పర్యటక మంత్రిత్వ శాఖ
నవంబర్ 13 నుంచి 16 వరకు సిక్కింలో 13వ అంతర్జాతీయ పర్యాటక మార్ట్ (ఐటీఎం)
Posted On:
12 NOV 2025 11:20AM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంతం కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ‘అంతర్జాతీయ పర్యాటక మార్ట్ (ఐటీఎం)’ 13వ ఎడిషన్‌ను 2025 నవంబరు 13 నుంచి 16 వరకు సిక్కింలోని గాంగ్‌టక్‌లో నిర్వహిస్తోంది. సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, ఈశాన్య రాష్ట్రాల పర్యాటక మంత్రులు, పర్యాటక శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారుల సమక్షంలో గౌరవ కేంద్ర పర్యాటక – సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మార్టును ప్రారంభిస్తారు.
అంతర్జాతీయ పర్యాటక మార్ట్ అన్నది పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక వార్షిక కార్యక్రమం. భారత అష్టలక్ష్ములైన ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సామర్థ్యాన్ని దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు చాటడం లక్ష్యంగా దీనిని రూపొందించారు. సహజ సౌందర్యం, సాంస్కృతిక వైవిధ్యం, అడ్వెంచర్ టూరిజం అవకాశాలను చాటుతూనే.. సుస్థిర, సమ్మిళిత పర్యాటక అభివృద్ధిని ఈ మార్టు ప్రోత్సహిస్తుంది. ఈశాన్య ప్రాంతాన్ని పర్యావరణ హిత పర్యాటకం, ఆరోగ్యం, సంస్కృతి సాహస విన్యాసాలకు ప్రముఖ గమ్యస్థానంగా నిలిపేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని గాంగ్‌టక్‌లో నిర్వహిస్తున్న ఈ 13వ ఎడిషన్ ద్వారా స్పష్టమవుతోంది.
గ్యాంగ్‌టక్‌లో ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యముంది. సుస్థిర, బాధ్యతాయుత పర్యాటకానికి చిహ్నంగా సిక్కిం జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. కనుచూపుమేర ప్రకృతి రమణీయత, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ఆధ్యాత్మిక వారసత్వం, ఉత్తేజకరమైన స్థానిక సంస్కృతులతో.. సామాజిక, పర్యావరణ స్పృహతో కూడిన పర్యాటకానికి సిక్కిం ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశవ్యాప్తంగా దీనిని ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘ట్రావెల్ ఫర్ లైఫ్’ కార్యక్రమానికి అనుగుణంగా ఈ మార్టును నిర్వహిస్తున్నారు.
స్పెయిన్, థాయిలాండ్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, వియత్నాం సహా దాదాపు 19 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్న ఈ 13వ అంతర్జాతీయ పర్యాటక మార్టుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాతినిధ్యం లభించనుంది. 39 అంతర్జాతీయ పర్యాటక ఆపరేటర్లు, అయిదుగురు అంతర్జాతీయ ఇన్ఫ్లూయెన్సర్లు, 50 దేశీయ కొనుగోలుదారులు, 20 మంది దేశీయ ఇన్ఫ్లూయెన్సర్లు, ట్రావెల్ మీడియాతోపాటు 91 మంది దేశీయ విక్రేతలను ఈ కార్యక్రమం ఒక్కచోటకు చేర్చనుంది. వరుస సాంకేతిక సదస్సులు, నిపుణుల చర్చలు, ఉత్పత్తి ప్రదర్శనలు, దేశీయ - అంతర్జాతీయ పర్యాటక భాగస్వాముల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా వాణిజ్య సమావేశాలు ఈ మార్టులో ఉంటాయి. సినిమా పర్యాటకం, ఆతిథ్య గృహాలు, యువతలో వ్యవస్థాపకత, డిజిటల్ ఆవిష్కరణ, సుస్థిరత, అడ్వెంచర్ టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రాష్ట్ర పర్యాటక శాఖల అధికారులతో చర్చలు నిర్వహిస్తారు.
సుసంపన్నమైన ఈశాన్య రాష్ట్రాల కళాత్మక, ప్రదర్శన సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఈ కార్యక్రమంలో ఉంటాయి. గ్యాంగ్‌టక్‌లోను, ఆ చుట్టుపక్కల ఉన్న రుంటెక్ మఠం, డో డ్రూల్ చోర్టెన్, నామ్యాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీ వంటి ప్రముఖ ప్రాంతాలకు సాంకేతిక పర్యటనలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. వన్యప్రాణులు – నదీయాన పర్యాటకం, పండుగలూ వేడుకలు, వారసత్వం – హస్తకళలు, వంట సంప్రదాయాలు, సాహసానుభవాల వంటి పలు అంశాల్లో ఈ ప్రాంత సమర్థతను చాటేలా ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుంది. మార్ట్ ముగిసిన అనంతరం.. అంతర్జాతీయ, దేశీయ పర్యాటకుల కోసం ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ పర్యాటక ప్రాంతాలకు పరిచయ పర్యటనలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఈ ప్రాంత సాంస్కృతిక, సహజ సంపదను ప్రత్యక్షంగా ఆస్వాదించే అవకాశం వారికి కలుగుతుంది.
ఈ విధంగా ఈశాన్య రాష్ట్రాల అసాధారణ ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక వైభవాలకే కాకుండా.. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా గ్యాంగ్‌టక్‌లో నిర్వహిస్తున్న ఈ 13వ అంతర్జాతీయ పర్యాటక మార్టు పునరుద్ఘాటిస్తోంది. ప్రశాంతమైన ప్రకృతి, ఉత్తేజకరమైన సమాజాలు, సుస్థిరత పట్ల అచంచలమైన నిబద్ధతలతో... ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సిక్కిం అత్యంత అనుకూల వేదికగా నిలుస్తుంది. భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తికి, బాధ్యతాయుత పర్యాటక ఆధారిత అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది.
***
(Release ID: 2189458)
Visitor Counter : 7