లోక్‌సభ సచివాలయం
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో ఆయనకు నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న
600 మందికి పైగా విద్యార్థులతో మాట్లాడిన లోక్‌సభ స్పీకర్
దేశ నిర్మాణానికి స్ఫూర్తినిస్తున్న ఐక్యత, క్రమశిక్షణ అనే సర్దార్ పటేల్ ఆశయాలు: లోక్‌సభ స్పీకర్
భారత్‌ను ఆశాజ్యోతిగా, పురోగతి- స్థిరత్వానికి నిలయంగా చూస్తోన్న ప్రపంచం: లోక్‌సభ స్పీకర్
దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించడంలో భారత యువతకు మార్గనిర్దేశం
చేస్తున్న సర్దార్ పటేల్ దార్శనికత: లోక్‌సభ స్పీకర్
నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2025 5:25PM by PIB Hyderabad
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు- మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ, న్యాయ శాఖ- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్యసభ ఉపసభాపతి శ్రీ హరివంశ్, పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పీ.సీ. మోదీ, ఇతర ప్రముఖులు కూడా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో ప్రైడ్ నిర్వహించిన “మీ నాయకుడిని తెలుసుకో” అనే కార్యక్రమంలో దేశ నలుమూలల నుంచి పాల్గొన్న 600 మందికి పైగా విద్యార్థులతో లోక్‌సభ స్పీకర్ మాట్లాడారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడిన లోక్‌సభ స్పీకర్.. సర్దార్ పటేల్ దార్శనికత, విలువలతో మార్గనిర్దేశం పొందుతున్న భారత యువత, ఆవిష్కరణలు, విజ్ఞానం, సాంకేతికత, నాయకత్వం ద్వారా దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నారని అన్నారు. ఐక్యత, క్రమశిక్షణ అనే సర్దార్ పటేల్ మార్గదర్శక విలువలను ప్రస్తావించిన ఆయన.. పటేల్ ఇచ్చిన స్ఫూర్తి దేశం కోసం నిస్వార్థంగా పనిచేయడానికి దేశ యువజనులను నిరంతరం ప్రేరేపిస్తుందని అన్నారు. ప్రపంచం భారత్‌పై పెంచుకుంటున్న విశ్వాసం.. బలమైన భారత్‌తో పాటు మరింత సమానమైన, సుసంపన్నమైన ప్రపంచాన్ని తయారు చేస్తోన్న మన యువత కృషి, సృజనాత్మకత, నిబద్ధతకు నిదర్శనం అని ఆయన అన్నారు.
దేశ యువత సాధించిన విజయాలను ఓం బిర్లా ప్రశంసించారు. నేడు కృత్రిమ మేధ, డిజిటల్ సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, హరిత ఇంధనం, ఆవిష్కరణ వంటి రంగాల్లో భారతీయ యువత ప్రపంచ నాయకులుగా ఎదిగారని పేర్కొన్నారు. వాళ్ల విజయాలు సాంస్కృతిక వారసత్వం నుంచి వచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూనే ఆధునికతను స్వీకరిస్తున్న ఆత్మవిశ్వాసం, దూరదృష్టి గల దేశాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. విజ్ఞానం, వ్యవస్థాపకత నుంచి దౌత్యం, పరిపాలన వరకు ప్రతీ రంగంలోనూ భారత యువత దేశ ప్రగతి వేగాన్ని, లక్షణాన్ని నిర్వచిస్తున్నారని ఆయన తెలిపారు.
నేడు ప్రపంచం భారత్‌ను ఆశజ్యోతిగా, పురోగతి - స్థిరత్వానికి కేంద్రంగా చూస్తోందని.. దీనికి మన యువత శక్తి, ప్రతిభ, సంకల్పమే కారణమని శ్రీ ఓం బిర్లా పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అందించిన దార్శనిక నాయకత్వం భారత రాజకీయ ఐక్యత, పరిపాలనా సామర్థ్యానికి పునాదులు వేసిందని అన్నారు. ధైర్యం, దూరదృష్టి, రాజనీతిజ్ఞత ద్వారా సర్దార్ పటేల్ వందలాది సంస్థానాలను దేశంలో విలీనం చేసి.. అప్పుడే స్వాతంత్ర్యం పొందిన భారత్ ఐక్యతతో కూడిన సార్వభౌమ దేశంగా ఆవిర్భవించేలా చూసుకున్నారని పేర్కొన్నారు.
సర్దార్ పటేల్ పరివర్తనాత్మక నాయకత్వాన్ని ప్రధానంగా ప్రస్తావించిన లోక్‌సభ స్పీకర్.. ఆయన స్వాతంత్ర్య స్ఫూర్తిని పరిపాలన వ్యవస్థగా మార్చారని అన్నారు. తద్వారా బలం, సమగ్రత ఆధారంగా వేళ్లూనుకున్న ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ వేదికపై భారత్ బలంగా నిలబడేందుకు మార్గం సుగమం చేశారని అన్నారు. ఐక్యత ద్వారా బలం, క్రమశిక్షణ ద్వారా వ్యవస్థ, కర్తవ్యం ద్వారా సేవ అనే సర్దార్ పటేల్ ఆశయాలు.. జ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణలతో నడిచే ఈ యుగంలో కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని తెలిపారు.
యువతపై దృష్టి సారించే దేశాలదే 21వ శతాబ్దం అన్న ఓం బిర్లా.. భారత్‌కు ఉన్న యువ జనాభా దేశానికి ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక ప్రయోజనమని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం సృజనాత్మకత, వ్యవస్థాపకత, శాస్త్రీయ శ్రేష్ఠతలో భారీ వృద్ధిని చూస్తోందని అన్నారు. ఈ తరం ఆవిష్కరణ స్ఫూర్తి, సామాజిక శ్రేయస్సు పట్ల వారికి ఉన్న నిబద్ధత.. భారత్‌ను ప్రపంచ నాయకత్వ స్థానంతో పాటు సమస్య పరిష్కర్తగా నిలబడే ఒక కొత్త అంతర్జాతీయ పరిస్థితిని రూపొందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ భారీ పాత్రను పోషిస్తున్న ప్రస్తుత తరుణంలో మానవాళి మొత్తానికి ప్రయోజనం చేకూర్చే విధానాలు, సాంకేతికతలు, భాగస్వామ్యాలను రూపొందించడంలో యువత దేశాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారని శ్రీ బిర్లా విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2185545)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24