వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
రైలు వాణిజ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు భారత్, నేపాల్ ఒప్పందం
భారత్-నేపాల్ రవాణా మార్గాల విస్తరణపై తుది నిర్ణయం.. సంతకాలు
Posted On:
13 NOV 2025 3:30PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్, నేపాల్ ప్రభుత్వ పరిశ్రమ, వాణిజ్య, సరఫరాల మంత్రి శ్రీ అనిల్ కుమార్ సిన్హా మధ్య నేడు ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో భారత్ నేపాల్ మధ్య ఉన్న రవాణా ఒప్పందానికి సంబంధించిన విధానాలను సవరిస్తూ అంగీకార పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ సవరణ ద్వారా జోగ్బాని (భారత్) – బిరత్‌నగర్ (నేపాల్) మధ్య రైలుమార్గం ద్వారా సరుకు రవాణా సులభతరం కానుంది. ఇందులో బల్క్ కార్గో (ప్యాకేజింగ్ లేకుండా పెద్ద మొత్తంలో రవాణా చేసే సరుకు) రవాణా విస్తరణ కూడా ఉంది. ఈ స్వేచ్ఛా విధానం కోల్‌కతా–జోగ్బాని, కోల్‌కతా–నౌతన్వా (సునౌలి), విశాఖపట్నం–నౌతన్వా (సునౌలి) వంటి ప్రధాన రవాణా కారిడార్‌లకు విస్తరించనుంది. తద్వారా రెండు దేశాల మధ్య బహుమాధ్యమ వాణిజ్య అనుసంధానం బలోపేతం అవుతుంది. అంతేగాక ఇతర దేశాలతో నేపాల్ వాణిజ్యం మెరుగుపడే అవకాశం ఉంది.
పైన పేర్కొన్న అంగీకార పత్రం ద్వారా జోగ్బాని-బిరత్‌నగర్ రైలు మార్గం ద్వారా కంటైనర్ సరుకులు, బల్క్ కార్గో రెండిటీ రవాణాకు ప్రత్యక్ష రైలు అనుసంధానం సాధ్యమైంది. ఇది కోల్‌కతా, విశాఖపట్నం ఓడరేవుల నుంచి నేపాల్‌లోని మోరాంగ్ జిల్లాలో ఉన్న నేపాల్ కస్టమ్స్ యార్డ్ కార్గో స్టేషన్‌కు సరుకు రవాణాను సులభతరం చేస్తుంది. భారత ప్రభుత్వ సహాయంతో నిర్మించిన ఈ రైలు మార్గాన్ని 2023 జూన్ 1న భారత్, నేపాల్ ప్రధానమంత్రులు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సమావేశంలో సమగ్ర చెక్ పోస్టులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా సరిహద్దు అనుసంధానాన్ని, వాణిజ్య సౌకర్యాన్ని పెంపొందించడానికి కొనసాగుతున్న ద్వైపాక్షిక కార్యక్రమాలపై కూడా చర్చించారు. నేపాల్ అంతర్జాతీయ వాణిజ్యంలో గణనీయమైన వాటాను కలిగి ఉన్న భారత్.. ఇప్పటికీ ఆ దేశ అతిపెద్ద వాణిజ్య, పెట్టుబడి భాగస్వామిగా కొనసాగుతోంది. ప్రస్తుత చర్యలు రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలపరచడమే కాకుండా ఇతర దేశాలతో నేపాల్ వాణిజ్య సంబంధాలను కూడా మెరుగుపరిచేందుకు అవకాశం కల్పిస్తాయి.
***
(Release ID: 2189756)
Visitor Counter : 3