వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతను పెంపొందించే, అపరిష్కృత అంశాలను తగ్గించే ప్రత్యేక ప్రచారం 5.0లో కీలక విజయాలు సాధించిన డీపీఐఐటీ
డీపీఐఐటీ నిర్వహించిన ‘వ్యర్థాల నుంచి సంపద’లో రబ్బరు వ్యర్థాలను నాణ్యమైన రోడ్లుగా మలిచిన భారత రబ్బర్ మెటీరియల్ పరిశోధనా సంస్థ
प्रविष्टि तिथि:
06 NOV 2025 11:57AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ), దాని అనుబంధ సంస్థలు ప్రత్యేక ప్రచారం 5.0ను విజయవంతంగా పూర్తి చేశాయి. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్పీజీ) మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. అన్ని కార్యాలయాల్లోనూ స్వచ్ఛతా నియమాలను సంస్థాగతం చేయడం, పెండింగులో ఉన్న అంశాలను సకాలంలో పరిష్కరించడంపై ఈ ప్రచారం దృష్టి సారించింది.
ఈ సమయంలో డీపీఐఐటీ ఆధ్వర్యంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భారతీయ రబ్బర్ మెటీరియల్ పరిశోధనా సంస్థ (ఐఆర్ఎంఆర్ఐ) ‘‘వ్యర్థాల నుంచి సంపద’’ కార్యక్రమాన్ని అమలు చేసింది. దీనిలో భాగంగా రబ్బరు వ్యర్థాలను ఉపయోగించి ఒక రోడ్డును, వృథాగా మిగిలిన రబ్బరు టైల్స్ ఉపయోగించి అనుబంధ రోడ్డును నిర్మించారు. టైరు వ్యర్థాల సమస్యను పరిష్కరించేలా, రోడ్డు నాణ్యతను, మన్నికను మెరుగుపరిచేలా 10 నుంచి15 శాతం రబ్బరు వ్యర్థాలతో కూడిన వినూత్న సిమెంట్ మిశ్రమమైన క్రంబ్ రబ్బర్ సిమెంట్ కాంక్రీట్ (సీఆర్‌సీసీ)ను దీనికోసం ఉపయోగించారు. ఈ రహదారి సామర్థ్యం, వ్యాకోచతత్వం, మన్నికకు సంబంధించిన ప్రమాణాలను శాస్త్రీయంగా పరీక్షించారు. పర్యావరణ అనుకూలమైన ఈ విధానం.. సుస్థిర మౌలిక వసతులకు సంబంధించిన నమూనాగా నిలుస్తుంది. అలాగే.. ఆవిష్కరణలు, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ సూత్రాలకు అనుగుణమైన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 70 ప్రాంతాల్లో 500 స్వచ్ఛతా లక్ష్య యూనిట్ (సీటీయూ)లలో డ్రైవ్‌లను నిర్వహించడం ద్వారా 100 శాతం స్వచ్ఛతా లక్ష్యాలను డీపీఐఐటీ సాధించింది. ఎంపిక చేసిన ప్రతి చోటా.. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా స్వచ్ఛమైన, సమర్థమైన పని ప్రదేశాలను నిర్వహించాలన్న నిబద్ధతను ఈ విభాగం ప్రదర్శించింది.
ఈ స్వచ్ఛతా కార్యక్రమాలకు అదనంగా.. ఈ ప్రచారానికి సంబంధించిన కీలకమైన అంశాల్లో డీపీఐఐటీ గణనీయమైన పురోగతిని సాధించింది. 1,572 ఫైళ్లను (100 శాతం లక్ష్యం) సమీక్షించి వాటిలో 1,119 ఫైళ్లను తొలగించింది. తద్వారా 11,235 చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఖాళీ అయింది. అలాగే..వ్యర్థాలను తొలగించడం ద్వారా రూ.17,69,569 ఆదాయం సమకూరింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, అప్పీళ్లు, ఫైళ్లు, ఈ-ఫైళ్ల సమీక్ష, స్వచ్ఛతా కార్యక్రమాలను డీపీఐఐటీ దాదాపు 100 శాతం పూర్తి చేసింది. ఇది జవాబుదారీతనం, సమర్థమైన రికార్డు నిర్వహణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. సిబ్బంది సౌకర్యం, ఉత్పాదకతను మెరుగుపరిచేలా మొత్తం కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచడంపై సైతం దృష్టి సారించింది.
ఈ కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి 31 వరకు జరిగింది. దీనికి సంబంధించిన సన్నద్ధత కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు కొనసాగింది. ఈ సమయంలో డీపీఐఐటీ చేపట్టిన ప్రయత్నాలు స్వచ్ఛత, వ్యవస్థీకృత రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులను పరిష్కరించడంపై అవగాహనను పెంపొందించాయి. దాదాపుగా అన్ని లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ పనితీరులో సామర్థ్యం, జవాబుదారీతనం, పారిశుద్ధ్య సంస్కృతిని పెంపొందించాలనే అంకితభావాన్ని డీపీఐఐటీ పునురుద్ఘాటించింది.
***
(रिलीज़ आईडी: 2186919)
आगंतुक पटल : 17