వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత్ భారత్-2047 కోసం ఆంధ్రప్రదేశ్‌ అందిస్తున్న సహకారంతో విశ్వసనీయ ప్రపంచ భాగస్వామిగా ఎదుగుతున్న భారత్: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్


దేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీని ఓర్వకల్‌లో ప్రారంభించినట్లు ప్రకటన

40,000 లకు పైగా ఉద్యోగాలను సృష్టించనున్న డ్రోన్ సిటీ

Posted On: 14 NOV 2025 7:53PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025 30వ ఎడిషన్‌లో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ... ‘వికసిత్ భారత్-2047’ దార్శనికత సాకారంలో ఆంధ్రప్రదేశ్ సహకారంతో భారత్ విశ్వసనీయ ప్రపంచ భాగస్వామిగా ఆవిర్భవిస్తోందన్నారు. సెమీ కండక్టర్లు, పరిశుద్ధ ఇంధనం, ఆవిష్కరణల-ఆధారిత పరిశ్రమల్లో పెరుగుతున్న భారత నాయకత్వాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. భారత ఆర్థిక విధానానికి పునాదిగా నమ్మకం, సుస్థిరత, విధాన స్థిరత్వాల ప్రాముఖ్యాన్ని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

"టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ - నావిగేటింగ్ ది న్యూ జియోఎకనామిక్ ఆర్డర్" థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ సమక్షంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ ప్రారంభించారు. సదస్సులో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగాలు చేశారు.

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ వద్ద దేశంలోని మొట్టమొదటి డ్రోన్ సిటీని ప్రారంభించినట్లు శ్రీ గోయల్ ప్రకటించారు. ఇది తదుపరి తరం ఏరోస్పేస్, మానవరహిత వ్యవస్థల్లో భారత సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుందన్నారు. 2025 అక్టోబర్ 16న కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్‌లకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అనంతంరం ఈ రోజు ప్రారంభం జరిగింది. ఇది భారత పారిశ్రామిక కారిడార్‌లలో వేగవంతమైన పురోగతి పట్ల ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసిన 300 ఎకరాల డ్రోన్ సిటీ, 40,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందనీ... ప్రపంచంలోనే అతిపెద్ద సాధారణ డ్రోన్ పరీక్షా సౌకర్యాంగా నిలుస్తుందని భావిస్తున్నారు. తయారీ, పరీక్ష, పరిశోధన, మరమ్మతులు, అభివృద్ధి కోసం సంపూర్ణ సమగ్ర వ్యవస్థగా ఇది పనిచేస్తుంది. డ్రోన్ ఆవిష్కరణలో కీలక విభాగాలను ఇది ఒక ఏకీకృత మౌలిక సదుపాయాల కిందకు తీసుకువస్తుంది.

ఎన్ఐసీడీసీ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పారిశ్రామిక కారిడార్‌లలో మూడు ప్రధాన గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నోడ్‌లను కృష్ణపట్నం, ఓర్వకల్, కొప్పర్తిలలో అభివృద్ధి చేస్తోంది. ప్రాంతీయ పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్ర వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఇది బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్టులు మేక్ ఇన్ ఇండియా దార్శనికతకు మద్దతునిస్తాయి. లాజిస్టిక్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ పరిశ్రమలకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తాయి. గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, తీరప్రాంత లాజిస్టిక్స్, రక్షణ, డ్రోన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు పెరుగుతున్న అవకాశాలనూ ఈ సదస్సు ప్రధానంగా ప్రస్తావించింది. రాష్ట్రాన్ని సుస్థిర పారిశ్రామిక వృద్ధికి ప్రధాన కేంద్రంగా నిలిపింది.

"నెక్స్ట్-జెన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ 2.0: బిల్డింగ్ స్మార్ట్, కనెక్టెడ్ ఎకోసిస్టమ్స్ ఫర్ ఇండస్ట్రీ 5.0" ప్లీనరీ సమావేశంలో ఎన్ఐసీడీసీ సీఈవో, ఎమ్‌డీ శ్రీ రజత్ కుమార్ సైనీ పాల్గొన్నారు. తయారీ, ఆవిష్కరణల కోసం స్మార్ట్ అయిన, సమర్థమైన, సుస్థిరమైన కేంద్రాలుగా గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలనే ఎన్ఐసీడీసీ దార్శనికతను ఆయన వివరించారు. ఇండస్ట్రీ 5.0 దార్శనికతకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా సమర్థ పారిశ్రామిక వ్యవస్థలను సృష్టించడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, ఆటోమేషన్, డేటా-ఆధారిత పాలనల ఏకీకరణను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

సదస్సులోని ఎన్ఐసీడీసీ పెవిలియన్‌లో ప్రపంచ పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ ప్రతినిధుల బలమైన భాగస్వామ్యం నమోదైంది. ఇది గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫామ్, లాజిస్టిక్స్ డేటా బ్యాంక్, ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్, పీఎమ్ మిత్రా పార్కుల వంటి ఎన్ఐసీడీసీ ప్రధాన కార్యక్రమాలను ప్రదర్శించింది. డిజిటల్, సమర్థమైన, సుస్థిరమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ఎన్ఐసీడీసీ సమగ్ర విధానాన్ని ఇవి వివరిస్తాయి. పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్యక్రమం కింద భూ లభ్యత, పెట్టుబడులను సులభతరం చేయడం, సహకార అవకాశాలపై సమాచారాన్ని కోరుతూ ఎన్ఐసీడీసీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల ప్రతినిధులు గణనీయ ఆసక్తిని కనబరిచారు.

పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంగా ఎన్ఐసీడీసీ... ఢిల్లీ–ముంబయి, చెన్నై–బెంగళూరు, అమృత్‌సర్–కోల్‌కతా, తూర్పు తీరం, ఇతర పారిశ్రామిక కారిడార్ల కింద తదుపరి తరం గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తూనే ఉంది. అధునాతన మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆవిష్కరణల ద్వారా ఎన్ఐసీడీసీ... సుస్థిరత, సాంకేతిక ఏకీకరణ, సమ్మిళిత వృద్ధి ద్వారా వర్గీకరించిన ఇండస్ట్రీ 5.0 దిశగా భారత పరివర్తనను నడిపిస్తోంది.

వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ఆధ్వర్యంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్... తయారీ సామర్థ్యాన్ని పెంపొందించే, పెట్టుబడులను ఆకర్షించే, ఉపాధి కల్పించే ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను కలిగి ఉంది. భారత పారిశ్రామిక, లాజిస్టిక్స్ పరివర్తనకు మద్దతునిస్తూ బహుళ నగర ప్రాజెక్టులను... యూఎల్ఐపీ, ఎల్‌డీబీ, ఐఐఎల్‌బీ వంటి డిజిటల్ కార్యక్రమాలను ఎన్ఐసీడీసీ అమలు చేస్తోంది.

 

***


(Release ID: 2190438) Visitor Counter : 5