గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశం
प्रविष्टि तिथि:
30 OCT 2025 6:09PM by PIB Hyderabad
2025 అక్టోబర్ 30న బెంగళూరులో కేంద్ర గృహనిర్మాణం- పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ గారి అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి మంత్రుల తొలి ప్రాంతీయ సమావేశం జరిగింది. 2025 జూలై 17న ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పట్టణాభివృద్ధి మంత్రుల సమావేశం ప్రస్తుత ప్రాంతీయ చర్చలకు పునాది వేసింది.
ఈ ప్రాంతీయ సమావేశాన్ని కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి మంత్రులను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. పట్టణాభివృద్ధి రంగంలో ఉన్న కీలక సమస్యలు, సవాళ్లు, అవకాశాలపై లోతుగా చర్చించి.. వాటికి పరిష్కారాలు, ఉమ్మడి కార్యాచరణను రూపొందించడానికి ఈ సమావేశం దోహదపడింది.
ఈ సమావేశంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి- ఉప ముఖ్యమంత్రి శ్రీ డీ.కే. శివకుమార్, పట్టణాభివృద్ధి- పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి శ్రీ సురేశ బీ.ఎస్, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ రహీమ్ ఖాన్… కేరళ స్థానిక స్వపరిపాలన- ఎక్సైజ్, స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి శ్రీ ఎం.బీ. రాజేష్.. పుదుచ్చేరి గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ పీ.ఆర్.ఎన్. తిరుమురుగన్.. రాష్ట్ర - కేంద్ర పాలిత ప్రాంతాల సీనియర్ ఆధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్టణ గృహనిర్మాణం- పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి.. గృహనిర్మాణం- పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి.. జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్) డైరెక్టర్, ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రెండు భాగాలుగా చర్చలను చేపట్టారు. మొదటి భాగంలో బెంగళూరు నగర పట్టణ ప్రాధాన్యతలపై దృష్టి సారించగా.. రెండో భాగంలో రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర పథకాలు, కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. కేంద్ర మంత్రి స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్, పీఎంఏవై, మెట్రో ప్రాజెక్టులు, పీఎం-ఈబస్ వంటి పథకాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా వాటి అమలులో ఉన్న సవాళ్లపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు తీసుకోవాల్సిన ఆచరణాత్మక చర్యలను ఈ సమావేశంలో ప్రతిపాదించారు. ప్రస్తుత చర్చల లాంటి కార్యక్రమాల ద్వారా ప్రాంతీయ భాగస్వాములతో కలిసి పనిచేసే విషయంలో మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర మంత్రులు అభినందించారు. ముఖ్యమైన అంశాలను అనుసరించేందుకు, పురోగతిని పర్యవేక్షించడానికి గృహనిర్మాణం- పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏ).. క్షేత్రస్థాయి సందర్శనలు, రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్‌లను కూడా ప్రారంభించింది.
భారతదేశ పట్టణాభివృద్ధిని వేగవంతం చేసేందుకు.. ఉమ్మడి ప్రాధాన్యతలు, ప్రాంతీయ అవకాశాలు, పరస్పర అవగాహన కోసం ఉపయోగపడే సంస్కరణలకు ఉన్న మార్గాలను గుర్తించేందుకు ఇలాంటి ప్రాంతీయ సమావేశాలను దేశంలోని ఇతర ప్రాంతాల్లో క్రమం తప్పకుండా నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలన్నింటినీ 2025 నవంబర్ 8- 9 తేదీలలో ఢిల్లీలోని యశోభూమిలో జరగనున్న జాతీయ పట్టణ సదస్సుకు ఆహ్వానించారు. ఈ సదస్సులో అన్ని ప్రాంతీయ సమావేశాల్లోని చర్చలను, నేర్చుకున్న విషయాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. 'వికసిత్ భారత్- 2047' లక్ష్యానికి అనుగుణంగా సమ్మిళిత, సుస్థిర ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన నగరాలను తయారుచేయాలనే ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించనుంది. ఇందులో పట్టణ పరివర్తన కోసం ఒక సమష్టి కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించనున్నారు.
***
(रिलीज़ आईडी: 2184441)
आगंतुक पटल : 21