు జరుపుతోంది.

నియంత్రణ పరమైన సంస్కరణల ఫలితంగా అంచనా వేయదగిన విధానాలు, డిజిటల్ పాలన ద్వారా పారదర్శకత, హామీలను నిలబెట్టుకోవడం వల్లే భారత్ విశ్వసనీయత సాధించగలిగిందని మంత్రి అన్నారు. 42,000కు పైగా నిబంధనలను భారత్ తొలగించిందని, వాడుకలో లేని 1,500 చట్టాలను రద్దు చేసిందని ఆయన వివరించారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు వాణిజ్య సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తున్నాయని, వినియోగదారుల వ్యయాన్ని పెంచుతున్నాయని ఆయన అన్నారు. “మీరు భారత్‌తో భాగస్వాములైతే.. ధర్మమే (సరైనదే చేయడం) ప్రాతిపదికగా సంబంధాలను పరిశీలించే ఓ గొప్ప నాగరికతతో మీరు జట్టు కడుతున్నట్టే’’ అని ఆయన అన్నారు.

మూడో మూలసూత్రం- సమర్థతతో వాణిజ్యం. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత పోటీతత్వాన్ని ఇది చాటుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ.. భారత వాణిజ్య ఎగుమతులు గతేడాది రికార్డు స్థాయిలో 825 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల 81 బిలియన్ డాలర్లు దాటాయని శ్రీ గోయల్ తెలిపారు. బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమం, మార్కెట్ విస్తరణ, సాంకేతికతలో పెట్టుబడుల ద్వారా అన్ని దశల్లోనూ విలువను పెంచడం ఈ వృద్ధికి దోహదపడిందని ఆయన అన్నారు. “దేశ సంపదను సృష్టించుకోవాలి, అది వారసత్వంగా రాదు” అన్న ఆర్థిక వేత్త మైఖేల్ పోర్టర్ మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సూత్రంతో భారత ఆర్థిక వృద్ధి ముందుకు సాగుతోందన్నారు.

అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరించడానికి శ్రీ గోయల్ మూడు కీలక సిఫార్సులను ప్రతిపాదించారు: -  వాణిజ్య అవరోధాలను తగ్గించడం, స్వేచ్ఛగా వస్తువుల రవాణా ద్వారా ఇరువైపులా పెట్టుబడులకు వీలు కల్పించడం, సేవలు - మూలధనం, అత్యాధునిక సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేయడం ద్వారా – ప్రయోజనకరమైన ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడంఅధికారిక విధానాలలో పారదర్శకత - సానుకూల విధానాల రూపకల్పన ద్వారా దీర్ఘకాలిక భాగస్వామ్యానికి దోహదపడేలా విశ్వాసాన్ని పెంపొందించుకోవడం.

ప్రాచీన భారతీయ జ్ఞానమైన ‘వసుధైవ కుటుంబకం’ భావనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసాన్ని ప్రస్తావిస్తూ.. స్వావలంబనపైనే భారత శ్రేయస్సు ఆధారపడి ఉందని శ్రీ గోయల్ అన్నారు.

2047 నాటికి సంపన్నమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన స్వర్ణాంధ్ర రాష్ట్ర సాకారం దిశగా ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రపంచ చరిత్రలో ఓ కీలక మలుపు వద్ద నేడు భారత్ ఉందన్నారు. అనేక దశాబ్దాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రపంచ క్రమం ఇప్పుడు పునర్లిఖితమవుతోంది. ఇలాంటి అగమ్యగోచర, అస్థిర, అనిశ్చిత సమయాల్లోనూ.. స్థిరత్వానికి, నిలకడకు భారత్ నమ్మకమైన కేంద్రంగా నిలుస్తోంది. “ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు సాకారం కావాలంటే.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం స్వావలంబనగా సాధించాలి” అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను ఆయన గుర్తు చేశారు.

న్యూఢిల్లీలోని భారత్ మండపం మాదిరిగానే పెద్ద ఎత్తున సమావేశాలు, ప్రదర్శనలు, సదస్సుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ఓ శాశ్వత కేంద్రాన్ని నిర్మించాలని కేంద్ర మంత్రి సూచించారు. ఈ ప్రపంచ స్థాయి సమావేవ కేంద్రానికి ‘ఆంధ్ర మండపం’ అనే పేరును ప్రతిపాదించారు.

భారత పురోగతిని ముందుకు నడపడంలో, సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ప్రభుత్వం - పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో అంకితభావంతో కృషి చేసిన సీఐఐ అధ్యక్షుడు శ్రీ రాజీవ్ వేమాని, సెక్రటరీ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీని కేంద్ర మంత్రి ప్రశంసించారు.

 

***

 

(Release ID: 2190447) Visitor Counter : 5