వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత ఎగుమతి వ్యవస్థ బలోపేతం కోసం రూ.25,060 కోట్లతో ‘ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌’కు మంత్రిమండలి ఆమోదం

Posted On: 12 NOV 2025 8:16PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఇవాళ ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం)కు ఆమోదం తెలిపింది. దేశం నుంచి ఎగుమతుల పరంగా పోటీతత్వాన్ని బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ఇది ‘ఎంఎస్‌ఎంఈ'లు, తొలిసారి ఎగుమతిదారులు, శ్రామికశక్తి ఆధారిత రంగాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్ 2025–26లో ప్రకటించిన కీలక కార్యక్రమం.

ఎగుమతులను ప్రోత్సహించేందుకు రూపొందించిన సమగ్ర, సరళ, డిజిటల్ ఆధారిత చట్రానికి అనుగుణంగా రూ.25,060 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఇది 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 వరకు అమలులో ఉంటుంది. అనేక వేర్వేరు పథకాలకు బదులుగా ప్రపంచ వాణిజ్య సవాళ్లతోపాటు ఎగుమతిదారుల భవిష్యత్‌ అవసరాలపై వేగంగా స్పందించే ఫలితాధారిత ఏకైక, సానుకూల యంత్రాంగం వైపు వ్యూహాత్మక మార్పును ‘ఈపీఎం’ సూచిస్తుంది.

కేంద్ర ఆర్థిక, వాణిజ్య, ‘ఎంఎస్‌ఎంఈ’ మంత్రిత్వ శాఖలతోపాటు ఆర్థిక సంస్థలు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, కమాడిటీ బోర్డులు, పారిశ్రామిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇతర కీలక భాగస్వాముల సహకార చట్రంలో భాగంగా ‘ఈపీఎం’ అమలవుతుంది.

ఈ కార్యక్రమం రెండు సమీకృత ఉప-పథకాల ద్వారా అమలవుతుంది:

·         నిర్యత్ ప్రోత్సాహన్: దేశంలోని ‘ఎంఎస్‌ఎంఈ’లకు అందుబాటు వాణిజ్య రుణ సౌలభ్యం కల్పించడంతోపాటు కొత్త మార్కెట్లలోకి వైవిధ్యీకరణ దిశగా ఇ-కామర్స్ ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ, మూడో పక్షం నుంచి రుణ ప్రదాన సేవలు, సహ-గ్యారంటీలు, క్రెడిట్ కార్డులు వంటి మార్గాల్లో రుణ పరపతి మెరుగుదలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది.

·         నిర్యత్‌ దిశ: ఎగుమతి నాణ్యత, నిబంధనల అనుసరణ మద్దతు, అంతర్జాతీయ బ్రాండింగ్, ప్యాకేజింగ్, వాణిజ్య ప్రదర్శనలలో భాగస్వామ్యం, ఎగుమతి గిడ్డంగులు, రవాణా సదుపాయాలు, అంతర్గత రవాణా వ్యయం వాపసులు, వాణిజ్య సమాచారం, సామర్థ్య వికాస కార్యక్రమాలు సహా మార్కెట్ సంసిద్ధత, పోటీతత్వం పెంపు, ఆర్థికేతర సదుపాయాల కల్పన తదితరాలపై ఈ పథకం  దృష్టి సారిస్తుంది.

వడ్డీ సమానీకరణ పథకం (ఐఈఎస్‌), మార్కెట్ సౌలభ్య కార్యక్రమం (ఎంఏఐ) వంటి కీలక ఎగుమతి మద్దతు పథకాలను ‘ఈపీఎం’ ఏకీకృతం చేయడంతోపాటు వాటిని సమకాలీన వాణిజ్య అవసరాలకు తగినట్లుగా రూపొందిస్తుంది.

దేశం నుంచి ఎగుమతులకు అవరోధంగా పరిణమించే మూల సమస్యలను పరిష్కరించే విధంగా రూపొందిన ఈ కార్యక్రమంలో కింది అంశాలు కీలకంగా ఉన్నాయి:

·         పరిమిత, వ్యయ భరిత వాణిజ్య రుణ పరపతి సౌలభ్యం.

·         అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణానుగుణ అధిక వ్యయం.

·         ఎగుమతి బ్రాండింగ్ కొరత, బహుళ మార్కెట్ సౌలభ్యం

·         అంతర్గత, స్వల్ప ఎగుమతి సాంద్రతగల ప్రాంతాల్లో ఎగుమతిదారులకు రవాణా పరమైన ప్రతికూల ప్రభావాలు.

ప్రపంచ సుంకాల్లో ఇటీవలి పెరుగుదలతో ప్రభావితమైన వస్త్రాలు, చర్మ, రత్నాలు-ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, సముద్ర ఉత్పత్తుల వంటి రంగాలకు ఈపీఎం ద్వారా ప్రాధాన్య మద్దతు లభిస్తుంది. ఎగుమతి ఆర్డర్ల నిలకడ, ఉద్యోగాలకు రక్షణ, కొత్త భౌగోళిక ప్రాంతాలకు వైవిధ్యీకరణ దిశగా మద్దతివ్వడంలో ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయి.

ఈ కార్యక్రమ అమలు సంస్థగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) వ్యవహరిస్తుంది. ఈ మేరకు దరఖాస్తు నుంచి సరఫరా వరకూ అన్ని ప్రక్రియలనూ ఇప్పటికేగల వాణిజ్య వ్యవస్థలతో అనుసంధానించిన ప్రత్యేక డిజిటల్ వేదికల ద్వారా నిర్వహిస్తుంది.

ఇవీ ‘ఈపీఎం’ లక్ష్యాలు:

·         ‘ఎంఎస్‌ఎంఈ’లకు అందుబాటు వాణిజ్య ఆర్థిక సహాయ సౌలభ్యం కల్పన.

·         నిబంధనల అనుసరణ, ధ్రువీకరణ మద్దతు ద్వారా ఎగుమతి సంసిద్ధత పెంపు.

·         భారతీయ ఉత్పత్తులకు మార్కెట్ సౌలభ్యం, ప్రాచుర్యం మెరుగుదల.

·         సంప్రదాయేతర జిల్లాలు, రంగాల నుంచి ఎగుమతుల పెంపు దిశగా కృషి.

·         తయారీ, రవాణా, అనుబంధ సేవలలో ఉపాధి సృష్టి.

భారత ఎగుమతి చట్రాన్ని మరింత సార్వజనీనం, సాంకేతికాధారితం, ప్రపంచవ్యాప్త పోటీతత్వంతో పటిష్ఠంగా రూపొందించే భవిష్యత్తు దృక్పథ సహిత కృషిని ఈపీఎం ప్రతిబింబిస్తుంది. అలాగే ఇది వికసిత భారత్ @2047 దార్శనికతకు అనుగుణంగానూ అమలవుతుంది.

 

***


(Release ID: 2189443) Visitor Counter : 8