వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ - న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై నాలుగో రౌండ్ చర్చలు
· సత్వర, సమతౌల్య, సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా నిబద్ధతను పునరుద్ఘాటించిన ఇరుపక్షాలు
Posted On:
08 NOV 2025 10:55AM by PIB Hyderabad
భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఇరుపక్షాల మధ్య అయిదు రోజుల పాటు జరిగిన నిర్మాణాత్మక చర్చల అనంతరం.. భారత్ - న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై నాలుగో రౌండ్ చర్చలు ఆక్లాండ్, రోటోరువాలో ఈ రోజు ముగిశాయి.
ఈ రౌండ్‌లో స్పష్టమైన పురోగతి సాధించినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి శ్రీ టాడ్ మెక్‌క్లే తెలిపారు. ఆధునిక, సమగ్ర, భవిష్యత్ సన్నద్ధ ఎఫ్‌టీఏ దిశగా అంకితభావంతో కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.
వస్తువులు, సేవల వాణిజ్యం, ఆర్థిక - వాణిజ్య సహకారం, మౌలిక నియమాలు సహా పలు కీలక అంశాలపై ఇరు పక్షాలు వివరణాత్మకంగా చర్చించాయి. సమర్థ, సమ్మిళిత, సుస్థిరాభివృద్ధికి చేయూతనిచ్చేలా పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్య నిర్మాణంతోపాటు ఆర్థిక సంబంధాల బలోపేతంపై ఉమ్మడి లక్ష్యానికి ఈ చర్చలు నిదర్శనం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో అంతర్జాతీయ శ్రేయస్సు, సురక్షిత సరఫరా వ్యవస్థలకు దోహదపడేలా బలమైన ఆర్థిక భాగస్వామ్యాల ఏర్పాటుకు భారత్ కట్టుబడి ఉంది. ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని, పెట్టుబడుల అనుసంధానాలను బలోపేతం చేస్తుందని, సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని విశేషంగా పెంచుతుందని, అలాగే వ్యాపారాల్లో స్థిరత్వాన్ని మెరుగుపరచడంతోపాటు మార్కెటును అందుబాటులోకి తెస్తుందని మంత్రులు పేర్కొన్నారు.
ఈ ఒప్పంద ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు.. త్వరితగతిన, సమతౌల్యంతో, పరస్పరం ప్రయోజనకరంగా దీనిని ఖరారు చేయడం దిశగా ఇరు దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ చర్చలు ప్రతిబింబిస్తున్నాయి.
2024–25 ఆర్థిక సంవత్సరంలో న్యూజిలాండ్‌తో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 1.3 బిలియన్ డాలర్లు. గతేడాదితో పోలిస్తే ఇందులో దాదాపు 49 శాతం వృద్ధి నమోదైంది. ప్రతిపాదిత ఎఫ్‌టీఏ వ్యవసాయం, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం, ఔషధాలు, విద్య, సేవల వంటి రంగాలలో సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందనీ.. తద్వారా వ్యాపారాలతోపాటు వినియోగదారులకు కొత్త అవకాశాలను అందిస్తుందని భావిస్తున్నారు.
పరస్పర కృషితో వేగాన్ని కొనసాగించడానికి, ఉమ్మడి సంకల్పంతో అన్ని అధ్యాయాల్లో వివరణాత్మక చర్చల కొనసాగింపునకు ఇరుపక్షాలు అంగీకరించాయి. భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఎఫ్‌టీఏపై చర్చలను వేగవంతం చేసి, త్వరగా ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా ఇదో కీలక ముందడుగు.
***
(Release ID: 2188167)
Visitor Counter : 11