శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్), జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ (ఎన్ఐసీడీసీ) మధ్య భాగస్వామ్యం...
దేశంలోని పారిశ్రామిక కారిడార్లలో ఆవిష్కరణల ప్రోత్సాహమే లక్ష్యం
Posted On:
12 NOV 2025 4:46PM by PIB Hyderabad
దేశంలో ఏర్పాటు చేయబోతున్న పారిశ్రామిక కారిడార్లలో సీఎస్ఐఆర్ పరిశోధన - అభివృద్ధి నైపుణ్యాలను, అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకోవడం కోసం సహకార విధానాన్ని నెలకొల్పే దిశగా... శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్), జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ (ఎన్ఐసీడీసీ) ఈ రోజు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.
సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కళైసెల్వి, ఎన్ఐసీడీసీ సీఈవో- ఎండీ, ఐఏఎస్ శ్రీ రజత్ కుమార్ సైనీ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రముఖ శాస్త్రవేత్త- టెక్నాలజీ మేనేజ్మెంట్ డైరెక్టరేట్ అధిపతి డాక్టర్ విభా మల్హోత్రా సాహ్నీ, ఎన్ఐసీడీసీ జనరల్ మేనేజర్ (సీఎస్ - మార్కెటింగ్) శ్రీ వికాస్ గోయెల్ న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయంలో దీనిని అధికారికంగా ఆమోదించారు. రెండు సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ వంటి కీలక జాతీయ కార్యక్రమాలకు అనుగుణంగా.. స్వావలంబన, ఆవిష్కరణ ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలను పెంపొందించడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం లక్ష్యం. పరిశ్రమ- విద్యాసంస్థలు- పరిశోధనల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి.. అలాగే హై టెక్ సంస్థల అభివృద్ధిని వేగవంతం చేయడానికి స్మార్ట్ సిటీలలో పరిశోధన - అభివృద్ధి కేంద్రాలు, పారిశ్రామిక ఇంక్యుబేటర్లు, ఆవిష్కరణ కేంద్రాల స్థాపనను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది.
అన్ని రంగాల్లో ఉత్పాదకత, కార్యాచరణ సామర్థ్యం, పర్యావరణ సుస్థిరతను పెంపొందించడం లక్ష్యంగా.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించడం, అందిపుచ్చుకోవడం, అమలు చేయడంపై ఈ భాగస్వామ్యం ప్రముఖంగా దృష్టి సారిస్తుంది. పారిశ్రామిక యాంత్రీకరణ, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, అధునాతన సామగ్రి, డిజిటల్ తయారీ, రోబోటిక్స్, ఏరోస్పేస్, మౌలిక వసతుల ఇంజినీరింగ్, రసాయన, ఔషధ, వైద్య పరికరాల రంగాలు, శాస్త్రీయ పరికరాలు, వ్యావసాయక ప్రాసెసింగ్, సుస్థిరత ప్రాతిపదికగా వినియోగ సేవలు ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయి.
శాస్త్రీయ ఆవిష్కరణలను పారిశ్రామికాభివృద్ధితో అనుసంధానించడం ద్వారా.. తయారీలో, సాంకేతికతలో అంతర్జాతీయ అగ్రగామిగా భారత్ స్థానాన్ని బలోపేతం చేసే దిశగా ఈ అవగాహన ఒప్పందం ముఖ్యమైన ముందడుగు.
***
(Release ID: 2189454)
Visitor Counter : 7