బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఘనమైన వేడుకల నడుమ 51వ కార్యాచరణ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కోల్ ఇండియా


సీఐఎల్ ఇండియాను 'ఇంధన జీవనాధారం'గా ... కార్మికులను 'బొగ్గు యోధులు'గా అభివర్ణించిన కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి

నాడు పోస్టు చేయడమైనది: 01 NOV 2025 8:57PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా (సీఐఎల్) ఒక ముఖ్యమైన మైలురాయిని పూర్తి చేసుకుంది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీఐఎల్ నిన్న తన 51వ కార్యాచరణ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సంస్థ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోల్‌కతాలోని కోల్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి వీడియో అనుసంధానం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, సీఐఎల్ ప్రస్తుత ఛైర్మన్ శ్రీ సనోజ్ కుమార్ ఝా, డైరెక్టర్ (హెచ్ఆర్) డాక్టర్ వినయ్ రంజన్, డైరెక్టర్ (మార్కెటింగ్) శ్రీ ముఖేష్ చౌదరి, డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ ముఖేష్ అగర్వాల్, డైరెక్టర్ (టెక్నికల్) శ్రీ అచ్యుత్ ఘటక్, డైరెక్టర్ (బిజినెస్ డెవలప్‌మెంట్) శ్రీ ఆశీష్ కుమార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ బ్రజేష్ కుమార్ త్రిపాఠి, సీఐఎల్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సమావేశాన్ని ఉద్దేశించి వీడియో అనుసంధానం ద్వారా ప్రసంగించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి... 51వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కోల్ ఇండియా కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గు కార్మికులను "బొగ్గు యోధులు"గా, కోల్ ఇండియాను భారత 'ఇంధన జీవనాధారం'గా అభివర్ణించిన కేంద్ర మంత్రి... దేశ ఇంధన భద్రతను నిర్ధరించడంలో కోల్ ఇండియా పోషిస్తున్న కీలక పాత్రను కొనసాగించాలని కోరారు. గత ఐదు దశాబ్దాలుగా మాన్యువల్ మైనింగ్ నుంచి ఆటోమేషన్ ఆధారిత కార్యకలాపాలకు 'ఇంధన ఆవిష్కర్త'గా కోల్ ఇండియా రూపాంతరం చెందిందని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. కొనసాగుతున్న ఇంధన పరివర్తన మధ్య రాబోయే దశాబ్దం కీలకమని ప్రస్తావిస్తూ... నిరంతర ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. కోల్ ఇండియా భవిష్యత్తు వృద్ధికి కార్యకలాపాల విస్తరణను మూలస్తంభంగా పేర్కొన్న కేంద్ర మంత్రి... కార్యకలాపాలను విస్తరించే కార్యక్రమాలపై నిరంతరం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించాలనీ, ఉత్తమ నాణ్యత గల బొగ్గును సరఫరా చేయాలని, ఉద్యోగులకు అత్యుత్తమ సౌకర్యాలను అందించాలని, సమ్మిళిత వృద్ధిని నిర్ధారించడానికి సీఎస్ఆర్ పరిధిని విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కోల్ ఇండియా అనుబంధ సంస్థ సీఎమ్‌పీడీఐ రూపొందించిన కోల్ అట్లాస్‌ను శ్రీ జీ కిషన్ రెడ్డి వీడియో అనుసంధానం ద్వారా విడుదల చేశారు. కొత్తగా అభివృద్ధి చేసిన కోల్ అట్లాస్ భారతీయ బొగ్గు క్షేత్రాల్లో అత్యంత-కచ్చితమైన భౌగోళిక మ్యాపింగ్, జాతీయ వనరులు-నిల్వల తాజా అంచనాలు, పరిశ్రమ, విధాన రూపకర్తల కోసం నవీకరించిన కోల్ బ్లాక్ ఇన్వెంటరీ, బొగ్గు నాణ్యత, నిర్మాణాలు, కీలక అన్వేషణల ఫలితాలపై డేటా ఆధారిత అవగాహనను అందిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2023–24లో వివిధ కార్యాచరణ డొమైన్‌లలో అత్యుత్తమ పనితీరు, శ్రేష్ఠత కోసం ప్రకటించిన కార్పొరేట్ అవార్డులనూ శ్రీ కిషన్ రెడ్డి అందజేశారు.

ఈ వేడుకలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ ఈసీఎల్‌కు చెందిన గోపీనాథ్‌పూర్, చినకూరి ఎమ్‌డీవో ప్రాజెక్టులనూ కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులను రెవెన్యూ షేరింగ్ నమూనా కింద అభివృద్ధి చేసి నిర్వహిస్తారు. ఈసీఎల్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు మంత్రి వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారు. ఈసీఎల్ కార్యాచరణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏఐ-ఆధారిత సీసీటీవీ కెమెరాల ద్వారా విస్తృత శ్రేణి కార్యాచరణ, భద్రత, నిఘా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి... నిర్వహించడానికి... సరైన సమయంలో స్పందించడానికి... ఒక కేంద్రీకృత వ్యవస్థగా ఐసీసీసీ పనిచేస్తుంది.

ఈ సందర్భంగా బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, సీఐఎల్ చైర్మన్ శ్రీ సనోజ్ కుమార్ ఝా ప్రసంగిస్తూ, కోల్ ఇండియా గొప్ప వారసత్వాన్ని... సంస్థకు గల ప్రస్తుత, భవిష్యత్తు అవకాశాలను ప్రధానంగా ప్రస్తావించారు. కంపెనీ ప్రస్తుతం యాంత్రిక కార్యకలాపాల ద్వారా దేశ ఇంధన అవసరాల్లో 55 శాతం అవసరాలను తీరుస్తోందని శ్రీ ఝా తెలిపారు. ఈ ఉత్సాహాన్ని మరింత శక్తితో కొనసాగించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ... ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ పెరుగుతున్న దేశ అంచనాలను అందుకోవడానికి కోల్ ఇండియా పునరుత్పాదక ఇంధనం, బొగ్గు గ్యాసిఫికేషన్, కీలక ఖనిజాల వంటి రంగాల్లో కార్యకలాపాలను విస్తరించడం ద్వారా తన వ్యాపార నమూనాను మార్చుకోవాలని ఆయన సూచించారు.

51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో సీఐఎల్, బొగ్గు మంత్రిత్వ శాఖ భారత వృద్ధికి శక్తినిచ్చే వారసత్వాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నాయి. సుస్థిరమైన, స్వయం-సమృద్ధమైన, కర్బన-స్పృహ కలిగిన భవిష్యత్తు దిశగా ముందుకు సాగుతున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2185510) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी