వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జెమ్ వేదిక వినియోగాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జెమ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం మధ్య చర్చలు


జెమ్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లు జరిగేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహకారం

Posted On: 30 OCT 2025 11:37AM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ (జెమ్) వేదికను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు జెమ్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) శ్రీ మిహిర్ కుమార్ భోపాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ ను కలిసి, చర్చించారు.

కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పీఎస్‌యూలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, స్థానిక, పంచాయతీ రాజ్ సంస్థలు సహా అన్ని ప్రభుత్వ కొనుగోలుదారులకు ఏకీకృత, పారదర్శక, సమర్థవంతమైన ఆన్ లైన్ కొనుగోలు వ్యవస్థను అందించాలనే జెమ్ లక్ష్యాన్ని ఈ సమావేశం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత, సమ్మిళితత్వం, జవాబుదారీతనాన్ని మరింత పెంచేందుకు, పటిష్టమైన, సరళీకృత కొనుగోలు విధాన వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జెమ్ వినియోగాన్ని వేగవంతం చేసే జాతీయ వ్యూహంలో భాగంగా, అత్యధిక జీఎంవీ గల రాష్ట్రాలతో సీఈఓ స్థాయి చర్చలతో సహా ప్రత్యేక సంప్రదింపుల కార్యక్రమాలను జెమ్ ప్రారంభించింది. రాష్ట్ర కొనుగోలు నిబంధనలు, సాధారణ ఆర్థిక నియమాలను (జీఎఫ్ఆర్), జెమ్ సాధారణ నిబంధనలు, షరతులకు (జెమ్-జీటీసీ) అనుగుణంగా మార్చాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రోత్సహిస్తూ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ లేఖ రాశారు. కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ కొనుగోళ్లు జెమ్ ద్వారా జరిగేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరారు.

మధ్యప్రదేశ్‌లో విస్తరిస్తున్న జెమ్ వేదికపై రాష్టం నుంచి 86,000 మందికిపైగా విక్రయదారులు తమ ప్రొఫైళ్లను నమోదు చేసుకున్నారు. జెమ్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర కొనుగోలుదారుల నుంచి రూ.5,523 కోట్ల విలువైన ఆర్డర్లు, ఇతర రాష్ట్రాల కొనుగోలుదారుల నుంచి రూ.2,030 కోట్ల విలువైన ఆర్డర్లు, కేంద్ర ప్రభుత్వ కొనుగోలుదారుల నుంచి రూ.20,298 కోట్ల విలువైన ఆర్డర్లను మధ్యప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఈలు) పొందాయి.

జాతీయ ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలో రాష్ట్ర వృద్ధిని ఈ భాగస్వామ్యం సూచిస్తుంది. విస్తృత ప్రభుత్వ మార్కెట్ ప్లేస్ అందుబాటులోకి తీసుకురావటం ద్వారా స్థానిక సంస్థలను శక్తిమంతం చేయటంలో జెమ్ పాత్ర స్పష్టమవుతోంది.

జెమ్ ద్వారా జరిగిన స్థూల వ్యాపార విలువ (జీఎంవీ) కొత్త రికార్డులను సాధిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయటానికి, అన్ని రకాల సరఫరాదారులకు సమాన అవకాశాలు కల్పించటానికి మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సమావేశం దోహదపడుతుంది.

ప్రతి విక్రయదారు, ముఖ్యంగా చిన్న, అభివృద్ధి చెందుతున్న సంస్థలు.. పారదర్శక, సాంకేతిక ఆధారిత భారత ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలో చురుకుగా పాల్గొనేలా న్యాయమైన, సాంకేతిక సమగ్రత, సమ్మిళితత్వ సంస్కృతిని పెంపొందించేదుకు జెమ్ ప్రాధాన్యతనిస్తుంది.

 

***


(Release ID: 2184252) Visitor Counter : 7