శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన చారిత్రాత్మక రూ. లక్ష కోట్ల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) నిధి పథకాన్ని ప్రశంసిస్తూ, భారత శాస్త్రీయ ప్రయాణంలో దానిని మార్పుదాయక మైలురాయిగా అభివర్ణించిన డాక్టర్ జితేంద్ర సింగ్
మొదటి ఈఎస్టీఐసీ 2025 ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ, మూడు రోజుల కార్యక్రమం విజయవంతం కావడం పట్ల సంతోషాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్
యువ పరిశోధకులు, డీప్-టెక్ స్టార్టప్ లు నవ భారత ఆవిష్కరణల స్ఫూర్తిని కలిగి ఉన్నాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
‘ ఏకొన్ముఖ ప్రభుత్వ, ఏకొన్ముఖ దేశం‘ విధానానికి ఈ సదస్సు ఉత్తమ ఉదాహరణగా నిలిచింది: మంత్రి
మిషన్ 2047 నిర్దేశించిన శాస్త్రీయ ప్రతిభ, సాంకేతిక సృష్టి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి ప్రపంచ కేంద్రంగా ఆవిర్భవించే దిశగా భారత్ ప్రయాణం: డాక్టర్ జితేంద్ర సింగ్
ఆర్డీఐ పథకం, ఏఎన్ఆర్ఎఫ్ వంటి కార్యక్రమాలు దీర్ఘకాల పరిశోధన వృద్ధి కోసం విద్యాసంస్థలు, పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకారాన్ని పెంపొందిస్తాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
05 NOV 2025 8:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన చారిత్రాత్మక రూ. లక్ష కోట్ల పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణల (ఆర్డీఐ) నిధి పథకాన్ని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు, దీనిని భారతదేశ శాస్త్రీయ ప్రయాణంలో ఒక మార్పుదాయక మైలురాయిగా ఆయన అభివర్ణించారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన మొట్టమొదటి ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ (ఈఎస్టీఐసీ) 2025 లో ముగింపు ప్రసంగం చేస్తూ, ఈ మూడు రోజుల సమావేశం విజయవంతం కావడం గర్వకారణమని, దీని ద్వారా మంచి ఫలితాలు రాగలవని డాక్టర్ సితేంద్ర సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం "భారత మండపాన్ని నిజమైన ఆవిష్కరణల దేవాలయంగా మార్చింది. ఇక్కడ ఆలోచనలు స్ఫూర్తిని పొందాయి. పరిశోధన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆవిష్కరణకు సంకల్పం తోడైంది” అని కేంద్ర మంత్రి అన్నారు.
'మిషన్ 2047' లో నిర్దేశించిన విధంగా శాస్త్రీయ ప్రతిభ, సాంకేతిక సృష్టి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి ప్రపంచ కేంద్రంగా ఆవిర్భవించే దిశగా భారత్ ప్రయాణం సాగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీరిక లేని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ సమావేశానికి పూర్తి గంట సమయాన్ని కేటాయించడం సైన్స్, ఆవిష్కరణలకు ప్రభుత్వం ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను తెలియచేస్తోంది. జీవ పోషకాలు అధికంగా ఉన్న పంటలు, పోషకాహార భద్రత మొదలుకొని వ్యక్తిగత వైద్యం, స్వచ్ఛ ఇంధనం, జీవ ఎరువుల వరకు అన్ని కీలక రంగాలను గురించి ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు” అని డాక్టర్ సితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ఆధునిక పరిశోధన, ఆవిష్కరణల రంగాలలో జాతీయ ప్రాధాన్యతలను సమన్వయం చేయడానికి 13 మంత్రిత్వ శాఖలను, విభాగాలను ఒకచోట చేర్చిన ఈ సదస్సును అర్ధవంతంగా రూపొందించి, నిర్వహించినందుకు గాను ముఖ్య శాస్త్రీయ సలహాదారు కార్యాలయాన్ని మంత్రి అభినందించారు. నోబెల్ బహుమతి గ్రహీత సర్ ఆండ్రే గైమ్‌తో పాటు పలువురు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు కూడా సమావేశంలో పాల్గొనడాన్ని ఆయన ప్రశంసించారు. 11 ప్రధాన అంశాలపై జరిపిన వారి చర్చలు వచ్చే దశాబ్దానికి వ్యూహాత్మక మార్గదర్శక ప్రణాళికను రూపొందిస్తాయని అన్నారు.
సదస్సులో యువ పరిశోధకులు, డీప్-టెక్ స్టార్టప్‌ల భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ, వారి శక్తి, తెలివితేటలు, నిబద్ధత ‘నవ భారత‘ ఆవిష్కరణల స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ సింగ్ అన్నారు. భాగస్వామ్యాలు, పెట్టుబడులను కోరుకునే యువ ఆవిష్కర్తలకు పోస్టర్, స్టార్టప్ సెషన్లు విలువైన నెట్వర్కింగ్ వేదికగా పనిచేశాయని ఆయన పేర్కొన్నారు.
