శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్వయం సమృద్ధ హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రపంచ పరివర్తనలో భారత్ పాత్ర కీలకం
డీప్-టెక్, పరిశుద్ధ ఇంధన ఆవిష్కరణల వేగవంతం కోసం రూ. 1 లక్ష కోట్లతో ఆర్‌డీఐ పథకం
సంపూర్ణ గ్రీన్ హైడ్రోజన్ వాణిజ్య కార్యకలాపాలను ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా ఏర్పాటు కానున్న నాలుగు హైడ్రోజన్ వ్యాలీలు
ఐసీజీహెచ్-2025లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
12 NOV 2025 5:10PM by PIB Hyderabad
స్వయం-సమృద్ధ హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రపంచ పరివర్తనలో ప్రస్తుతం భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 3వ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు (ఐసీజీహెచ్–2025)లో ఆయన ప్రసంగించారు.
పరిశుద్ధ ఇంధనం ఇకమీదట పర్యావరణ ఎంపికకు సంబంధించిన విషయం కాదనీ... దేశ వృద్ధి కోసం "ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక అత్యవసరం" అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
భవిష్యత్తు కోసం సుస్థిర పరిష్కారాలను రూపొందించడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలను ఒకచోట చేర్చే సహకార నమూనా ద్వారా భారత్ పరిశుద్ధ ఇంధన మార్పు దిశగా ముందుకు సాగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. "భారత్ హరిత సాంకేతికతలను స్వీకరించడం మాత్రమే కాదు - మనం వాటిని ఆవిష్కరిస్తాం... వాటిని నడిపిస్తాం... మన దార్శనికత, దృఢ సంకల్పంతో ప్రపంచాన్నీ ముందుకు నడిపిస్తాం" అని ఆయన అన్నారు. హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థను భారత ఇంధన భద్రత, పారిశ్రామిక సామర్థ్యాలకు మూలస్తంభంగా ఆయన అభివర్ణించారు.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ... శాస్త్ర, సాంకేతిక విభాగం... శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన విభాగాల సహకారంతో నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం నిర్వహించిన ఈ రెండు రోజుల సమావేశం... భారత గ్రీన్ హైడ్రోజన్ పరివర్తన కోసం భవిష్యత్ ప్రణాళికను రూపొందించడానికి విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ ప్రముఖులను ఒకచోటుకు చేర్చిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కీలక కార్యక్రమాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ... ఉత్పత్తి, నిల్వ నుంచి... రవాణా, వినియోగం వరకు పూర్తి హైడ్రోజన్ వాణిజ్య కార్యకలాపాలను ప్రదర్శించేలా మొత్తం రూ. 485 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా నాలుగు హైడ్రోజన్ వ్యాలీలను అభివృద్ధి చేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఇందులో రూ. 169.89 కోట్లు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద కేటాయించినవి కాగా, రూ. 315.43 కోట్లు పరిశ్రమ, కన్సార్టియం భాగస్వాముల ద్వారా సమకూర్చనున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.
డీఎస్‌టీ రూపొందించిన ఈ హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్లు ఇప్పుడు ఎమ్ఎన్ఆర్ఈ ఎన్‌జీహెచ్ఎమ్ కింద విలీనమయ్యాయన్నారు. భారత మొట్టమొదటి భారీ-స్థాయి హైడ్రోజన్ ప్రదర్శన ప్రాజెక్టులను ప్రదర్శించడం కోసం... ఆవిష్కరణ, ప్రామాణీకరణ, విధాన రూపకల్పనలకు లివింగ్ లాబొరేటరీలుగా సేవలందించడం కోసం వీటిని అభివృద్ధి చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 3న ప్రారంభించిన పరిశోధనాభివృద్ధి-ఆవిష్కరణల (ఆర్‌డీఐ) పథకాన్ని కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. "ఆవిష్కరణలు, విస్తరణల మధ్య వారధిగా నిలిచే చరిత్రాత్మక ముందడుగు"గా ఈ పథకాన్ని ఆయన అభివర్ణించారు. రూ. 1 లక్ష కోట్ల ప్రారంభ పెట్టుబడితో పాటుగా శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ. 20,000 కోట్ల కేటాయింపుతో ఈ పథకం డీప్-టెక్, పరిశుద్ధ ఇంధన ఆవిష్కరణల బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంకురసంస్థలు, పరిశ్రమల క్రియాశీల భాగస్వామ్యాన్నీ ఇది ప్రోత్సహిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే నిధుల నుంచి దీర్ఘకాలిక శాస్త్రీయ, ఆర్థిక సుస్థిరతను నిర్ధారించే మరింత సహకారాత్మక, సుస్థిర నమూనా దిశగా పరివర్తనను ఈ కార్యక్రమం సూచిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
విద్యారంగం, పరిశ్రమలు, ప్రభుత్వాన్ని ఒక మిషన్-ఆధారిత ప్రణాళిక కింద ఏకీకృతం చేయడంలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటును కీలక సంస్కరణగా డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు. పరిశుద్ధ ఇంధనం, అధునాతన తయారీ, సుస్థిరతల విషయంలో భారత శాస్త్రీయ సామర్థ్యాలు జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉండేలా ఈ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఆయన అన్నారు.
మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్ - ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎమ్ఏహెచ్ఏ–ఈవీ) ఉదాహరణను ఉటంకిస్తూ... ఎలక్ట్రిక్ మొబిలిటీ, హైడ్రోజన్ ఇంధన సాంకేతికతల్లో దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా స్వయం-సమృద్ధ భారత్ స్ఫూర్తిని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా అధునాతన బ్యాటరీలు, ఫ్యూయల్ సెల్స్, స్కేలబుల్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ మిషన్ ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, ప్రైవేట్ భాగస్వాములను ఒకచోటుకు చేర్చిందని ఆయన తెలిపారు.
పరిశుద్ధ ఇంధన రంగ సహకారం విషయంలో ప్రపంచస్థాయిలో భారత్ నాయకత్వాన్ని ప్రధానంగా ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్... "మిషన్ ఇన్నోవేషన్" అనే పదాన్ని మొదట ప్రధానమంత్రి మోదీ ఉపయోగించారని గుర్తు చేశారు. మిషన్ ఇన్నోవేషన్ 2.0 కింద అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో కిలో క్లీన్ హైడ్రోజన్ ధరను 2 అమెరికన్ డాలర్లకు తగ్గించడానికి, 2030 నాటికి భారత హైడ్రోజన్ వ్యాలీ నమూనాను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి భారత్ కృషి చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. "ఈ మిషన్‌లో భారత్ నాయకత్వం... పరిశుద్ధమైన, సురక్షితమైన భవిష్యత్తు కోసం సైన్స్, ఆవిష్కరణలు, వ్యాపార సంస్థల సమష్టి కృషిని ప్రదర్శిస్తుంది" అని ఆయన అన్నారు.
దేశం మొత్తం ఏకోన్ముఖ ప్రభుత్వంగా పనిచేస్తూ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను పలు మంత్రిత్వ శాఖల మధ్య సహకారానికి ఒక నమూనాగా మార్చిన విధానాన్నీ కేంద్ర మంత్రి ప్రశంసించారు. సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు... ఆయా రంగాల్లో చర్చలను వేగవంతం చేసినందుకు... ఎమ్ఎన్ఆర్ఈ, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం, ఎమ్వోపీఎన్జీ, డీఎస్‌టీ, డీఎస్ఐఆర్లను ఆయన అభినందించారు.
2047 నాటికి వికసిత్ భారత్ దిశగా సాగుతున్న భారత ప్రయాణానికి స్వయం-సమృద్ధ హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థ ఒక మూలస్తంభమని పేర్కొంటూ డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు. “ఆవిష్కరణలు, సహకారం, సమష్టి సంకల్పం ద్వారా మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు. పరిశుద్ధ ఇంధన లక్ష్యాల సాకారం కోసం సంబంధిత సంస్థలు, వ్యక్తులంతా కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి కోరారు.
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద వై. నాయక్... నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మిషన్ డైరెక్టర్ శ్రీ అభయ్ బక్రే... అవాడ గ్రూప్ చైర్మన్ శ్రీ వినీత్ మిట్టల్... సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆకాష్ త్రిపాఠి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2189452)
Visitor Counter : 16