“సదస్సులో పాల్గొన్న మన యువ భాగస్వాములలో చాలా మంది విద్యాపరమైన ప్రదర్శనల ప్రపంచంలోకి కొత్తగా ప్రవేశించినవారు. వారి పరిశోధనలను సమర్థవంతంగా వ్యక్తపరిచేలా మార్గనిర్దేశనం చేయాలి. వారు , భవిష్యత్తులో సైన్స్ రంగ నాయకులుగా ఎదిగేలా ప్రోత్సహించాలి” అని ఆయన అన్నారు.
పోస్టర్ ప్రెజెంటర్లకు వారి ప్రదర్శన నాణ్యతను మెరుగుపరచడం, అభ్యాస ఫలితాలను పెంచడం కోసం వర్చువల్ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. భవిష్యత్తులో జరిగే ఈఎస్టీఐసీ సదస్సుల్లో స్టార్టప్‌ల, పెట్టుబడిదార్ల మధ్య నిర్మాణాత్మక సమావేశాలను నిర్వహించాలని కూడా ఆయన సూచించారు. నూతన ఆవిష్కర్తలను ఆశాజనక భాగస్వాములతో అనుసంధానం చేయాలని అన్నారు.
“ఇటువంటి కార్యక్రమాలకు హాజరయ్యే పెట్టుబడిదారులు కేవలం చూడటానికి మాత్రమే రారు. వారు స్పష్టమైన భాగస్వామ్యాల కోసం చూస్తారు. స్టార్టప్‌ల వివరాలను సరైన పెట్టుబడిదారులతో మనం ముందుగానే మిళితం చేయగలిగితే, ఫలవంతమైన భాగస్వామ్యాలను సులభతరం చేయగలం" అని ఆయన పేర్కొన్నారు. .
భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో ప్రధాన చర్చలను సంక్షిప్తంగా, సమర్థవంతంగా నివేదించడానికి ఒకే రిపోర్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఇది ప్లీనరీ సెషన్లలో సమయాన్ని ఆదా చేస్తుందని . మంత్రి సూచించారు.
మంత్రిత్వ శాఖలు, విద్యాసంస్థలు, పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన “ఏకోన్ముఖ ప్రభుత్వం, ఏకోన్ముఖ దేశం“ విధానానికి ఈ సదస్సు ఉదాహరణగా నిలిచిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ చర్చలు విద్యాసంస్థలు, పరిశ్రమ, ప్రభుత్వాల మధ్య సమన్వయానికి సంస్థాగత వెన్నెముక వంటి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) దీర్ఘకాల లక్ష్యాలకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే, ఈఎస్టీఐసీ 2025 తో పాటు నిర్వహించిన వైభవ్ ఫెలోషిప్ సెషన్‌లను కూడా కేంద్రమంత్రి ప్రశంసించారు, మాతృ దేశానికి సేవలందించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ శాస్త్రవేత్తలలో ఉన్న ఆకాంక్షను ఇవి ప్రతిబింబించాయని అన్నారు. వైభవ్ ఫెలోస్ ఉత్సాహం కేవలం విద్యారంగ సహకారం పైనే కాకుండా, దేశం పట్ల భావోద్వేగ, మేధోపరమైన నిబద్ధతను ప్రతిబింబించింది. వారిని మరింతగా ఆకర్షించే నిర్మాణాత్మక మార్గాలను మనం కనుగొనాలి” అని ఆయన అన్నారు.
ఈఎస్టీఐసీ 2025 భారత సైన్స్ రంగం అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని, ఈ సమావేశం ద్వారా ఉత్పన్నమైన ఆలోచనలు, భాగస్వామ్యాలు “వికసిత భారత్ 2047” లక్ష్యానికి అనుగుణమైన ఆచరణాత్మక విధానాలు, కార్యక్రమాలుగా రూపుదిద్దుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
"మా లక్ష్యం స్పష్టంగా ఉంది. అది భారతదేశాన్ని సైన్స్, ఆవిష్కరణ, సాంకేతికతలో ప్రపంచ శక్తిగా మార్చడం. మీ ఆలోచనలు, మీ సహకారాలు మీ ప్రయోగాలు స్వావలంబన సాధనకు సిద్ధంగా ఉన్న దేశానికి దోహదపడే అంశాలు” అని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈఎస్టీఐసీ 2025 ను ఘనంగా విజయవంతం చేసినందుకు అన్ని మంత్రిత్వ శాఖలకు, శాస్త్రీయ సంస్థలకు, పరిశ్రమలకు ఆయన అభినందనలు తెలియచేశారు.
***
(Release ID: 2186917)
Visitor Counter : 5